తెలుగు ప్రేక్షకులకు ద్విపాత్రాభినయాన్ని, బహుపాత్రాభినయాన్ని రుచి చూపించిన అగ్రశ్రేణి హీరోలు అక్కినేని, నందమూరి వారైతే వారి స్వరాభినయానికి తన కంఠాన్ని జోడించి సుమధుర, సుస్వర సంగీత సౌరభాలను వెదజల్లి, అజరామరమైన పాటలకు ప్రాణంపోసిన మహనీయుడు ఘంటసాల. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఇద్దరూ తెలుగు సినీకళామతల్లికి రెండు నేత్రాలైతే, ఆతల్లి నుదుట ప్రకాశించే కస్తూరితిలకం ఘంటసాల.
*ఇంటిపేరుతోనే ప్రసిద్ధుడు ఘంటసాల*
ఇంటిపేరుతోనే ప్ర్తసిద్ధులైన ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, రత్తమ్మ, సూర్యనారాయణ దంపతులకు కృష్ణా జిల్లా చౌటపల్లిలో 1922 డిసెంబర్ 4 న జన్మించారు. తండ్రి చౌటపల్లి అర్చకత్వంతోబాటు భగవత్సంకీర్తనలు జరిగే చోట మృదంగం కూడా వాయించేవారు. అవి ఎక్కడ జరిగినా తోడుగా ఘంటసాల వెళ్ళేవారు. 1933లో తండ్రి సూరయ్య మరణించే చివరిరోజుల్లో సంగీత సాధనమీద దృష్టి పెట్టమని ఘంటసాలకు సూచించారు. ప్రాధమిక విద్య పూర్తిచేశాక గుడివాడ హైస్కూలులో చేరారు. తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదవగలిగారు. సంగీతం మీద, నాటకాల మీద వున్న మోజుతో కొన్ని నాటక కంపెనీలతో పరిచయాలు పెంచుకొని సతీ ‘సక్కుబాయి’, ‘చింతామణి’ వంటి నాటకాల్లో చిన్నచిన్న వేషాలు వేశారు. తండ్రి ఆశయాన్ని సాధించాలని విజయనగరం సంగీత కళాశాలలో చేరి శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. విజయనగరం వెళ్లడానికి తనవద్ద వున్న ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు తాకట్టు పెట్టి రైలులో విజయనగరం వెళ్లారు. అక్కడి సంగీత కళాశాలలో గాత్ర పండితులుగావున్న పట్రాయని సీతారామశాస్త్రి గారి చొరవతో కళాశాలలో చేరారు. వీధులవెంట తిరిగి మాధుకరం చేస్తూ రెండు సంవత్సరాలలోనే సంగీత శిక్షణ పూర్తిచేశారు. 1940లో ఘంటసాల విజయనగరంలో తొలిసారి సంగీత కచేరీ విజయవంతంగా నిర్వహించారు. 1942 లో చౌటపల్లి చేరుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1943లో బళ్ళారిy కేంద్రకారగారంలో జైలుశిక్షను అనుభవించారు. 1944లో మేనకోడలు సావిత్రిని పెదపులివర్రులో వివాహమాడారు. సముద్రాల రాఘవాచార్య పెదపులివర్రు కు వచ్చినప్పుడు ఘంటసాల గాత్రం విని మద్రాసుకు రమ్మని ఆహ్వానించారు.
