పలువురు బడా బాబులు బ్యాంకులకు వేల కోట్లలో మోసం చేయడం, వసూలు కాని రుణాలు కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ రూ.వేల కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర నష్టం.. అక్షరాలా రూ.87,357కోట్లు. బ్యాంకుల త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 19 బ్యాంకులు నష్టాలను నమోదుచేశాయి. ఈ నష్టం విలువ రూ. 87,357కోట్లు. కేవలం ఇండియన్ బ్యాంక్, విజయ బ్యాంక్.. ఈ రెండు మాత్రమే లాభాలను ఆర్జించాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ బ్యాంక్ రూ. 1,258.99కోట్ల లాభాన్ని నమోదుచేయగా.. విజయ బ్యాంక్ లాభం రూ. 727.02కోట్లుగా ఉంది. ఇక నష్టాలు చవిచూసిన బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి స్థానంలో ఉంది. ఈ ఏడాది పీఎన్‌బీలో భారీ కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న ఈ స్కాం విలువ రూ. 14వేల కోట్లకు పైనే. కుంభకోణం నేపథ్యంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో పీఎన్‌బీ రూ. 12,282.82కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంక్ రూ. 1,324.8కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. పీఎన్‌బీ తర్వాత రూ. 8,237.93కోట్ల నికర నష్టంతో ఐడీబీఐ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోనూ ఈ బ్యాంక్ రూ. 5,158.14కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఇక దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,547.45కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ. 10,484.1కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.