రంజాన్ మాసం వచ్చిందంటే చాలు అందరికీ నోరూరించే హలీమ్ తప్పక గుర్తొస్తుంది. మొన్నటి వరకూ హైదరాబాద్ కే పరిమితమైన ఈ వంటకమిప్పుడు కోస్తాంధ్రక కూడా పాకింది. గత నాలుగేళ్లుగా హలీమ్ గోదావరి జిల్లాల్లో జనానికి నోరూరిస్తోంది.
హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన కుక్ లతో హలీమ్ సందడి చేస్తోంది. ముస్లింలు అత్యంత భక్తితో ఆరాధించే మాసం రంజాన్ మాసం. అరబిక్ భాషలో రమదాన్ గా పిల్చుకునే ఈ మాసంలో ముస్లిలు 30 రోజులు కఠిన ఉపవాసదీక్షలో ఉంటారు. ఉదయం తెల్లవారుజాముకు ముందు తీసుకునే సహరీ నుంచి సాయంత్రం దీక్ష విడిచే ఇఫ్తార్ వరకూ కనీసం మంచినీళ్లు సైతం తాగకుండా దీక్ష చేస్తారు.
ఇక కోస్తాంధ్ర లో ఇఫ్తార్ విషయానికొస్తే సాయంత్రం ఉపవాసం విడిచేటప్పుడు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటారు. అదే రాయలసీమలో అయితే ఉప్మారవ్వ లేదా వరి రవ్వతో మసాలా దట్టించి తయారుచేసే జావను తీసుకుంటారు. రోజంతా ఉపవాసదీక్షలో ఉండేవారికి సాయంత్రం ఈ జావతో మంచి బలవర్దకమైన ఆహారం లభించినట్టవుతుంది.ఇక తెలంగాణా ప్రాంతం వచ్చేసరికి ముఖ్యంగా హైదరాబాద్ లో మాత్రం రంజాన్ అంటే చాలు హలీమ్ గుర్తొస్తుంది.
హైదరాబాద్ హలీమ్ ఖ్యాతి ప్రపంచం నలుమూలలా పాకింది. గోధుమరవ్వ, నెయ్యి, పప్పు దినుసులు ఇతరత్రా వాటితో చికెన్ లేదా మటన్ కాంబినేషన్ తో ఇది తయారువుతుంది. దీని తయారీనే ఓ పరిశ్రమగా చెప్పవచ్చు. దాదాపు పది గంటల సేపు ఈ వంటకాన్ని వండుతారు.
సాయంత్రం ఉపవాసదీక్ష విడవగానే వేడి వేడి హలీమ్ తినడం వల్ల ఎక్కడలేని శక్తి కలుగుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే హలీమ్‌ను ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ హలీంను కేవలం ముస్లిం వర్గాలే కాకుండా హిందువులతో పాటు అన్ని మతాల వారు కూడా ఆదరిస్తున్నారు.అయితే ప్రపంచ ఖ్యాతి పొందిన హలీమ్ నాలుగేళ్లక్రితం వరకూ కేవలం హైదరాబాద్ కే పరిమితమయ్యేది. కాని ఇటీవలి కాలంలో రాజమండ్రిలో హలీమ్ సంస్కృతి అధికమైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన కుక్‌లతో ఈ వంటకాన్ని ఇక్కడే తయారు చేయడం వల్ల ఈ ప్రాంత వాసులకు సుపరిచితం అయింది. నాలుగేళ్ల నుంచి క్రమం తప్పకుండా పది, పన్నెండు స్టాల్లు నగరంలో హలీంను తయారుచేస్తున్నాయి. సాయంత్రమైతే చాలు ఈ స్టాళ్లన్నీ కస్టమర్స్‌తో కిటకిటలాడుతున్నాయి. అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తుండటంతో మంచి ఆదరణ వస్తోంది. అయితే మరికొంత మంది హలీమ్ తో పాటు మరో హైదరాబాద్ వంటకమైన రూమాలీ రోటీని కూడా అందిస్తున్నారు.సో...అత్యంత ప్రసిద్ధి గాంచిన హలీమ్ ఇపుడు కేవలం హైదరాబాద్ కే పరిమితం కాదు. అందరికీ అందుబాటులో ఉంటుంది.