విజయవాడ, డిసెంబర్ 13,
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో సాంకేతికంగా ఉన్న చిక్కుముడులను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోంది. అమరావతి చుట్టూ అల్లుకున్న వివాదాలను పరిష్కరించేలా చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించింది.అమరావతి నిర్మాణం చుట్టూ వైసీపీ ప్రభుత్వం సృష్టించిన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పరిగణించడంతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతిని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సుప్రీం కోర్టుకు వివరించింది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. దీంతో వివాదాన్ని ముగించాలని ఎన్డీఏ భావిస్తోంది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా రాజధానిని ఖరారు చేసేలా అడుగులు వేస్తున్నారు. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని పరిష్కరించిన తర్వాత రాజధానిని సాధికారికంగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.రాజధాని మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో పాటు భూసమీకరణలో నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు చట్టపరంగా నెరవేర్చాల్సిన హామీ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో గత ప్రభుత్వ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.రాజధాని నిర్మాణంతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధి. భూములుచ్చిన రైతులకు భాగంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను అన్ని రకాల మౌలిక వసతులతో మూడేళ్లలో పూర్తి చేస్తామని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు, సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొంది. రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధతకు ముగింపు పలికేలా, ఇప్పటికే జరిగిన జాప్యం, నష్టాన్ని, రైతులు, రాష్ట్ర ప్రజల న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కోర్టు ముందున్న స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ ముగించాలని కోరింది.అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన కేసుల విచారణ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం 16 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది.సచివాలయం కోసం శాశ్వత భవనాలు సిద్ధమైన తరువాత ప్రస్తుతం ఉన్న భవనాలను ఇతర అవసరాల కోసం వినియోగిస్తామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయ మూర్తులు, మంత్రులు, అఖిలభారత సర్వీస్ అధికారులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల కోసం 2018-19లోనే భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయని సీఎస్ వివరించారు.
ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో ఏముందంటే..
ఏపీ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అధారిటీ చట్టాన్ని చేసి ఏపీసీఆర్డీఏని ఏర్పాటు చేసింది. గవర్నర్ ఆమోదముద్రతో ఆ చట్టాన్ని 2014 డిసెంబర్ 30న గెజిట్లో ప్రచురించారు.
విజయవాడ, గుంటూరు నగరాల మధ్య కృష్ణా నదివెంబడి ఉన్న 24 రెవెన్యూ గ్రామాల్లో 53,748 ఎకరాల విస్తీర్ణాన్ని రాజధాని నగర ప్రాంతంగా గుర్తించి 2014 డిసెంబర్ 30న జీఓ ఎంఎస్ నం.254ను విడుదల చేశారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 3(3)ప్రకారం మొత్తం 122 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా గర్తించారు. ఆ తర్వాత 2015 జూన్ 9న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెం. 141లో రాజధాని ప్రాంతాన్ని 122 చ.కి.మీ.కి బదులుగా 217 చ.కి.మీలుగా సవరించారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం 2016 ఫిబ్రవరి 23న ప్రచురించింది. మాస్టర్ ప్లాన్్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొన్ని హామీలు ఇచ్చింది.
అమరావతిని కేవలం ప్రభుత్వ పరిపాలనా నగరంగానే కాకుండా ఆర్థిక కూడలిగా తీర్చి దిద్దుతామని రైతులకు హామీ ఇచ్చింది.
అమరావతిలో కనీసం లక్ష నుంచి 1.5 లక్షల మంది నివసించేలా ఒక్కోటి వెయ్యి ఎకరాల్లో 27 టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని ప్రణాళికలో పేర్కొన్నారు. ప్రతి టౌన్ షిప్ 250 ఎకరాల చొప్పున నాలుగు భాగాలుగా విభజించి అక్కడ నివాస ప్రాంతాలకు నడిచి వెళ్లేంత దూరంలో ప్రాథమిక పాఠశాల, షాపింగ్ ఉండేలా చూస్తామని వివరించారు.
కృష్ణానదికి అభిముఖంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసి, అక్కడ అన్ని ముఖ్యమైన కార్పొరేట్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
2016 ఫిబ్రవరి 23న ప్రకటించిన మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తుందని నవ నగరాల ఇతివృత్తంతో దశల వారీగా 2050 వరకు ఈ ప్రక్రియ సాగుతుందని సీఎస్ అఫిడవిట్‌లో వివరించారు. భవిష్యత్తులో ఎదురయ్యే అవసరాలు, అవకాశాలపై ఆధారపడి ఈ ప్రక్రియ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కోర్టు ముందున్న ఎస్ఎల్పిపై విచారణ ముగించాలని కోరింది. ఈ పిటిషన్‌పై నేడు చీఫ్ జస్టిస్ విచారణ జరపునున్నారు.