
న్యూఢిల్లీ, డిసెంబర్ 7,
తొలిసారి పార్లమెంటు సభ్యులుగా పబాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన స్టయిల్‌లో రాజకీయం షురూ చేశారు ప్రియాంక గాంధీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి వయనాడు వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. సోదరుడు రాహుల్ గాంధీతో పోలిస్తే ఆమె రూటే సెపరేట్ అని నిరూపించుకుంటున్నారు.వయనాడు నుంచి ఎంపీగా గెలిచిన తరువాత ప్రియాంక గాంధీ రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ టార్చ్‌బేరర్‌గా ఆమె దూసుకెళ్తున్నారు. సోదరుడు రాహుల్‌గాంధీతో పోటీ పడి పార్టీ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. వాస్తవానికి వయనాడు నుంచి గెలిచినప్పటికి ప్రియాంక దృష్టంతా ఉత్తరప్రదేశ్ పైనే ఉంది.. ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉత్తరప్రదేశే కీలకమన్న విషయం అందరికి తెలుసిందే..! గత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పొత్తుతో కాంగ్రెస్ ఆరు సీట్లను గెల్చుకుంది. రాహుల్‌గాంధీ కూడా రాయ్‌బరేలి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ముందుకెళ్తున్నారు.అయితే అదే సమయంలో తనను తొలిసారి లోక్‌సభకు పంపించిన వయనాడ్ ప్రజల తరపున లోక్‌సభలో గట్టిగా గళం విన్పిస్తున్నారు ప్రియాంక.. వరదలతో తల్లడిల్లిన వయనాడ్ ప్రజలను కేంద్రం ఆదుకోవాలని ప్రియాంక పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ నాలుగు నెలల క్రితం వయనాడ్‌లో పర్యటించినప్పుడు అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారని, కాని ఇప్పటివరకు ప్రజలకు కేంద్రం నుంచి సాయం అందలేదంటున్నారు ప్రియాంక.రాహుల్‌గాంధీ కంటే భిన్నమైన పద్దతిలో రాజకీయం చేస్తున్నారు ప్రియాంక. ప్రధాని మోదీ, అమిత్‌షాతో రాహుల్‌గాంధీ కలిసి మాట్లాడింది చాలా తక్కువసార్లు మాత్రమే.. కాని తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియాంక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. వయనాడ్ ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వయనాడ్‌లో ఉన్న పరిస్థితిని వివరించారు. విపత్తుతో ప్రజలు ఎలా నష్టపోయారో చెప్పారు. అక్కడ నదుల దిశనే మారిపోయింది. పర్వతప్రాంతాలు కొట్టుకుపోయాయి. చాలా దూరం వరకు నష్టం జరిగింది. ప్రజలకు మద్దతు లభించడం లేదు. కేంద్రం నుంచి మద్దతు లేకపోతే వాళ్లు తీవ్రంగా నష్టపోతారంటూ అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు ప్రియాంక. రాజకీయాలను పక్కనపెట్టి మానవతా ధృక్పథంతో వాయనాడ్ ప్రజలను కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.