విజయవాడ, డిసెంబర్ 18,
ఏపీ ప్రభుత్వం దూకుడుగా ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనను పరుగులెత్తిస్తోంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టింది. అదే సమయంలో అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించాలని చూస్తోంది. ఇప్పటికే కేంద్రం కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఏకంగా 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు చేయనుంది. జనవరి నుంచి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. నిపుణుల సూచనతో నిర్మాణ పనులు ప్రారంభించవచ్చని.. గతంలో ఎక్కడైతే నిలిచిపోయాయో.. అక్కడ నుంచి ప్రారంభించేందుకు నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం సైతం రెట్టింపు ఉత్సాహంతో పనులు ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది.గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అమరావతిలో చేపట్టాల్సిన అనేక పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 24276 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు అమరావతిలో రూ.45,249 కోట్లకు సిఆర్డిఏ ఆమోదం లభించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అయితే అమరావతికి అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులతో పాటు రైల్వే లైన్ల నిర్మాణ ప్రాజెక్టులను మంజూరు చేసింది.ఒకవైపు రాజధాని నిర్మాణాలు, ఇంకోవైపు వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు ప్రారంభించే వీలుగా ఆయా యాజమాన్యాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఒక్కో సంస్థ ముందుకు వచ్చి తమ కార్యకలాపాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది.ఏపీ అసెంబ్లీ భవనాన్ని భారీగా నిర్మించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. మొత్తం 103 ఎకరాల్లో అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకుగాను రూ.768 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నగరం మొత్తం కనిపించేలా అసెంబ్లీపై టవర్ ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల రోజుల్లో మినహా.. మిగతా రోజుల్లో అసెంబ్లీ టవర్ చూసేందుకు సందర్శకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే నాలుగు జోన్లలో రోడ్ల టెండర్లకు రూ.9,699 కోట్లు, ట్రంక్ రోడ్లకు రూ.7794 కోట్లు ఖర్చు చేసేందుకు సిఆర్డిఏ ఆమోదం లభించినట్లు మంత్రి వివరించారు. మొత్తానికి అయితే ఏపీ అసెంబ్లీ దేశంలోనే ఆదర్శంగా, ఆకర్షణీయంగా నిలవనుందన్నమాట.