YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

తిరుమల సరే.... మిగిలిన ఆలయాల్లో లో జీఎస్టీ మినహాయింపు రాని క్లారిటీ

తిరుమల సరే.... మిగిలిన ఆలయాల్లో లో జీఎస్టీ మినహాయింపు రాని క్లారిటీ
వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడి) పన్ను మినహాయింపు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. అయితే మిగిలిన ఆలయాలపై క్లారిటీ రాలేదు. మరో వైపుఆధ్యాత్మిక నిలయాలుగా ఉన్న ఆలయాలను కేంద్రం వ్యాపార కేంద్రాలుగా పరిగణిస్తోంది. రూ.20 లక్షల వార్షిక ఆదాయం దాటే ఆలయాలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. అంటే, ఆయా ఆలయాల్లో జరిగే వివిధ లావాదేవీలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అక్కడి వసతి గదులు, తలనీలాలు, ప్రసాదాలు, షాపుల వేలం, వాటిలో వ్యాపారాలు, ఇతర లావాదేవీలకు ఒక్కో విధమైన పన్ను పడే అవకాశం ఉంటుంది. ఆలయాలను జీఎస్టీలో రిజిస్టర్‌ చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని వాణిజ్య పన్నుల శాఖలు నిర్ణయించాయి. రూ.20 లక్షల వార్షిక ఆదాయం దాటిన ఆలయాలు ఏపీ, తెలంగాణల్లో ఒక్కోచోట 300 వరకు ఉంటాయని అంచనా. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, వరంగల్‌ భద్రకాళి, చిలుకూరు బాలాజీ, ధర్మపురి, కాళేశ్వరం, సమ్మక్క సారలమ్మ, సికింద్రాబాద్‌ మహంకాళి, బాసర సరస్వతి తదితర ఆలయాలన్నీ జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి.ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ ఆలయం, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి, మహానంది, నెల్లూరులోని రంగనాథస్వామి, రామతీర్థం రామస్వామి, మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి, మంగళగిరి పానకాల స్వామి, సింగరాయకొండ ఆంజనేయస్వామి, కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి తదితర ఆలయాలతోపాటు ధార్మిక సంస్థలు కూడా జీఎస్టీ పరిధిలోకి వస్తాయి.జీఎస్టీతో ఆలయాల్లో ప్రసాదం ప్రియం కానుంది. అన్ని ఆలయాల్లోనూ లడ్డూ, పులిహోర ప్రసాదాన్ని భక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. డ్రై ఫ్రూట్స్‌పై ఇప్పటి వరకూ 6 శాతంగా ఉన్న వ్యాట్‌ జీఎస్టీతో 12శాతం కి చేరుకుంది. ఫలితంగా లడ్డూల తయారీకి ఉపయోగించే కాజు, బాదం, కిస్‌మిస్ పై నేరుగా ప్రభావం పడుతుంది. అలాగే, ప్రసాదాల తయారీలో ప్రముఖంగా ఉపయోగించే నెయ్యిపై ఇప్పటి వరకూ 6 శాతం పన్ను ఉండగా.. జీఎస్టీలో దానిని 12 శాతం చేశారు. ఈ ప్రభావం ప్రసాదాల ధరపై పడనుంది. టీటీడీ, యాదాద్రి, భద్రాద్రి వంటి ఆలయాలు ప్రసాదాలను రాయితీపై భక్తులకు అందజేస్తున్నాయి. జీఎస్టీతో పడే అదనపు భారాన్ని ఆలయాలు పడనుంది. యాదాద్రిలో నిత్యం 10 వేల లడ్డూ ప్రసాద విక్రయాలు జరిగితే, వారాంతంలో ఆ సంఖ్య సుమారు 40 వేల వరకూ ఉంటుంది. ఒక్కో లడ్డూ తయారీకి సుమారు రూ.16 వరకూ ఖర్చవుతుంది. కానీ, దానిని దేవస్థానం వారు రూ.15కే భక్తులకు అందిస్తున్నారు. ఇప్పటికే ప్రసాద విక్రయంతో నష్టాన్ని భరిస్తుండగా జీఎస్టీతో అది మరింత పెరగనుంది.దేశ, విదేశాల్లోని తెలుగువారి ఇలవేల్పు భద్రాద్రి రాముడి ఆలయంలో ప్రసాదం విషయంలో ఇప్పటికే కొన్ని మార్పులు వచ్చాయి. జీఎస్టీ అమలైతే రాములవారి ప్రసాదం మరింత ప్రియం కానుంది. భద్రాద్రిలో ప్రతిరోజూ సుమారు 5 వేల లడ్డూలు విక్రయిస్తుంటారు. వారాంతంలో 8 నుంచి 10 వేల లడ్డూల వరకూ అమ్ముతారు. 100 గ్రాముల ఒక్కో లడ్డూ తయారీకి రూ.13.50 ఖర్చవుతుంది. మూడు నెలల కిందటి వరకూ 100 గ్రాముల లడ్డూ రూ.15కు విక్రయించేవారు.ఆలయంపై ఆర్థిక భారం పడుతోందని లడ్డూను 100 నుంచి 80 గ్రాములకు తగ్గించారు. మహా ప్రసాదంగా 400 గ్రాముల లడ్డూను రూ.50కి అందజేసేవారు. ఆర్థిక భారంతో దీని విక్రయాలను పూర్తిగా నిలిపి వేశారు. జీఎస్టీ తర్వాత ఇక్కడ మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. వేములవాడ ఆలయంలో రోజూ 30 వేల వరకూ లడ్డూలు విక్రయం జరుగుతుండగా ఆది, సోమవారాల్లో రెండింతల లడ్డూలు విక్రయిస్తుంటారు. బాసర, కొండగట్టు.. ఇలా అన్ని ప్రముఖ ఆలయాల్లో లడ్డూ ధరలపై ఇప్పటికే అధికారులు ఆలోచనలో పడ్డారు.ప్రముఖ ఆలయాల్లో బస చేసేందుకు నామమాత్రపు అద్దెనే గదులకు చెల్లిస్తున్నారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ ఎటువంటి పన్నులూ వేయలేదు. కానీ, ఆలయాల్లో వసతులపైనా కేంద్రం జీఎస్టీతో బాదనుంది. రోజు అద్దె రూ.500 దాటితే ఆయా గదులు లగ్జరీ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తాయి. దాంతో, వాటికి 18 శాతం జీఎస్టీ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, సేవ, అభిషేకం టికెట్లపైనా పన్ను భారం పడనుందితలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకునేందుకూ ఇకపై అధిక మొత్తంలోనే చెల్లించుకోవాల్సి రావచ్చు. ఆలయాల నుంచి కొనుక్కునే తలనీలాలపైనా కేంద్రం పన్ను వేయనుంది. దాంతో ఆ భారాన్ని కూడా ఆలయాలు భక్తులపైనా వేస్తాయా లేదా అనే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. ఆలయాల వద్ద వ్యాపార సముదాయాల్ని అద్దెకు ఇచ్చే విషయంలోనూ జీఎస్టీ కారణంగా ఇకపై భారీగా పెరుగుదల ఏర్పడనుంది. ప్రధాన ఆలయాలు తప్ప మిగిలిన ఆలయాలకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఉద్యోగులకు వేతనాల భారం ఇప్పటికే ఉందని దేవాదాయ శాఖ పేర్కొంటోంది. పైగా, ప్రభుత్వం నుంచి ఏ ఆలయానికి నిధులు అందవు. పూర్తిగా భక్తుల నుంచి వచ్చే ఆదాయంతోనే అవి మనుగడ సాగిస్తున్నాయి

Related Posts