పులివెందులలో తెలుగుదేశం పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? పులిగడ్డ ప్రజల మనసులను టీడీపీ తనవైపు ఎలా తిప్పుకుంటోంది? పులివెందుల ప్రజల్లో ఉన్న వైఎస్ కుటుంబ సెంటిమెంట్‌కి ఏ విరుగుడు మంత్రం వేస్తోంది? రాజకీయ మార్పు విషయంలో పులివెందుల ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి? నాలుగు దశాబ్దాల పులివెందుల రాజకీయ చిత్రపటంలో తాజాగా ఏ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి?
కడప జిల్లాలో పులివెందుల! వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఆ ఫ్యామిలీ అంటే అక్కడో సెంటిమెంటు. గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నికలొస్తే ఆ కుటుంబానిదే అక్కడ హవా! ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు- హస్తిన వరకూ ఎంతో పాపులర్! పులివెందులలో సర్పంచ్ పదవి నుంచి ఉమ్మడి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం వరకూ ఆ కుటుంబ సభ్యులు అనేక హోదాలను అనుభవించారు. వైఎస్ ఫ్యామిలీ పట్టు పులివెందులకే పరిమితం కాలేదు. రాజశేఖర్‌రెడ్డి హయాం వచ్చేసరికి కడప జిల్లానే వారి రాజకీయ పెత్తనంలోకి వెళ్లిపోయింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్ తన మార్క్‌ని ప్రదర్శించేవారనీ, అవసరమైతే సామ- దాన- భేద- దండోపాయాలను ప్రయోగించేవారనీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. జిల్లాలో ముఖ్యంగా పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ సెంటిమెంటు ఏ స్థాయికి చేరిందంటే... ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసినప్పుడు కూడా అక్కడి ప్రజలు మారలేదు. అప్పట్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా పులివెందుల ప్రజలు అందుకు భిన్నంగా ప్రతిస్పందించడం గమనార్హం!
ఇక తాజా సందర్భంలోకి వస్తే... రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిత్యం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. జరిగిన అభివృద్ధిని కూడా జరగలేదని బుకాయించడం, ప్రజలకి ఏదైనా మేలు జరిగినా దాన్ని గుర్తించకపోవడం వంటి నెగటివ్ ఆటిట్యూడ్‌ని ఒంటబట్టించుకున్నారు. ఈ ధోరణిపై సీఎం చంద్రబాబు బాగా విసిగిపోయారు. ఈ తరుణంలో ఆయన కడప జిల్లాపైనా.. ప్రధానంగా పులివెందులపైనా దృష్టి సారించారు. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ఇన్నేళ్లుగా చేయలేని పనులను మనం చేసి చూపిస్తే జగన్ ఏమంటారో చూద్దాం అని బాబు తమ్ముళ్ల వద్ద అన్నారట. అనడమే కాదు- ఆ దిశగా కార్యాచరణకి కూడా పూనుకున్నారు.
నాలుగు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ పాలనలో ఉన్న పులివెందులకు సరైన తాగు- సాగునీటి సదుపాయం లేదు. ఇదే ఇక్కడి ప్రధాన సమస్య కూడా. వైఎస్ కుటుంబం పరిష్కరించలేని ఈ సమస్యని చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు. గండికోట ప్రాజెక్టుకి కృష్ణాజలాలను తరలించి.. అక్కడనుంచి పులివెందుల ప్రాంతంలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరందించారు. తద్వారా పులివెందుల కెనాల్స్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో పులివెందుల ప్రజలకు తాగు- సాగునీటికి కొదవ లేకుండా పోయింది. వ్యవసాయపరంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగింది తెలుగుదేశం ప్రభుత్వం. పులివెందులలో టీడీపీ సాధించిన ఈ రాజకీయ విజయం ఆ పార్టీకి అనూహ్యంగా కలిసివచ్చే అవకాశముందన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీనికితోడు పులివెందుల ప్రజల్లో కూడా కొంత మార్పు వచ్చిన సంగతి వాస్తవం.
పులివెందులలో ఒకప్పుడు ఒక్క వైఎస్ కుటుంబం తప్ప ఇతర పార్టీలంటే ప్రజలకు తెలియదు. సూటిగా చెప్పాలంటే, ఇతర పార్టీలకు, ఇతర నేతలకు పులివెందులలో స్థానం ఉండేది కాదు! అక్కడ పర్యటించడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. అలాంటిది ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు కనిపిస్తోంది. పులివెందులలో తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహిస్తే.. భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. పులివెందుల ప్రజల్లో ఇంత మార్పు రావడానికి ప్రధానం కారణం స్థానిక టీడీపీ నేతలేనని చెప్పుకోవాలి. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ సతీష్‌కుమార్‌రెడ్డి, మరో నేత రాంగోపాల్ రెడ్డి- వీరిద్దరూ కలసి పులివెందుల ప్రజల్లో రాజకీయ పరివర్తన తేవడానికి అహరహం శ్రమించారు. వైఎస్ కుటుంబ సెంటిమెంట్ నుంచి ప్రజల మెంటాలిటీ టీడీపీ వైపు మళ్లించేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మరో నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా వీరి దారిలోనే కృషి సాగిస్తున్నారు.
ఈ సందర్భంగా సతీష్‌కుమార్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పులివెందులకు నీటిని తెచ్చేవరకూ తన గడ్డం మీసాలను తీయబోనని కడపలో ఆయన శపథం చేశారు. రెండేళ్లపాటు అలాగే తిరిగారు. తన పంతం నెరవేర్చుకున్నాకే ఆయన గడ్డం మీసాలను కత్తిరించుకున్నారు. ఇక రాంగోపాల్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూవచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందేలా శ్రద్ధపెట్టారు. టీడీపీ హయాంలో పులివెందులకు నాలుగు వేల ఇళ్లు మంజూరయ్యాయి. అనేక అభివృద్ధి పనులు అనతి కాలంలోనే సాకారమయ్యాయి. తద్వారా ఆ ప్రాంత ప్రజల మనసు చూరగొన్నారు. ఇలా అడుగడుగునా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. వైఎస్ కుటుంబ ఓట్‌బ్యాంకుని కొల్లగొడుతూ వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో జరిగిన అభివృద్ధికి కానీ, ప్రజల్లో వచ్చిన మానసిక మార్పుకి కానీ సీఎం చంద్రబాబు నాయుడు మొదలు జిల్లా తెలుగు తమ్ముళ్లందరి కృషీ ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలపడింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి సహా అందరి ప్రమేయం ఇందులో ఉందన్న మాట వాస్తవం. ఈ కోటలో పాగా వేయాలన్నదే తమ్ముళ్ల ముఖ్య లక్ష్యమట