హైదరాబాద్, డిసెంబర్ 3,
వలసలతో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్‌లో ముఖ్యనేతలు కూడా కనిపించకుండా పోవడం విచిత్రంగా తయారైంది. పొలిటికల్‌గా బ్యాడ్ టైమ్ అంటే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ప్రత్యక్షంగా చవిచూస్తుందిప్పుడు. పదేళ్లు రాజ్యాధికారం చెలాయించి అధికారం శాశ్వతం అన్నట్లు వ్యవహరించిన గులాబీనేతలను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిక్కచచ్చిపోయేలా చేశాయి. ఇకఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరవడం కాదుకదా.. సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక అంపశయ్యపైకి ఎక్కింది. ఆ ప్రభావంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమై.. జనానికి కనిపించడమే మానేశారు. ఒక్కసారి అసెంబ్లీలో కనిపించి మాయమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారు స్టీరింగ్ వదిలేశారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సడన్‌గా కొంతకాలం పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా గులాబీ పార్టీలో నెంబర్ వన్, నెంబర్ టూలు ఇద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరమవ్వడంతో ఇక ఆ పార్టీకి హరీష్‌రావు, కవితలు ఇద్దరే దిక్కయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను కూడా గులాబీ పార్టీ కాపాడుకోలేకపోతుంది. సిట్టింగ్ కంటోన్మెంట్ స్థానం బైపోల్స్‌లో కారు పార్టీకి దూరమైతే .. గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కారు జర్నీ తమ వళ్ల కాదంటూ కాంగ్రెస్ బాట పట్టేశారు. దాంతో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 28 మందికి పడిపోయింది. వారిలో ఎంత మంది లాయల్‌గా ఉంటారన్నదానిపై పార్టీ శ్రేణులకే క్లారిటీ లేదంట. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్న కార్యక్రమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుండటం ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయంటున్నారు.తెలంగాణలో అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నడూ తలవనైనా తలవని దీక్షా దివస్ కు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత దానికి ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చింది. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు.. సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పుకునే కేసీఆర్.. తాను దీక్ష చేశానని చెప్పుకునే రోజును ఎప్పుడూ తలచుకోలేదు. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమైన తెలంగాణ పేరును కూడా పార్టీకి దూరం చేశాక.. ఆయనకు దీక్షా దివస్ గుర్తుకొచ్చింది.జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్న గులాబీబాస్ ఢిల్లీ పీఠంపై కన్నేసి పార్టీ పేరులోంచి తెలంగాణను తీసేశారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం సాగించిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. ఆ మార్పుతోనే తెలంగాణ సెంటిమెంట్ గులాబీ పార్టీకి దూరమైంది. బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు విపక్ష పాత్రలో కూడా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది. తమ పార్టీ గతంలో చేసిన త్యాగాలు, పోరాటాలను ప్రజలకు గుర్తు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన నవంబర్ 19వ తేదీని దీక్షా దివస్ పేర ఘనంగా నిర్వహించాలని చూసింది. రాష్ట్రం నలుమూలలా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, అమర వీరుల స్మారక చిహ్నాల వద్ద సభలు, సమావేశాలు ర్యాలీలు, ప్రార్థనలతో హడావుడి చేయడానికి స్కెచ్ గీశారు. కరీంనగర్‌లోని అలుగునూరులో జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేటలో పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రని హరీశ్ రావు పాల్గొన్నారు. ఇక గత కొన్ని నెలలుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కూడా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.అంత వరకూ బానే ఉన్నా.. బీఆర్ఎస్‌కు ఆ కార్యక్రమంతో ఎలాంటి మైలేజ్ దక్కలేదు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలపెట్టి వచ్చానని చెప్పుకునే కేసీఆర్ ఆ ప్రోగ్రాంలో కూడా ఎక్కడా కనిపించలేదు. కనీసం ఫామ్ హౌస్ వదిలి బయటకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ దీక్షా దివస్ అంటూ ఎంతగా హంగామా చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదు. అది పూర్తిగా ప్రజలకు సంబంధం లేని పార్టీ కార్యక్రమంగా మిగిలిపోయి గులాబీ శ్రేణులకు పెద్ద షాక్ ఇచ్చింది.అలా అట్టర్ ఫ్లాప్ షోలు నిర్వహిస్తున్న కారు పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి కేసీఆర్ బాటనే ఫాలో అవుతూ మరో పెద్ద షాక్ ఇచ్చారు.. కేసీఆర్ స్థానంలో పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించిన కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలకు బ్రేక్ అంటూ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన సంచలనం రేపింది. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సంబంధించి కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యాని ఇంటా బయటా వస్తున్న విమర్శల నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది తాత్కాలిక బ్రేకా.. రాజకీయ సన్యాసమా అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. కేటీఆర్ సోదరి పోలిటికల్ గా యాక్టివ్ అవ్వడం, ఆ వెంటనే కేటీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ కు బ్రేక్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని కేసీఆర్ కూడా భావిస్తున్నారనీ, అందుకే కుమార్తె కవితను రంగంలోకి దింపారన్న టాక్ ఉంది. లేకపోతే పార్టీ పూర్తిగా హరీష్‌రావు చేతుల్లోకి వెళ్లిపోతుందన్న భయంతో గులాబీబాస్ కూతుర్ని యాక్టివ్ చేయాలని భావిస్తున్నారంట.ఒకవైపు బావ హరీష్‌రావుతో పార్టీలో ఆధిపత్యపోరుతో సతమతమవుతుంటే.. చెల్లెలు కవిత కూడా పొలిటికల్‌గా రీ యాక్టివ్ అవుతుండటం కేటీఆర్‌కు నచ్చడం లేదంట. గత పది రోజులుగా యాక్టివ్ అయిన కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీమ్‌ని గాడిలో పెడుతున్నారు. నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులోలో జైలు జీవితం గడిపి బెయిల్ వచ్చాక రెండు నెలల పాటు ఇంటికే పరిమితమైన కవిత.. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. జైల్లో అనారోగ్య సమస్యలకు గురైన ఆమె ఇక పాలిటిక్స్‌లో కనిపించరనుకుంటున్న టైంలో సడన్‌గా యాక్టివ్ అయ్యారు.కవిత రీఎంట్రీపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారంట. కవిత మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదంటూ పంతం పట్టిన కేటీఆర్.. అదే విషయమై తండ్రి కేసీఆర్ తోనూ గొడవ పడ్డారంట. అయతే కేటీఆర్ మాటలను కేసీఆర్ పట్టించుకోలేదంటున్నారు. మరోవైపు అన్న మాటలను కవిత కూడా లెక్కచేయడం లేదంట.. అలా ఫ్యామిలీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగిన కేటీఆర్‌కు సడన్‌గా కేరళలో ప్రకృతి వైద్యం గుర్తుకొచ్చిందంటున్నారు. ఆ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయలకు ప్రకటించిన బ్రేక్ సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి కారు స్టీరింగ్ ఇప్పుడు అయితే హరీష్‌రావు, లేకపోతే కవిత చేతుల్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుందిప్పుడు