YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మేకపాటి సోదరులు ఎక్కడ

 మేకపాటి సోదరులు ఎక్కడ

నెల్లూరు, డిసెంబర్ 3,
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి కుటుంబ సభ్యులు నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. ఉదయగిరి గడ్డ తమదే అన్నట్టు తమ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గా ఉండాలని మేకపాటి ఫ్యామిలీ భావించేది. మొన్నటి ఎన్నికల్లోఎంత మంది టికెట్ కోసం పోటీ పడినా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హైకామాండ్‌ను ఒప్పించి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇప్పించి బరిలో నిలబెట్టారు. అదే కుటుంబం నుంచి నాలుగు సార్లు గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కుటుంబ వ్యవహారాలతో మేకపాటి రాజమోహన్ రెడ్డి పక్కన పెట్టారు.ఉదయగిరి నుంచి 2019 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసిపికి ఓటు వేయకుండా టిడిపికి ఓటు వేశారని ఆరోపణలతో రావడంతో వైసిపి అధిష్టానం ఆయన్ని బహిష్కరించింది అప్పటి నుంచి ఉదయగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా రాజమోహన్‌రెడ్డి మరో తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ని వైసీపీ అధిష్టానం నియమించింది. అప్పటినుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరికి తానే కాబోయే ఎమ్మెల్యేని అన్న ఆలోచనలతో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు. ఎక్కడ మీటింగ్లు, సమావేశాలు జరిగిన తాను నివాసం ఉంటున్న మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి నుండి పోలీసులు ఎస్కార్ట్ తో రావాలని అప్పట్లోనే హుకుం జారీ చేశారు. ఉదయగిరి నియోజకవర్గానికి తాను కాబోయే ఎమ్మెల్యేనని తన మాట వినకపోతే రాబోయే రోజుల్లో తగిన లెక్కలు ఉంటాయని బెదిరింపులకు కూడా పాల్పడినట్లు చెపుతారు.2024 ముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉదయగిరి నియోజకవర్గం టికెట్ కోసం ఎంతోమంది వ్యాపారవేత్తలు పోటీపడినప్పటికీ వైసీపీ అధిష్టానం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలకు కట్టుబడి తన రెండో తమ్ముడైన మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టికెట్ ను కట్టబెట్టింది. అప్పటినుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరిలో మరింత జోరు పెంచారు. తానే ఉదయగిరి కి బాస్ అంటూ తామ గెలిస్తే ప్రతి ఒక్కరి అంతు చూస్తామంటూ ప్రత్యర్థి అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న కాకర్ల సురేష్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ రెడ్‌బుక్కులో రాసుకుంటే తాను బ్లూ బుక్కులో రాసుకుంటున్నానని.. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒకొక్కరి అంతు తేలుస్తానని ప్రచారంలో వార్నింగులు ఇచ్చారు.ఉదయగిరి మండలంలోని కొండ కింద పల్లె గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు ప్రజలను మేకపాటి రాజగోపాల్ రెడ్డి బెదిరించారట. తమకు ఓటు వేయకుండా ఏ ఒక్కరూ టిడిపికి ఓటు వేసిన పల్లె గ్రామాలలో ఒక్కరు కూడా మిగలరని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. మళ్లీ గెలిచి తీరతామన్న ధీమాతో కొండాపురం మండలంలో తాహసిల్దారు ఓ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆయనను ఇష్టమొచ్చినట్లు వాయించారాయన. ఇలా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను, అధికారులను బెదిరించిన ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఘోర పరాజయం పాలయ్యారుపోలింగ్ సమయంలో మేకపాటి ఓటర్లను డబ్బులతో మబ్బు పెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైసిపి అభ్యర్థిగా పోటీచేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరిలో అడ్రస్ లేకుండా పోయారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే ప్రధాన నాయకులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారంట. ఆ క్రమంలో ఇక ఉదయగిరిలో మేకపాటి ఫ్యామిలీ సీన్ అయిపోయిందంటూ.. కొందరు నేతలు కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు . ఉదయగిరి సెగ్మెంట్లో వైసీపీలో దూకుడు ప్రదర్శించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదవుతున్నాయి. కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు తమను పట్టించుకునే వారే లేకుండా పోయారని కన్నీరు పెట్టుకుంటున్నారు. మొత్తానికి ఉదయగిరి వైసీపీ అనాధలా మారిందిప్పుడు.

Related Posts