కాకినాడ, డిసెంబర్ 17,
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితుల్ని తగ్గించడానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో ఉన్న ముఫ్పై పడకల ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడక ఆస్పత్రిగా మార్చేందుకుఆయన చతేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఈ మేరకు ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త భవనాలు నిర్మించడంతో పాటు సౌకర్యాలు కల్పించడానికి రూ. 38కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ నిధులతో వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. పిఠాపురం ప్రజలు వైద్య అవసరాల కోసం ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడుతున్నారు. ఇందు కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిని వందల పడకలుగా మార్చి.. వైద్య సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేస్తే.. పేదలంతా.. ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. పవన్ కల్యాణ్ అత్యవసరంగా గుర్తించిన సమస్యల్లో ఇది కూడా ఒకటి. అందుకే ముందుగా ఆస్పత్రి ఆధునీకీకరణకు నిధులు మంజూరు చేయించుకున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ పిఠాపురం అభివృద్దికి ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్దం చేశారు. ఆయన తన పార్టీ నేతలు, అధికారులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి వారం రోజుల పాటు నియోజకవర్గం అంతా తిరిగి, అధికారులు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను ఐడింటిఫై చేశారు. వీటిలో ప్రజలకు ఆదాయాన్ని తెచ్చే, ఖర్చులను మిగిల్చే పనులపై ఎక్కువగా దృష్టి పెట్టారు. విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం, రోడ్లను బాగు చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై ముందుగా ఎక్కువగా దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ తరచుగా పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పిఠాపురం లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి.ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పవన్ కల్యాణ్ పనులు చేయిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటున్నప్పటికీ..ఆయన ఎవరి సమస్యలనూ నిర్లక్ష్యం చేయడం లేదు. పెద్ద ఎత్తున పనులు చేయించడం. ప్రజలు సాయం చేయడం చేస్తూండటంతో పిఠాపురం రాత మారుతున్నట్లుగా కనిపిస్తోంది.