మద్రాసులో అడుగుపెట్టిన ఘంటసాలను సముద్రాల వెంటబెట్టుకొని చిత్తూరు నాగయ్య గారి రేణుకా ఫిలిమ్స్ ఆఫీసుకు తీసుకొని వెళ్లారు. అక్కడే ఘంటసాలకు బి.ఎన్.రెడ్డి గారితో పరిచయమైంది. అక్కడ ఘంటసాల పాటలు పాడి వారిని రంజింపజేసేవారు. సముద్రాల గారి సిఫారసుతో 1944 సెప్టెంబర్ 30 న తొలిసారి మద్రాసు రేడియోలో ఘంటసాల త్యాగరాజ కీర్తనలు, తరంగాలు ఆలపించారు. సముద్రాల ఘంటసాలను ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్యకు పరిచయం చేశారు. అప్పుడే బలరామయ్య ‘సీతారామ జననం’ సినిమా నిర్మించబోతున్నారు. అందులో చిన్న చిన్న వేషాలు వేసేందుకు ఘంటసాలను నెలకు 75 రూపాయల జీతం మీద తీసుకున్నారు. అలా బలరామయ్యకు చెందిన ‘ప్రతిభా ఆఫీస్’ లో ‘సీతారామ జననం’లో రాముడుగా నటిస్తున్న అక్కినేని నాగేశ్వరరావు, పేకేటి శివరాంలతో ఘంటసాలకు పరిచయమైంది. శివరాం హార్మోనియం వాయిస్తుంటే ఘంటసాల ‘’పరుగెత్తే మబ్బుల్లారా ప్రపంచమిది గమనిస్తారా?’’ అంటూ పాటలు పాడి వినిపించేవారు. ‘సీతారామ జననం’, ‘త్యాగయ్య’, ‘యోగి వేమన’ చిత్రాలలో ఘంటసాల చిన్న పాత్రల్లో నటించారు. గాలి పెంచలనరసింహారావు, భీమవరపు నరసింహారావు, సాలూరు రాజేశ్వరరావు, వంటి సంగీత దర్శకుల నిర్దేశకత్వంలో కొన్ని సినిమాలకు కోరస్ పాడారు. అలా మూడు సంవత్సరాలపాటు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమాలలోనూ, రేడియో కార్యక్రమాలలోనూ ఘంటసాల గళం వినిపించేది. ‘హిస్ మాస్టర్స్ వాయిస్’ (హెచ్.ఎం.వి) కంపెనీకి ఘంటసాల గ్రామఫోన్ రికార్డులు పాడడానికి వెళ్లారు. అక్కడ రికార్డిస్టుగా వున్న లంకా కామేశ్వరరావు ఘంటసాలకు వాయిస్ టెస్ట్ చేసి "నీది మెటాలిక్ వాయిస్ కనుక నీ కంఠం మైకుకు సరిపడదు" అని పంపివేశారు. ఆ తర్వాత పేకేటి శివరాం హెచ్.ఎం.వి లో రికార్డిస్ట్ & ఇన్ చార్జ్ గా ఉన్నప్పుడు ఘంటసాలను పిలిపించి "నగుమోమునకు నిశానాద బింబము తోడు" అనే చాటుపద్యాన్ని, "గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి" అనే లలిత గీతాన్ని రికార్డుకు రెండవ వైపుల పాడించి 1946, జూలై నెలలో మార్కెట్లోకి విడుదల చేశారు. అలా గ్రామఫోన్ రికార్డులలో ఘంటసాల శకం ప్రారంభమైనదని చెప్పాలి.
*స్వర్గసీమతో గాయకుడిగా*
సినిమాలలో ఘంటసాల గాయకుడుగా పరిచయమైన చిత్రం 1945లో దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డి నిర్మించిన ‘స్వర్గసీమ’. అందులో భానుమతితో కలిసి ‘‘లేయెన్నెల చిరునవ్వుల ఇరజిమ్ము బఠాణీ’’ అనే గాజులపిల్ల పాట పాడారు. భరణీ సంస్థ సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బురామన్ కు ఘంటసాలను సహాయకుడిగా నియమించింది. ఆయన చొరవతోనే ఘంటసాల ‘రత్నమాల’ (1948) చిత్రంలో ‘’అందగాడా ఓబులేశా నన్నుజూచి నవ్వబోకోయి’’ అనే ఏకగళ గీతం, భానుమతితో కలిసి ‘’ఓహో నా ప్రేమధారా జీవనతారా’’; ‘’ఆయే గౌరీ పరమేశుల దరిశనమాయే’’ అనే గీతాలకు వరసలు కట్టి మెప్పించారు.. అదే సంవత్సరం ‘ప్రతిభా’ బ్యానర్ మీద ఘంటసాల బలరామయ్య నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ‘బాలరాజు’ లో ఘంటసాల గాలి పెంచలనరసింహారావుకు సహాయకుడుగా వ్యవహరిస్తూ ఎస్.