విశాఖపట్నం
వైఎస్సార్సీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి , పార్టీ సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి అవంతి రాజీనామా చేశారు.రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని... వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు.ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినప్పటికీ, అభివృద్ధి చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలని,ఆరు నెలల నుంచి ఆందోళన.. నిరసనలు అంటే, కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారని,వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారని,అంతా వాలంటీర్లే నడిపించారని,కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలందరిని ఒకేసారి రోడ్డు ఎక్కండి అంటే ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.బ్రిటిష్ వారు అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా, అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చేయమనడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజమన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధి చెందిందని... మన రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయిందన్నారు.