
లక్నో, డిసెంబర్ 13,
దేశవ్యాప్తంగా విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే, వీరిలో కొన్ని జంటలు ఇద్దరి మధ్య పూర్తి అవగాహనతో, ఒకరినొకరు గౌరవించుకుంటూ విడాకుల ప్రక్రియను పూర్తిచేసుకుంటున్నాయి. కానీ, కొన్ని జంటల మధ్య ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఘర్షణ వాతావరణంలో పురుషుల నుండి విడిపోయిన మహిళలకు వరకట్న వేధింపుల చట్టం ఆయుధంగా మారుతుందా.. ఈ చట్టం ఎక్కువ శాతం దుర్వినియోగం అవుతోందా? అనే వాదన తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో తాజాగా బెంగళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఉదంతంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. తన ఆత్మహత్యకు ముందు అతుల్ 23 పేజీల సూసైడ్ నోట్ తో పాటు ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో అతను ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించాడు. ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తుంది. మెన్ టూ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యూపీకి చెందిన అతుల్ సుభాష్ సాప్ట్ వేర్ ఉద్యోగి. ఓ ఐటీ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఉంటున్నాడు. అతనికి నిఖితా సింఘానియాతో పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె ఉంది. అతుల్ తో గొడవపడి కొంతకాలం క్రితం తన భార్య యూపీలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిద్దరి వివాదం తీవ్రమైంది. తన అత్త కట్నం కోసం వేధించినట్లు, నా భర్త మద్యం తాగి వచ్చి నన్ను కొట్టేవాడని, నన్ను పశువులా చూసేవాడని, నన్ను బెదిరించి జీతం మొత్తం తన ఖాతాలోకి బదలాయించుకునేవాడని తన ఫిర్యాదులో పేర్కొంది. మొత్తం తన భర్తపై తొమ్మిది కేసులు నమోదయ్యాయి. అయితే, అతుల్ తన సూసైడ్ లేఖలో ఇలా వ్రాశాడు.. ‘‘నాపై వచ్చిన ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను నా భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబం నుంచి రూ. 10లక్షల కట్నం డిమాండ్ చేశానట.. నా భార్య ఇంటి నుంచి వెళ్లినప్పుడు నా సంపాదన ఏడాదికి రూ. 40లక్షలు అని, తరువాత ఏడాదికి రూ.80లక్షలు సంపాదిస్తున్నానని చెప్పింది. రూ. 80లక్షలు సంపాదించే వ్యక్తి రూ. 10లక్షలు డిమాండ్ చేసి భార్యాపిల్లలను వదిలేస్తారా’’ అంటూ అతుల్ ప్రశ్నించాడు. అతుల్ తన లేఖలో న్యాయస్థానంపైనా ఆరోపణలు చేశాడు. భరణం ఇవ్వలేకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో జడ్జి ఎదుటే భార్య అతడిని అనడం, దానికి న్యాయమూర్తి నవ్వడంతో సుభాష్ ను తీవ్రగా బాధించింది.
తనను వేధించిన వారిని శిక్షించే వరకు తన ఎముకలను దహనం చేయొద్దని అతుల్ లేఖలో డిమాండ్ చేశాడు. అవినీతికి పాల్పడిన న్యాయమూర్తి, నా భార్య, ఇతర వేధింపులు దోషులు కాదని కోర్టు నిర్ణయిస్తే, తన బూడిదను కోర్టు వెలుపల ఒక గాడిలో వేయాలని అతుల్ తెలిపాడు. ఇలా వేధించే వారికి కోర్టు సుదీర్ఘకాలం శిక్షలు వేయాలని, తన భార్య లాంటి వాళ్లను జైలుకు పంపకపోతే ఇలాంటి వాళ్లకు ధైర్యం పెరిగి భవిష్యత్తులో సమాజంలోని ఇతరులపై మరిన్ని తప్పుడు కేసలు పెడతారని అతుల్ తనలేఖలో ప్రస్తావించాడు. తాజాగా అతుల్ బంధువు ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. నా సోదరుడికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా.. పురుషులకు కూడా ఈ దేశంలోని చట్ట ప్రక్రియ నుంచి న్యాయం అందాలి. న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతి కొనసాగితే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది. మెల్లగా న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. తాము ఏటీఎం యంత్రాల వలే మారిపోతామనే భావనతో పెళ్లిళ్లు అంటేనే పురుషులు భయపడే పరిస్థితి దారితీస్తుందని వ్యాఖ్యానించాడు అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసుపై చర్చ జరుగుతున్న వేళ ‘‘భరణం మంజూరులో పరిగణలోకి తీసుకోవాల్సిన కీలకమైన ఎనిమిది పాయింట్ల ఫార్ములా’ను సుప్రీంకోర్టు ప్రకటించింది. ఓ కేసు విచారణలో జస్టిస్ విక్రమ్, జస్టిస్ ప్రసన్న బి వరాల ధర్మాసనం వీటిని వెల్లడించింది. ఇరు పక్షాల ఆర్థిక, సామాజిక హోదాలను పరిగణలోకి తీసుకోవాలని, భార్యాబిడ్డల అవసరాలు, ఇరుపక్షాల విద్యార్హతలు, ఉద్యోగ హోదాలు, కేసు వేసిన వ్యక్తి సొంత సంపాదన, ఆస్తులు, వివాహ బంధంలో ఉన్న వేళ ఆ మహిళ అనుభవించిన జీవన ప్రమాణాలు, కుటుంబ బాధ్యతలకోసం వదులుకొన్న ఉపాధి అవకాశాలు, భర్త ఆర్థిక సామర్థ్యం, సంపాదన, నిర్వహణ ఖర్చులు, అప్పులను పరిగణలోకి తీసుకోవాలని ఇతర కోర్టులకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అయితే, తాజాగా న్యాయస్థానం సూచనలతో వరకట్నం వేధింపుల చట్టం కింద పురుషులకు ఎంత మేరకు ఉపశమనం లభిస్తుందనే అంశంపైనా చర్చ జరుగుతుంది.