వరలక్ష్మి ఆలపించిన ‘’ఎవరినే నేనెవరినే’’; ‘’ఓ బాలరాజా జాలిలేదా బాలరాజా’’; వక్కలంక సరళ ఆలపించిన ‘’చాలురా ఇక వగలు చాలురా’’; వక్కలంక సరళతో కలిసి పాడిన ‘’తీయని వెన్నెలరేయి ఎడబాయని వెన్నెల హాయి’’; ‘’నవోదయం శుభోదయం’’ పాటలకు స్వరాలు అల్లారు. అప్పటిదాకా అక్కినేని తన పాటలను తనే పాడుకునేవారు. ఈ చిత్రంతో ఘంటసాల అక్కినేనికి నేపథ్యగాయకుడైనారు. అందులో ‘’చెలియా కనరావా నిరాశబూని పోయితివా’’ అనే పాటను తొలుత అక్కినేనిచేత పాడించి రికార్డు ఛేశారు. అయితే ఆ పాట ఎందుకో అక్కినేనికి పీలగొంతుతో పాడినట్లనిపించి. వ్ంటనే నిర్మాతతో ఆ పాటను ఘంటసాలతో మరలా పాడించమని కోరారు. అలా సినిమాలో ఘంటసాల పాడిన పాటతోబాటు అక్కినేని ఆలపించిన పాట కూడా రికార్డుగా విడుదలైంది. తర్వాతనుంచి అక్కినేనికి ఘంటసాలే పాడుతూ వచ్చారు.
ఘంటసాల స్వరలహరి...
ఘంటసాల స్వరయుగంలో తనతోపాటు ఉన్న సంగీత దర్శకులందరూ సంగీత విద్వాంసులు కావడంతో శాస్త్రీయ రాగాలను రకరకాలుగా ప్రయోగించి చక్కని పాటలకు రూపకల్పన చేశారు. అది ఘంటసాలకు కలిసొచ్చిన అంశం. ఉదాహరణకు ‘వినాయకచవితి’ చిత్రంలో ఘంటసాల ‘శుక్లాం బరధరం’ శ్లోకాన్నిజోడించి, స్వరపరచి టైటిల్ సాంగ్ గా ఆలపించిన ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన ‘వాతాపి గణపతిం భజే... హం వారణాస్యం వరప్రదం’ను హంసధ్వని రాగంలో సాకుమార్యం చెడకుండా స్వరపరచారు. అలా ఈ సంప్రదాయ కీర్తనను జనసామాన్యం లోకి తీసుకెళ్లిన ఘనత ఘంటసాలదే. ఈ కీర్తనను సినీపక్కీలోకి మార్చటానికి ఘంటసాల ఎంతకష్టపడ్డారో అందరికీ తెలియదు. హంసధ్వని రాగంలోనే తేలికైన పద్ధతిలో ఎక్కువ సంగతులు లేకుండా పాడినా ఈ కీర్తన, ఇప్పటికీ ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ఈ కీర్తనతోనే మొదలుపెట్టడం ఒక సంప్రదాయమైపోయింది. తర్వాత ‘శాంతినివాసం’ చిత్రంలో హంసధ్వని రాగంలోనే ‘శ్రీరఘురాం జయరఘురాం’ (పి.బి శ్రీనివాస్) పాటను ఘంటసాల స్వరపరచి హిట్ చేశారనే విషయం తెలియందికాదు. ఆ పాటప్రారంభానికి ముందు వచ్చే ‘శ్రీరామ చంద్రహ ఆశ్రిత పారిజాతహ’ అనే ఆది శంకరుని శ్లోకం కూడా హంసధ్వని రాగంలోనే స్వరపరచారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే...శాస్త్రీయ రాగాలను ఆపోశన పట్టిన ఘంటసాలకు కీర్తనల విలువ, వాటికి మట్లు కట్టాల్సిన రాగాలు కరతలామలకం కావడమే!
