ప్రభుత్వంలోని వివిధ శాఖలలో పని చేసే తాత్కాలిక ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై సచివాలయం 2వ బ్లాక్ ఆర్థిక మంత్రి పేషీలోని సమావేశమందిరంలో సోమవారం ఉదయం మంత్రుల బృందం చర్చించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2016 అక్టోబర్ 16వ తేదీ సుప్రీం కోర్టు తీర్పును దృష్టిలోపెట్టుకొని వారికి సానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రి మండలికి సిఫారసు చేస్తారు. 1993 నవంబర్ 25వ తేదీకి ముందు విధులలో చేరిన వారి 2015 ఆర్ పీఎస్ లో పేర్కొన్న ప్రకారం కనీస వేతనాన్ని పెంచే విషయం చర్చించారు. ఇప్పటికే 2010 పీఆర్ఎస్ ప్రకారం కనీస వేతనం, డీఏ పొందేవారికి 2015 సవరించిన పే స్కేల్ వర్తించే అంశంపై చర్చించారు. ఆ మేరకు వారి వేతనాలు పెంచాలని మంత్రి మండలికి సిఫారసు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాలను మంత్రి మండలి ఆమోదిస్తే 5 వేల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా రూ.21 కోట్లు భారం పడుతుంది. ఈ సమావేశంలో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ పి.దుర్గా ప్రసాదరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి హేమా మునివెంకటప్ప, డీఎంఈ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.