కడప జిల్లాపై సీఎం రమేష్ హవా కు టిడిపి అధినేత బ్రేక్ లు వేస్తున్నారా ..? లోకేష్ కూడా అదే బాట లో వెళుతున్నారా ? అవుననే అంటున్నారు తమ్ముళ్ళు. కడప జిల్లాపై ఒకప్పుడు సీఎం రమేష్ చెప్పిందే వేదంగా టిడిపి అధిష్టానం అడుగులు వేసింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కీలకమైన కడపజిల్లాపై సీఎం రమేష్ బాగా పట్టు సాధించారు. గత ఎన్నికల్లో ఆయన చెప్పిన వారికే టికెట్లు దక్కాయి. ప్రతి నియోజకవర్గంలో రమేష్ తన టీం ను సెట్ చేయడం నెమ్మదిగా నియోజకవర్గాల ఇంచార్జ్ లలో కలవరానికి కారణం అయ్యింది. ప్రతి చోట రెండేసి గ్రూప్ లు పార్టీ ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్నాయని చంద్రబాబు లోకేష్ గుర్తించారు. దీనికి ప్రధాన కారణం రమేష్ అని భావించిన బాబు, లోకేష్ లు నష్ట నివారణ చర్యలను వ్యూహాత్మకంగా మొదలు పెట్టారు.కొంతకాలంగా ముఖ్యమంత్రికి రమేష్ కి గ్యాప్ బాగా పెరిగిందన్న వార్తలు వెలువడ్డాయి. ఆయనకు రాజ్యసభ రెండొవసారి గ్యారంటీ లేదనే ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా బాబు ఆయన అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమర్శలకు తెరపడింది. కానీ తాజాగా ఆయనపై విమర్శలు, ఆరోపణలకు వరదరాజులు రెడ్డి రూపంలో సీఎం రమేష్ పై దాడి మొదలైపోయింది.రమేష్ పై విరుచుకుపడేందుకు పార్టీ వర్గాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ధాటిగా ఆరోపణలు విమర్శలతో అంతా సిద్ధమైపోయారు. దీనిపై రంగంలోకి దిగనున్న అధిష్టానం రమేష్ కి లక్ష్మణ రేఖ గీయనుందని పార్టీ వర్గాలనుంచి వస్తున్న సమాచారం. మొత్తానికి ఈ రగడ మరో రకంగా పార్టీ కి చేటు తెచ్చేలా వుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వున్న కొన్ని జిల్లాలో అసంతృప్తులు ఇప్పుడు రోడ్డెక్కితే పార్టీ పరువు బజారున పడుతుందన్న ఆందోళన తమ్ముళ్లలో నెలకొంది. అధినేత కస్టపడి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అహరహం శ్రమిస్తుంటే తమ్ముళ్ళు ప్రాంతాల వారీగా వివాదాలు ఏర్పడితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తుంది తెలుగుదేశం క్యాడర్.