ఘంటసాలకు హిందోళ రాగం (మాల్ కోన్స్) మీద మంచి పట్టువుంది. ‘లవకుశ’ సినిమాలో స్వీయ సంగీత దర్శకత్వంలో నాగయ్య గారికి ఘంటసాల ఆలపించిన ‘సందేహించకుమమ్మా, రఘురాముప్రేమను సీతమ్మా’ పాటను హిందోళ రాగ ప్రాధమిక లక్షణాలను మార్చకుండా స్వరపరచడం ; అదే చిత్రంలో లీల, సుశీల చేత పాడించిన ‘రామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతారామ కథను వినరయ్యా’ పాట; బ్రతుకుతెరువు చిత్రంలో ఘంటసాల స్వరపరచి ఆలపించిన ‘అందమె ఆనందం ఆనందమె జీవితమకరందం’ పాటలు ఎంతో జనరంజకం అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలన్నిటినీ ఘంటసాల హిందోళ రాగంలోనే స్వరపరచడం విశేషం.
మోహన రాగంలో స్వరపరచిన పాటలు పదే పదే వినటం వల్ల వాటిలోని మాధుర్యం మరచిపోలేం. అలాంటి పాటల్లో ఘంటసాల సంగీతం అందించిన మాయాబజార్ సినిమాలోని ”లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమె వూగెనుగా’’ పాట ఒకటి. ఈ పాట శుద్ధ మోహన రాగంలోని స్వరాలు తప్ప మరే స్వరాలు ఉపయోగించకుండా, పడవ మీద షికారు పోతూ ప్రేమికులు పాడే పాటగా ఘంటసాల మోహన రాగంలో మలచారు. మెల్లగా, వెన్నెల రాత్రి, చల్లగాలిలో ప్రయాణిస్తూ, మందగమనంతో సాగే ఈ పాటలోని సంగీతాన్ని, సాహిత్యానికి తగిన రాగాన్ని వాడి, సాహిత్యానుభూతికి ధీటైన సంగీతానుభూతి కలిగించారు. అలాగే గుండమ్మ కధ సినిమాలోని “మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే” అనే మోహనం రాగంలోని పాటలో ”నీ మనసు నాదనుకొంటిలే..” అన్నప్పుడు “మనసు” లో నిషాధం పలికించాడు ఘంటసాల. ఇక రహస్యం చిత్రంలో ఘంటసాల స్వరపరచి ఆలపించిన ‘’తిరుమల గిరివాసా దివ్య మందహాసా’’ మోహన రాగ ఫలమే! గమ్మత్తుగా మోహనం రాగం స్వరాలు మాత్రమే ఉపయోగించే ఇంకొక హిందూస్తానీ రాగం “దేశ్‌కార్”. చిరంజీవులు సినిమా కోసం ఘంటసాల స్వరకల్పన చేసిన “తెల్ల వార వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరుందేవులేరా” అన్న పాట “దేశ్‌కార్” రాగం లోనిదే! సంగీత దర్శకుడు పి. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో ‘భక్త తుకారాం’ చిత్రంలో ఘంటసాల ఘనంగా ఆలపించిన ‘‘ఘనా ఘనా సుందరా కరుణారస మందిరా’’ పాట కూడా మోహన రాగప్రసాదమే1
కరుణ, సృజన, భక్తి రసాలకు ఆలవాలమైన అభేరి రాగంలో ఘంటసాల ఒక అద్భుతమైన పాట పాడారు. జయభేరి చిత్రం లో పెండ్యాల స్వరపరచిన ‘’రాగమయీ రావే అనురాగమయీ రావే’’ అనే ఆ పాట ఎంతటి హిట్ సాంగో తెలిసిందే. అలాగే ఆనందనిలయం చిత్రంలో కూడా పెండ్యాల ఘంటసాలచేత ‘’పదిమందిలో పాటపాడినా అది అంకితమెవరో ఒకరికే’’ అనే పాటను అభేరి రాగంలో స్వరపరచి అద్భుతంగా పాడించారు. ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పాతాళభైరవి లో ‘’కలవరమాయే మదిలో నా మదిలో’’ పాటను కూడా ఇదే రాగంలో ‘అద్భుతంగా మలిచారు. గుండమ్మ కథలో ఘంటసాల స్వరపరచిన ‘’ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలానో’’ పాటకు మూలం అభేరి రాగమే. ఆ పాట ఎంతటి హిట్టో చెప్పనవసరం లేదు. ప్రైవేట్ పాటల్లో కూడా ఘంటసాల ఈ రాగాన్ని వాడుకున్నారు. అందుకు ‘’రావోయి బంగారి మామా నీతోటి రహస్య మొకటున్నదోయీ’’ ; ‘స్వాతంత్ర్యమే మా జన్మ హక్కని చాటండీ’’ పాటలు ప్రబల ఉదాహరణలు. విజయావారు నిర్మించిన ‘పెళ్ళిచేసిచూడు’ చిత్రంలో ఘంటసాల స్వరపరచగా పి. లీల ఆలపించిన ‘ఏడుకొండలవాడా వెంకటారమణా సద్దు సేయక నీవు నిదురపోవయ్యా’ పాట చక్రవాక రాగానికి ప్రబల ఉదాహరణ. ఈ పాటను ఘంటసాల జంపె తాళంలో స్వరపరచారు.
