YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొడుకు కోసం మళ్లీ పత్తిపాడు... వైసీపీ నుంచి సీటు కోసం కర్చీఫ్

కొడుకు కోసం మళ్లీ పత్తిపాడు... వైసీపీ నుంచి సీటు కోసం కర్చీఫ్

రాజమండ్రి, డిసెంబర్ 5,
ముద్రగడ పద్మనాభం.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా పేరు.. కాపులపై తనకే పేటెంట్ ఉన్నట్లు మాట్లాడుతుండటం ఆయన స్టైల్.. దశాబ్దకాలం ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. వైసీపీ లీడర్ అవతారమెత్తారు. వైసీపీకి కాపు సామాజికవర్గం మద్దతు కూడగట్టడానికి నానా పాట్లు పడ్డారు. ఆ క్రమంలో ఆయన చంద్రబాబు సహా పవన్‌కళ్యాణ్, చిరంజీవిలపై సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. పిఠాపురంలో పవన్‌ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని శపధం చేసి.. పద్మానాభరెడ్డిగా మారిపోయారు. అలాంటాయన తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారిందిప్పుడు.ముద్రగడ పద్మనాభం ..కాపు ఉద్యమ నేతగా తెగ హడావుడి చేశారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్.. గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గానికి పెద్దన్నగా వ్యవహరించడానికి నానా పాట్టు పడ్డారు. అలాంటి ముద్రగడ పద్మనాభం మాటంటే మాటే అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తాను పేరు మార్చుకుంటాను అని సవాల్ చేసి దానికి కట్టుబడి పద్మనాభరెడ్డి అని మార్చుకున్నారు.అంత పట్టుదల కలిగిన మనిషి అయిన ముద్రగడ ఇపుడు ఈ ఏజ్ లో ఈ స్టేజ్ లో తన పంతాన్ని పట్టుదలను వీడుతున్నట్లు కనిపిస్తున్నారు. ముద్రగడ పద్మనాభానిది సొంత నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు 1962, 1967లలో ఇక్కడ నుంచే రెండు సార్లు పోటీ చేసి గెలిచారు. ఆయన మరణం తరువాత 1978లో ముద్రగడ ఇదే సీటు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.ఆ తరువాత ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరారు. 1983, 1985లలో ఆయన ప్రత్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అదే ప్రతిపాడులో ఘన విజయం సాధించారు. అయితే 1994లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ముద్రగడను ప్రతిపాడు ఓటర్లు మొదటి సారి ఓడించి కోలుకోలేని షాక్ ఇచ్చారు . దాంతో ముద్రగడ పూర్తిగా రాజకీయ నిర్వేదానికి లోనై ఇక ఈ జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయనని ప్రకటించారు. అసలు ప్రత్తిపాడులో అడుగుపెట్టబోనని శపధం కూడా చేశారు.తర్వాత మళ్లీ టీడీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం కాకినాడ ఎంపీగా గెలిచారు. తర్వాత 2009లో ముద్రగడను దివంగత నేత వైఎస్సార్ పిలిచి మరీ ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు. కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి చేయనని మరోసారి స్పష్టం చేశారు. అంతే కాదు కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి టికెట్ తెచ్చుకున్నారు. అయినా ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. వైసీపీ నాయకుడిగా ఉన్న ముద్రగడ మళ్లీ ప్రత్తిపాడు వైపు చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది. మరి ప్రత్తిపాడులో పోటీ చేయను అని చెప్పి.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉన్న ముద్రగడ మళ్లీ ప్రత్తిపాడు వైపు చూస్తున్నారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తన కోసం కాదని తన కుమారుడు గిరి రాజకీయ భవిష్యత్తు కోసం అని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారని ప్రచారం సాగుతోంది.ముద్రగడ కుమారుడు గిరిబాబుని ప్రత్తిపాడు వైసీపీ ఇంచార్జిగా అధినాయకత్వం నియమిస్తుందని అంటున్నారు. తనతో పాటు, తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ప్రత్తిపాడు నుంచి తన వారసుడిని పోటీకి దించి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ముద్రగడ చూస్తున్నారంట. ముద్రగడకి పిఠాపురంపై ఆసక్తి ఉన్నా.. అక్కడ పవన్‌కళ్యాణ్ ఉండటంతో ఇక కుమారుడికి గెలిచే సీన్ అండదని .. అందుకే గత్యంతరం లేని స్థితిలో ప్రత్తిపాడు వైపు చూస్తున్నారని చెప్తున్నారు.కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా ముద్రగడ తన పట్టు సడలించుకుని ప్రత్తిపాడు నుంచి వారసుడిని దించి వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబెట్టి గెలిపించుకోవాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే మూడు దశాబ్దాల క్రితం తాను పట్టిన శపధాన్ని ముద్రగడ పక్కన పెట్టి ప్రత్తిపాడులో రాకీయం మొదలుపెడతారన్న మాట. అయినా ముద్రగడ అనుకుంటే సరా.. జగన్ వారికి అవకాశమివ్వాలి కదా.

Related Posts