విజయవాడ, డిసెంబర్ 12,
ఏపీ నూతన టూరిజం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త టూరిజం పాలసీని అమల్లోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది. సరైన ప్రోత్సాహం, నిధుల కేటాయింపుతో టూరిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.రాష్ట్రాలకు ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో టూరిజం ఒకటి. సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే టూరిజం నుంచి అధిక ఆదాయం పొందవచ్చనేదానికి కేరళ ఒక ఉదాహరణ నిలుస్తోంది. ఆ రాష్ట్ర ఆదాయంలో టూరిజంకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సైతం టూరిజం అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాలు, బీచ్ లు, టూరిస్ట్ ప్రదేశాలకు ఏపీ కేంద్రంగా ఉంది. అయితే సరైన ప్రోత్సాహం లేక పర్యాటక అభివృద్ధికి నోచుకోవడంలేదు. గత ప్రభుత్వాలు సంక్షేమంపై దృష్టి పెట్టి, టూరిజాన్ని నిర్లక్ష్యం చేశాయనేది నిపుణుల అభిప్రాయం. టూరిజాన్ని ఆదాయ మార్గంతో పాటు ఉపాధి కల్పన వనరుగా చూడాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల, శ్రీశైలం, విశాఖ బీచ్ లు, అరకు లోయ, కోనసీమ అందాలు ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే... కేరళ తరహాలో ఏపీ కూడా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందనే వాస్తవం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రానున్న ఐదేళ్లు (2024-29) ఏపీ టూరిజం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన అంశాలే లక్ష్యంగా నూతన టూరిజం పాలసీని అమల్లోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏపీలో పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నూతన పాలసీ ఉంటుందని పేర్కొంది.ఎకో టూరిజం, క్రూయిజ్ టూరిజం, బీచ్ సర్క్యూట్‌లు, బ్యాక్ వాటర్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు నూతన పాలసీ అనువుగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పర్యాటక పాలసీ ఉంటుందని తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించడం, పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడం, విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు నూతన పాలసీని రూపొందించింది.విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో ఏడు యాంకర్ హబ్ లు ఏర్పాటు చేయబోతున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల తెలిపారు. అమరావతి-నాగార్జున కొండ, విశాఖపట్నం- తొట్లకొండ ప్రాంతాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు ఆలయాలను కలిపేలా 10 సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తామన్నారు. కోస్టల్ టూరిజం సర్క్యూట్ లో భాగంగా విశాఖ, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో ఐదు బీచ్ సర్క్యూట్ లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రివర్ టూరిజం సర్క్యూట్, 2 క్రూయిజ్ టూరిజం సర్క్యూట్ లను అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీకాకుళం-విశాఖ, తూర్పుగోదావరి- గుంటూరు, కర్నూలు- నెల్లూరులలో ఎకో టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తామన్నారు.ఆంధ్రప్రదేశ్ లో టూరిజం అభివృద్ధి మరిన్ని అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సుదీర్ఘమైన సముద్ర తీరం, పచ్చని వాతావరణం, ప్రముఖ ఆలయాలు,నదుల్లో బోటింగ్, ఇతర రాష్ట్రాలు దేశాలతో సులభమైన కనెక్టివిటీ.. ఇలా టూరిజానికి అనుకూలమైన ఎన్నో అంశాలు ఏపీలో ఉన్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వ ప్రోత్సాహం, నిధుల కేటాయింపు ఉంటే ఏపీలో టూరిజం మరో అడుగు ముందుకు వేస్తుంేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.