కల్యాణి రాగంలో పాడుతూవుంటే అటు పాడినవారికి, ఇటు వింటున్నవారికి ఎప్పటికప్పుడు నిత్యనూతనం అనిపిస్తూనే వుంటుంది. ‘దేశద్రోహులు’ చిత్రంలో సాలూరు రాజేశ్వరరావు స్వరపరచగా ఘంటసాల ఆలపించిన ‘జగమే మారినది మధురముగా ఈవేళ’ అనే పాట ప్రారంభంలో వినిపించే పియానో బిట్ రాజేశ్వరరావు అసలైన కల్యాణి రాగ మార్క్ కి సంకేతం. ఇదే పాటలో ‘’కమ్మని భావమే కన్నీరై చిందెను’’ అన్న తరవాత వచ్చే వయొలిన్ బిట్ వింటుంటే ‘వహ్వా’ అనక తప్పదు. అలాగే రాజేశ్వరరావు ‘మల్లీశ్వరి’ చిత్రంలో ‘’మనసున మల్లెలమాలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో’’ పాటను స్వరపరచిన విధానం కల్యాణి రాగానికి నిలువుటద్దం. రాజేశ్వరరావే ‘చెంచులక్ష్మి’ చిత్రంలో యమన్ కల్యాణి రాగంలో ‘’పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా’’ అనే అద్భుతమైన భక్తిపాటకు ఊపిరులూదారు. ఇలా ఎంతోమంది సంగీత దర్శకులు కల్యాణి రాగాన్ని సినిమాలలో హుషారైన పాటలకోసం విరివిగా వాడుకున్నారు. సాధారణంగా ఈ రాగాన్ని విషాద గీతాలకు వాడరు. కానీ ‘దేవదాసు’ చిత్రంలో ‘’కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్’’ అనే విషాద గీతానికి కల్యాణి రాగాన్ని వాడి హిట్ చెయ్యడం సి.ఆర్. సుబ్బురామన్ కి దక్కిన కీర్తి. ఈ స్పూర్తితోనే మాస్టర్ వేణు ‘మాంగల్యబలం’ చిత్రంలో ‘’పెనుచీకటాయే లోకం చెలరేగే నాలో శోకం’’ అనే విషాద గీతానికి కల్యాణి రాగాన్ని వాడుకున్నారు. ఘంటసాలకు చాలా ఇష్టమైన రాగం కళ్యాణి. పెండ్యాల సంగీత సారధ్యంలో ఘంటసాల సుశీల తో కలిసిపాడిన యుగళగీతం... ‘’మనోహరముగా మధుర మధురముగా మనసులు కలిసెనులే’’ కళ్యాణి రాగంలో స్వరపరచినదే. అందులో ఇంద్రకుమారి తనతో హీరోను పాట పాడమంటుంది. అక్కడేవున్న నాగకుమారి తన నాట్యం చూడమంటుంది. హీరోకి యేమి చేయాలో అర్ధం కాదు. అప్పుడు ఇంద్రకుమారి హీరోకి ‘’ఓం ఏకోనేకో హమస్మి’’ (ఏకో, అనేకో) అనే ఒక మంత్రం ఉపదేశిస్తుంది. దాంతో అతడు అటు ఇంద్రకుమారితోనూ, ఇటు నాగకుమారితోనూ ‘’మనోహరముగా మధుర మధురముగా’’ అంటూ పాట పాడుతాడు. నాగకుమారి నృత్యం చేస్తుంది. ఈ సైంటిఫిక్ రీజనింగ్ ని కె.వి. రెడ్డి ‘శివశంకరి’ పాటవద్ద ప్రయోగించి విమర్శకు తావులేకుండా జాగ్రత్తపడ్డారు.
తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో ప్రామాణికమైన గీతాలలో సంగీత ప్రియులు మరచిపోలేని పాట విజయా వారి ‘జగదేకవీరుని కథ’ చిత్రంలో ఘంటసాల మేస్టారు ఆలపించిన అద్భుతగీతం ‘శివశంకరి శివానందలహరి’. ఈ పాటతో సంబంధంలేని సంగీత ప్రియుడు తెలుగు నేలమీద వుండదనేది నిజం. పింగళి రచనలో పెండ్యాల స్వరపరచిన ఈ పాటను దర్శకుడు కె.వి.రెడ్డి ఘంటసాలకు వినిపించమని చెప్పగా, అది వినిన ఘంటసాల మేస్టారు ‘’బ్రహ్మాండం బాబూ. ఈ పాటకోసం నేను పదిహేనురోజులైనా రిహార్సల్స్ కి వస్తాను. బాగా పాడతాను’’ అని చెప్పి సాధన చేసి పాటను పాడి రికార్డు చేయించారు. పాట వినిన నాయకుడు ఎన్.టి. రామారావు ఘంటసాలతో నాలుగు రోజులు కూర్చుని అందులో చేయవలసిన స్వరవిన్యాసాలను లిప్ సింక్ అయ్యేలా ప్రాక్టీస్ చేశారు. పైగా ఈ పాట చిత్రీకరణ సమయంలో ఘంటసాల కూడా తప్పకుండా వుండాలని కోరారు. అలా ఈ పాట చరిత్ర సృష్టించింది. జగదేకవీరుని కథ చిత్రంలోని పాటలన్నీ రికార్డింగు, చిత్రీకరణ పూర్తిచేసిన తరవాత చివరిగా స్వరపరచిన పాట ‘శివశంకరి’. దర్శకుడు కె.వి. రెడ్డి పెండ్యాలతో ’’పూర్వం నారద తుంబురులు వాదించుకుంటూ వుంటే ఆంజనేయుడు పాడితే శిలలు కరిగాయని శాస్త్రం చెబుతోంది. ఈ యుగంలో కూడా తాన్ సేన్ పాడితే దీపాలు వెలిగాయట. మీరు చేయబోయే పాట కూడా అలాంటిదే. ఈ పాట సినిమా మొత్తానికి ప్రాణం వంటిది. ఈ పాటకు మీరు అంతటి స్థాయిని తీసుకురావాలి’’ అన్నప్పుడు పింగళి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ‘శివశంకరి’ పాటకు అక్షరరూపం కల్పించారు. ఆరున్నర నిమిషాల ఈ పాటను పెండ్యాల దర్బారీ రాగంలో స్వరపరచారు. రకరకాల విన్యాసాలతో సాగే ఈ పాట ఘంటసాల మేస్టారు ఏ కచేరీలోనూ పాడే సాహసం చేయలేదు.
1967లో ఎన్.టి. రామారావు మాతృసంస్థ NAT నిర్మించిన ‘పాండురంగ మాహాత్మ్యం’ చిత్రంలో జూనియర్ సముద్రాల రచించగా, సంగీత దర్శకుడు టి.వి. రాజు మనోహరంగా రాగమాలికగా స్వరపరచిన పాట ‘’జయ కృష్ణా ముకుందా మురారీ’ జయ గోవింద బృందా విహారీ’’ అనేపాట. ఘంటసాల మేస్టారు ఆలపించిన పాటల్లో ఇది ఒక కలికితురాయి. పాట పల్లవి తోబాటు ‘’దేవకి పంట వసుదేవు వెంట’’ అనే తొలి చరణాన్ని టి.వి. రాజు మోహనరాగంలో స్వరపరచగా, రెండవ చరణం ‘’నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంట’’ కోసం కళ్యాణి రాగాన్ని వాడుకున్నారు. ‘’అమ్మా తమ్ముడు మన్ను తినేనూ‘’ అనే పద్య రూపానికి ఆరభి రాగాన్ని వాడారు. ఇక ‘’కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ’’ అనే చరణాన్ని మాండ్ రాగంలో స్వరపరచారు. శ్రీకృష్ణ కర్ణామృతంలోని ‘’కస్తూరీ తిలకం లలాట ఫలకే’’ అనే శ్లోకానికి హిందోళ రాగం ఉపయోగించారు. ‘’లలిత లలిత మురళీ స్వరాళీ పులకిత వనపాళీ గోపాళీ’’ అనే చరణాన్ని యమన్ రాగాన్ని ఆధారం చేసుకొని స్వరపరచారు.
