హైదరాబాద్
జమిలీ ఎన్నికల బిల్లు అమలైతే తెలంగాణలో ఆరు మాసాల పాటు రాష్ట్రపతి పాలన తప్పదా?... మరో 9 ఏళ్ల తర్వాత తెలంగాణకు ఆ పరిస్థితి రానుందా? అంటే అవుననే సమాధానం వస్తుందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమల్లోకి రానుంది. అంటే అప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ప్రస్తుతం ఎలా జరిగాయో అలానే జరుగుతాయని వినోద్ కుమార్ తెలిపారు. 2029 తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 2034లో పార్లమెంట్ ఎన్నికలతోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కంటే ఆరు మాసాల ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 2028లో ఏర్పడే అసెంబ్లీ 2033లో ముగుస్తుందని, దాదాపు 6 మాసాల పాటు తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.