విశాఖపట్టణం, డిసెంబర్ 12,
కొత్త ఏడాది వస్తోంది. వరుస పథకాలు తెస్తోంది. ఇదే పాట పాడుతున్నారు ఏపీ మహిళా లోకం. అంతేకాదు ప్రభుత్వం కూడా ఆ మేరకు ముందడుగు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల పాలన పూర్తి చేసుకున్న ఏపీ ప్రభుత్వం, మహిళా లోకానికి వరాలు కురిపించేందుకు సిద్దమైంది. ఇంతకు ఆ వరాలు ఏమిటో తెలుసుకుందాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే వరదలు పోటెత్తడంతో కొంత వరదసాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రారంభించగా, ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేల సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్దం కానుంది.అయితే ఫ్రీ బస్సు అమలు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 పథకాలు అమలుపై ప్రభుత్వం నుండి ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో, కొంత ప్రజల్లో ఈ పథకాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ సైతం ఈ పథకాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విమర్శలు చేస్తోంది.కాగా నిరుద్యోగులకు డీఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో సిలబస్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన్నంగా ఉన్న రహదారుల అభివృద్దిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మహిళల ఫ్రీ బస్సు స్కీమ్ పై ప్రభుత్వం తర్జనభర్జనలు చేసి, సంబంధిత అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వరదలు రాగా, కొంత ఈ పథకాలకు అడ్డు పడిందని చెప్పవచ్చు. అందుకే కాబోలు కొత్త ఏడాదిలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుందట. ఫ్రీ బస్సు పథకంతో పాటు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 అందించేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణ సిద్దం చేసినట్లు సమాచారం. అయితే ఈ పథకాలకు అర్హతలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చిన వెంటనే కొత్త సంవత్సరం మహిళలకు కానుకగా ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి కొత్త ఏడాది మహిళలకు వరాలు కురిపిస్తుందని చెప్పవచ్చు. మరి లబ్ది పొందేందుకు మీరు సిద్దంగా ఉండండి సుమా.. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చే వీలుంది.