కడప, డిసెంబర్ 7,
వైఎస్ వివేకానందరెడ్డి కేసు అనేక మలుపులు తిరుగుతోందా? ఒకేసారి సుప్రీంకోర్టులో ఎందుకు రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి? నిందితులు మళ్లీ జైలుకి వెళ్లడం ఖాయమా? న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్ సునీత. శుక్రవారం ఆ పిటీషన్ సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకొచ్చింది. దీనిపై విచారణ జరిగిన సుప్రీంకోర్టు, సీబీఐతోపాటు భాస్కర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. భాస్కర్ రెడ్డి తరపున వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి. అనారోగ్య సమస్యలు చూపిస్తూ న్యాయస్థానం నుంచి బెయిల్ పొందారు భాస్కర్‌రెడ్డి. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఇదే వరకే సీబీఐ, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆయన బెయిల్ రద్దుపై రెండు పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వివేకానంద కేసును ఏపీ సర్కార్ దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా ఒకప్పటి వివేకా పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆయన చెప్పిన విషయాలను రికార్డు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో మరో నలుగురు జగన్ బావమరిది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డితోపాటు అవినాష్ బాబాయ్ మనోహర్ రెడ్డి, తమ్ముడు అభిషేక్ రెడ్డి, వైఎస్సార్ ట్రస్టు ఛైర్మన్ జనార్థన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. గురువారం విచారణకు రావాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఆయా వ్యక్తులు డుమ్మా కొట్టారు. దీంతో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది డిసెంబర్‌లో కృష్ణారెడ్డి ఫిర్యాదుతో వివేకా కూతురు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్సీ రాంసింగ్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే కొద్దిరోజుల కిందట ఈ కేసు విచారించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ఆపై నోటీసులు జారీ చేయడం చకచకా జరిగింది.