1955లో అంజలీ పిక్చర్స్ పతాకం మీద విడుదలైన ‘అనార్ కలి’ చిత్రంలో ఘంటసాల, జిక్కి ఆలపించిన మరో మధురమైన పాట ‘’రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’’ గురించి కూడా ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. సముద్రాల రాఘవాచార్య రచించగా పి. ఆదినారాయణరావు స్వరపరచిన ఈ పాట ‘’మదన మనోహర సుందరనారీ, మధుర ధరస్మిత నయన చకోరీ’’ అనే సాకీతో ఘంటసాల స్వరంలో మొదలౌతుంది. రసికజన హృదయాలకు చలివేంద్రంగా మారిన ఈ పాటను ఆదినారాయణ రావు మాల్కోస్ రాగంలో స్వరపరచారు. ఈ పాటలో ‘వహ్వా’ అనే మాటనుంచి చివర వచ్చే ‘చేరరారా’ వరకు అద్భుతంగా గమకాలు పలుకుతాయి.
ఏ.వి.యం వారు 1958 లో నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రానికి సుదర్శనం-గోవర్దనం సంగీతం సమకూర్చారు. గేయరచయిత సముద్రాల రాఘవాచార్య. ఇందులో ఎన్.టి. రామారావు మీద చిత్రీకరించిన ‘’నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా’’ పాట ఘంటసాల ఆలపించిన భక్తి గీతాలలో మకుటాయమానమైనది. ‘నీలకంధరా దేవా’ నుంచి ‘దర్శనంబు నీరా మంగళాంగా గంగాధరా’ వరకు ఘంటసాల తిలంగ్ రాగంలో శ్రావ్యంగా ఆలపించారు. ఇక ‘దేహియన వరములిడు దానగుణ సీమా’ నుంచి ‘హరహర మహాదేవ కైలాసవాసా’ వరకు శుద్ధ సావేరి రాగం పలుకుతుంది. ఇక చివరి పాదాలకు నాదనామక్రియ రాగాన్ని సంగీత దర్శకులు వాడారు.
డి.ఎల్. నారాయణ వినోదా బ్యానర్ మీద 1953లో నిర్మించిన ‘దేవదాసు’ చిత్రంలో ఘంటసాల ఆలపించిన అద్భుతమైన పాట ‘’కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్’’. ఈ చిత్రనిర్మాణం సగంలో వుండగానే సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బురామన్ తన 29 వ యేటనే హఠాన్మరణం చెందడం విచారించ తగిన విషయం కాగా ఆయన స్వరపరచిన పాటలన్నీ ఆణిముత్యాలే. ‘’కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్’’ పాటను జీవితం మీద విరక్తి కలిగిన నాయకుడు వేదాంతాన్ని వల్లిస్తూ పాడుతున్నట్లే ఘంటసాల ఆలపించారు. కళ్యాణి రాగంలో ఈ పాటను సుబ్బురామన్ స్వరపరచారు. ‘సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకొవోయ్’ అంటూ చరణం చివర వచ్చే ఆలాప్ లో మంద్రస్థాయిలోను, తారాస్థాయిలోను ఘంటసాల పలికించిన గమకాలు అనితరసాధ్యాలు. ఇవి కళ్యాణి రాగానికి దివ్యాభరణాలుగా చెప్పుకోవాలి.
