కాకినాడ, డిసెంబర్ 19,
ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పలు శాఖలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూశారు. మాయం చేసిన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని భావిస్తున్నారు. కానీ క్రిమినల్ కేసులు నమోదు చేశాం. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలు అధికారులు రేషన్ బియ్యంపై చర్యలకు సిద్ధమని తెలిపారు.తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ లో 3 వేల బస్తాలు మాయం చేశారనుకున్నాం, కానీ 4840 బస్తాలు మాయం. గత ప్రభుత్వంలో పదవిలో ఉండి ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంతో దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెడతాం. కూటమి ప్రభుత్వంలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు. కానీ తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. అక్కడే ఉన్న రెండో గోదాములోనూ అక్రమాలు జరిగాయని అనుమానాలు ఉన్నాయి. పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాక ఏపీలోని 1300 రైస్ మిల్లులకు అందించి బియ్యంగా మారుస్తాం. ఆ బియ్యాన్ని మొత్తం 104 గోడౌన్లలో భద్రపరుస్తాం. ఆ నిల్వ చేసిన బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు , అంగన్వాడీ కేంద్రాలకు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు సరఫరా చేస్తాం. పౌరసరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకురావాలని సివిల్ సప్లైస్ ఎండీ మనజీర్ నవంబర్ 26న “వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్” అనే సాఫ్ట్ వేర్ తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంది? ఎక్కడ ఎంత స్టాక్ భద్రపరచాలి? వచ్చే సీజన్ లో ఎంత కొనుగోళ్లు చేయాలి? అనే సమాచారం పొందుపరిచేలా ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు. గోడౌన్ యాజమానులకు, వాళ్ల మేనేజర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆన్‌లైన్ వేదికగా ట్రైనింగ్ ఇచ్చారు. ఏ విధంగా తనిఖీలు చేసి కంప్యూటరీకరణ చేయాలో శిక్షణ ఇచ్చారు. నవంబర్ 27వ తేదీన తమ గోదాముల్లో స్టాక్స్ తక్కువగా చూపిస్తోందని, 3 వేల బ్యాగుల రేషన్ బియ్యం షార్టేజి అని వేబ్రిడ్జ్ లో పొరపాటు వల్ల ఇలా జరిగిందని జె.ఎస్. గోడౌన్ నుంచి లేఖ వచ్చింది. గోడౌన్ లో మాయమైన బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని సైతం లేఖలో పేర్కొన్నారు’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.జేఎస్ గోడౌన్స్ లో స్టాక్ ఎంత ఉందనని స్టాక్ రిజిస్టర్ ప్రాథమిక సమాచారాన్ని జాయింట్ కలెక్టర్ నుంచి డిసెంబర్ 4న తెప్పించారు. దాని ప్రకారం మాయమైంది 3 వేల బస్తాలు కాదు 3708 బస్తాలు తగ్గాయని తెలిసింది. డిసెంబర్ 10న సివిల్ సప్లైస్ ఎండీ చట్టప్రకారం డబుల్ పెనాల్టీ వేయాలని, జేఎస్ గోడౌన్ ను బ్లాక్ లిస్టులో ఉంచాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మాయమైన రేషన్ బియ్యంపై విచారణ చేపట్టేందుకు ఆర్డీవో, సివిల్ సప్లైస్ మేనేజర్, లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్ తో కమిటీ వేశారు.