రంగారెడ్డి
మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ మొదలైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలని మంచు మనోజ్ బౌన్సర్లను విష్ణు ఆదేశించాడు. అయినా కూడా వాళ్లు అక్కడే ఉండడంతో.. తన బౌన్సర్లలో వారిని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి బౌన్సర్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా మంచు విష్ణునే రంగంలోకి దిగి మనోజ్ బౌన్సర్లను బయటకు తోసేశాడు. ప్రస్తుతం మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబు ఫాంహౌస్ బయట ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి వరకు విదేశాల్లో ఉన్న మంచు విష్ణు.. నేడు తిరిగి హైదరాబాద్కు రావడంతో ఈ గొడవ మరింత ముదిరింది. పెద్ద కొడుకు విష్ణుతో కలిసి మోహన్ బాబు నేరుగా తన ఫాంహౌస్లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ మనోజ్, విష్ణుల బౌన్సర్లు ఉన్నారు. విష్ణు రావడంతోనే మనోజ్ భార్యతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తాను ఆస్తులు, డబ్బుల కోసం పోరాటం చేయడంలేదని..ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని మనోజ్ మీడియాతో తెలిపారు. న్యాయం కోసం ఎంతమందినైనా కలుస్తానని చెప్పారు.