1959లో విడుదలైన ‘జయభేరి’ చిత్రంలో ‘’రసికరాజ తగువారము కామా అగడు సేయ తగునా? ఏలు దొరవు అరమరికలు ఏలా? ఏలవేల సరసాల సురసాల’’ పాటను గుర్తుచేయకుండా ఈ వ్యాసం సంపూర్ణంకాదు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ మొత్తం సంగీతం చుట్టూ పరిభ్రమిస్తూవుంటుంది. ఇందులో మల్లాది రామకృష్ణ శాస్త్రి రచించిన ‘’రసికరాజ తగువారము కామా అగడు సేయ తగునా?’’ అనే ఘంటసాల పాటగురించి చెప్పాలి. రాజసభలో కథానాయకుడు అక్కినేని తన సంగీత ప్రతిభకు పరీక్షా సమయం వచ్చినప్పుడు ఆలపించే గీతమిది. పెండ్యాల ఈ పాటకోసం ‘విజయానందచంద్రిక’ అనే ఒక నూతన రాగాన్ని సృష్టించారు. చక్రవాక, కానడ రాగాలను మేళవించి రూపొందించిన రాగమిది. రిషభ, గాంధారాలను త్రిస్థాయిలో వచ్చేలా రూపకల్పన చేయడం ఈ రాగ ప్రత్యేకలక్షణం. సన్నివేశ విషయానికి వస్తే... రాజసభలో విజయానందరామ గజపతి మహారాజు ఎదుట రాజనర్తకి అక్కినేనిని పండిత స్థానంలో ఆసీనుడయ్యేందుకు తగిన అర్హత ఏమిటో నిరూపించమని కోరినప్పుడు అతడు రాగాలాపన చేస్తాడు. కథానాయకుడు ఆలపిస్తున్న రాగమేమిటో చెప్పమని రాజనర్తకి ప్రశ్నించినప్పుడు, మహారాజు పేరు కలిసేలా విజయానంద చంద్రిక అంటాడు కథానాయకుడు. మహారాజు పేరుమీద సృష్టించడిన ఆ రాగలక్షణం ఏమిటని రాజనర్తకి ప్రశ్నించినప్పుడు ‘’సలక్షణం’’ అంటూ ‘’ప్రభూ! దేవరవారికి చక్రవాక, కానడ రాగాలంటే మిక్కిలి మక్కువని లోకవిదితం. ఆ రెండు రాగాలను మేళవించి ప్రభువులను, పండితులను రంజింపచేయ ప్రయత్నిస్తున్నాను’’’ అని జవాబిస్తూ కథానాయకుడు పాటకు ఉపక్రమిస్తాడు. ఈ పాటకోసం ఘంటసాల పదిరోజులపాటు రిహార్సల్స్ చేసి మరీ పాడటం జరిగింది. రాగస్వరూపం తెలియజేసేలా సినిమా అవసరంకోసం అరనిమిషానికి కుదించి సభికులకు ఆ రాగానుభూతిని చేకూర్చిన సన్నివేశంలో ఘంటసాల ఈ పాటను ఆలపించిన తీరు ‘న భూతో న భవిష్యత్’.
ఈ చిత్రంలోనిదే శ్రీశ్రీ రచించిన ‘’నందుని చరితము వినుమా పరమానందము గనుమా’’ అనే జనరంజకమైనపాట. ‘’అధికులనీ, అధములనీ నరుని దృష్టిలోనే భేదాలూ... శివుని దృష్టిలో అంతా సమానులే’’ అంటూ, కులనిర్మూలన వాదానికి ఊతమిచ్చే సాకీతో ప్రారంభమౌతుంది ఈ పాట. చిన్న పిల్లలకు కూడా అర్ధమయ్యే రీతిలో ఎంతో సరళమైన భాషలోసాగే ఈ పాట చివరిలో తారాస్థాయిని చేరుకొనే సన్నివేశం అత్యద్భుతం. సంగీతాభిమానుల మన్ననలు చూరగొన్న ఈ ’జయభేరి’ పాటలు ఘంటసాల-పెండ్యాల అవిరళ కృషికి దర్పణాలు. ఈ పాటను నాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 16 m.m లోకి మార్పించి సాంఘిక సమానత్వం, కులనిర్మూలన మొదలైన అంశాలపై ప్రచారం కోసం వినియోగించుకోవడం విశేషమే కాదు ఈ పాట ప్రత్యేకత కూడా!
Courtesy : Sri.ఆచారం షణ్ముఖాచారి