YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భార్గవరెడ్డిపై 13 కేసులు...

భార్గవరెడ్డిపై 13 కేసులు...

ఒంగోలు, డిసెంబర్ 7,
సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో పెద్ద తలకాయలు భరతం పట్టేందుకు సిఐడి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా పోస్టింగుల వివాదంలో పలువురిని అరెస్టు చేసినా ఎటువంటి ఫలితం లేదని భావిస్తున్న సీఐడీ తెర వెనుక పాత్రధారులపై దృష్టి సారించింది. అసలు సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో తెర వెనుక ఉన్న పెద్దలు ఎవ్వరన్న దానిపై ఆరా తీస్తుంది. ఆ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి పేరు ఫోకస్ అవుతుంది.సోషల్ మీడియా పోస్టింగుల వివాదంలో వైసీపీ రాష్ట్ర ఇన్చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వ్యవహారాలు పర్యవేక్షించిన సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా వైసీపీ తరఫున కీలక పాత్ర పోషించిన ఆయనపై వరుసగా రాష్ట్రంలో కేసులు నమోదు అవుతున్నాయి. ఏపిలో ఇప్పటి వరకు నమోదైన ఎనిమిది కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం భార్గవరెడ్డి ప్రయత్నిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన ఆయన తాజాగా ఇదే కేసుల్లో సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు.అయితే సజ్జల భార్గవరెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ స్పష్టం చేసింది. ఆ పిటిషన్లను హైకోర్టు ఎల్లుండి విచారించనుంది. మరోవైపు రోజుకి రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా భార్గవ్ రెడ్డిపై కేసులు నమోదు అవుతున్న సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 13 పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా పోస్టింగ్ వ్యవహారంలో భార్గవ్ రెడ్డి సూత్రధారని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా సజ్జల భార్గవరెడ్డి ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలను నియమించి ఎడిటెడ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, బూతు కంటెంట్‌తో పోస్టింగులు పెట్టించారని రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భార్గవ్ రెడ్డి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. తన న్యాయవాదువలతో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్లు వేయిస్తున్నారు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా పోస్టింగ్ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో పోస్టింగ్స్ వ్యవహారంలో తెరవెనక సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనే కోణంలో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. భార్గవ్ రెడ్డి ఆచూకీలు లభ్యం కాకపోవడంతో ఆయన పైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకున్నారు.మరోవైపు భార్గవ్ రెడ్డి ఆచూకీ కోసం వైసీపీ నేతలు, సజ్జల సన్నిహితులను, భార్గవ్ డ్రైవర్‌తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా పని చేస్తున్న వారందరినీ పిలిచి పోలీసులు విచారిస్తున్నారు . ఇప్పటికే 50 మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై సిఐడి కేసు నమోదు చేసింది. వారిని విచారించి వారి వివరాలు నమోదు చేసుకొని, వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో పాటు, ఎవరు ఈ పోస్టింగులు వ్యవహారంలో ఉన్నారు , ఎవరి ఆదేశాలతో సోషల్ మీడియా వేదిక పోస్టులు పెట్టారు. మార్ఫింగ్ ఫోటోలు ఎవరు ఇచ్చారు, ఎడిట్ చేసిన వీడియోలను ఎవరు పంపారు అని ఆరా తీస్తున్నారు.అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మరింత అలెర్ట్ అయిన పోలీసులు సజ్జల భార్గవ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు . మరి ఈ వ్యవహారంలో అతనికి హైకోర్టులో ఊరట లభిస్తుందో? లేకపోతే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందో? చూడాలి.

Related Posts