తిరుమల, డిసెంబర్ 19,
తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 10, 2025 నుండి జనవరి 19, 2025 వరకు తిరుమలలో జరిగే పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సన్నాహాలు ప్రారంభించింది. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలపై టీటీడీ ఈవో జె.శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి అన్నమయ్య భవన్‌లో ఏర్పాట్లు నిర్వహించి, సమీక్ష చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ నెల 23న ఉదయం 11 గంటలకు 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని ఈవో తెలిపారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారన్నారు.శ్రీవాణి ట్రస్ట్-లింక్డ్ వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోటాను డిసెంబరు 23న ఆలయ నిర్వాహకులు విడుదల చేస్తారని శ్యామలరావు చెప్పారు. ఉత్సవ కాలానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటాను కూడా టీటీడీ విడుదల చేస్తుంది. టీటీడీ ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు తిరుపతిలో ఎనిమిది టికెట్ కౌంటర్లు, తిరుమలలో ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తుంది.టోకెన్లు లేదా టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు గానీ వారికి దర్శనం లభించదు. టోకెన్లు లేదా టికెట్లు లేని భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 4:45 నిమిషాలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమౌతాయి. ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశి రోజున వేదాశీర్వచనాలు కూడా రద్దవుతాయి. ఆ రోజున ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వామివారు స్వర్ణ రథంపై ఊరేగుతారు. వైకుంఠ ద్వాదశి రోజున తెల్లవారు జామున 5:30 నుండి 6:30 వరకు శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ అధికారులు చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.వైకుంఠ ఏకాదశి రోజు (జనవరి 10) దర్శనానికి ప్రోటోకాల్ వీఐపీలను మాత్రమే అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. ఉత్సవాల కోసం భారీ యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, 10 రోజుల పండుగ కాలంలో తిరుమలలో వేదాశీర్వచనం, అన్ని రకాల విశేష దర్శనాలను ఆలయ సంస్థ రద్దు చేసింది. కాగా, సంప్రదాయం ప్రకారం, జనవరి 10న తిరుమలలో జరిగే స్వర్ణ రథోత్సవం, మరుసటి రోజు వైకుంఠ ద్వాదశి సందర్భంగా చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజుకు 3.5 లక్షల లడ్డూలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయడంతో పాటు 3.5 లక్షల లడ్డూలను టీటీడీ బఫర్ స్టాక్‌లో ఉంచనుంది.
టీటీడీ నిర్ణయాలివే..
వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ నెల 23న ఉదయం 11 గంటలకు 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
ఈ నెల 24న ఉదయం 11 గంటలకు 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
జనవరి 10 నుంచి 19 వరకూ 10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలోని ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు కేటాయిస్తారు.
తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తారు.
టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఈకి ఆదేశం. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తారు. టోకెన్లు లేని భక్తులను దర్శన క్యూలైన్లలోకి అనుమతించరు.
వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 04:45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కాగా.. అధిక రద్దీ కారణంగా ఆ రోజున ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు.
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్వర్ణరథం, ఉదయం 5:30 నుంచి 6:30 వరకూ శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతాయి. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.