వచ్చే ఎన్నికలకైనా జిల్లాలో కాంగ్రెస్ కోలుకుంటుందా? 16 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా, లేదా? అసలు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల మాటేంటి? నాయకుల కుమ్ములాటల్లో కేడర్ చేజారుతోందా?.. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు జిల్లాలో కాంగ్రెస్ ఉనికిని క్రమంగా కనుమరుగు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా కనీసం నిలబడాలన్న ఆశలు నాయకుల మధ్య గ్రూపు తగాదాలతో అడియాసలే అయ్యే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ కోమాలోకి చేరుకున్న విషయం తెలిసిందే. పార్టీ అధోగతికి దిగజారినా నాయకుల ఆలోచనా తీరు, పద్ధతి మాత్రం మారలేదు. కార్యకర్తలు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. క్యాడర్ దాదాపు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయింది. నాయకులు కూడా చాలామంది పార్టీకి దూరం కాగా, కొద్దిమంది నేతలు ఎవరికి వారే బాస్‌లుగా ప్రవర్తిస్తున్నారు. ఒకరి పొడ ఒకరికి గిట్టదు. దీంతో ఆంధ్రరత్న భవ న్ మెట్లు ఎక్కే నాయకులు కూడా తగ్గిపోయారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అప్పుడప్పుడు నిర్వహించే కార్యక్రమాలు మినహా ప్రజల్లోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా లేవు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి లభించిన ఓట్ల శాతం 2.8 శాతం మాత్రమే. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలకు మిగిలిన ప్రధాన పార్టీల్లో ఇప్పటి నుంచే రిహార్సల్స్ ప్రారంభం కాగా, కాంగ్రెస్‌లో ఆ వాతావరణమే లేదు. నగరంలో పార్టీ పరిస్థితి అయోమయంగా తయారైంది. గత నాలుగేళ్లలో ముగ్గురు అధ్యక్షులు మారారు. 2014 ఎన్నికల వరకు మిగిలిన బలమైన నాయకులు కూడా ఆ తరువాత ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకున్నారు. దేవినేని వర్గం, మల్లాది విష్ణు, నాగేంద్ర వంటి వారు పార్టీని వీడినప్పటి నుంచి కాంగ్రెస్ మరింత బలహీనమైంది. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆకుల శ్రీనివాసకుమార్ ఇటీవలే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఇంకెవరినీ నియమించలేదు.
ఇటీవల కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు నగర కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. శ్రీనివాస్‌నే అధ్యక్షుడిగా కొనసాగమనే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ఒక్క సీటయినా గెలుస్తామని ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితులు కాంగ్రెస్‌లో లేవు. అసలు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకున్నా సరైన అభ్యర్థులు దొరుకుతారన్న ఆశ కూడా లేదు. జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళి కొంత చురుగ్గా తిరుగుతున్నారు కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చేసింది తక్కువ. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ స్ఫూర్తి కానీ, చొరవ కానీ కాంగ్రెస్‌లో కనిపించట్లేదు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వాగ్ధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. గ్రామాల్లో కాంగ్రెస్ నిర్వీర్యమవడంతో నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. అల్లాఉద్దీన్ అద్భుతదీపం మహిమలా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి కనిపించట్లేదు.
మల్లాది విష్ణు పార్టీ నుంచి వెళ్లిపోయాక నగర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఆకుల శ్రీనివాస్‌కు తగిన స్వేచ్ఛ ఇవ్వలేదు. పార్టీలో గ్రూపుల సెగ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డికు కూడా తగిలింది. తాను ఏర్పాటుచేస్తున్న కార్యక్రమాలకు కూడా నాయకులు కార్యకర్తలను తీసుకురాకుండా ఎవరికి వారు వచ్చి ధర్నాల్లో పాల్గొంటున్నారు. దీనిపై సీనియర్ నాయకులను కొద్దికాలం క్రితం మందలించారు. దీంతో వారంతా మర్నాడే రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు డుమ్మా కొట్టారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులకు కారణం ఆయన కొంతమందిని వెనకేసుకురావడమేనని సీనియర్లు విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. ఎక్కువ నియోజక వర్గాల్లో రెండు, మూడు వేల ఓట్లకే పరిమితమైంది. విజయవాడ తూర్పు నుంచి పోటీచేసిన దేవినేని నెహ్రూకు 14వేలు, సెంట్రల్ నుంచి పోటీచేసిన మల్లాది విష్ణుకు 7వేలు, పశ్చిమలో ఆకుల శ్రీనివాస్‌కు 7వేల ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేతల మధ్య లుకలుకలు పార్టీ ఉనికిని దెబ్బతీస్తున్నాయి.