YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెడ్ శాండిల్ ఈ టెండర్లకు కసరత్తు

రెడ్ శాండిల్  ఈ టెండర్లకు కసరత్తు
అంతర్జాతీయ మార్కెట్ లో మరోసారి ఎర్రచందనం వేలం వేసేందుకు సర్కార్ కసరత్తును ప్రారంభించింది. గ్లోబల్ ఈ-టెండర్ల ద్వారా గతంలో కూడా ఎర్రచందనాన్ని ప్రభుత్వం విక్రయించి కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకుంది. ఈసారి కూడా గ్రేడ్ల రూపంలో ఎర్రచందనం విక్రయించాలని ఐదుగురితో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎర్రచందనంతో ఆర్థిక లోటు బడ్జెట్ ను అధిగమించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది...శేషాచలం. ఈ పేరు వింటేనే మొదటగా గుర్తుకు వచ్చేది తిరుమల వెంకన్న. ఆ తరువాత ఎర్రచందనం. ఆసియాలోనే ఎక్కడా దొరకని అత్యంత అరుదైన ఎర్రచందనం శేషాచలంలో మాత్రమే లభిస్తుంది. అలాంటి ఎర్రచందనాన్ని కొంతమంది అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు సంపాదించేస్తున్నారు. అయితే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ వచ్చిన తరువాత ఎర్రచందనం అక్రమ రవాణా కాస్త తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం భావిస్తోంది. అక్రమంగా తరలించే ఎర్రచందనాన్ని పోలీసులు, టాస్క్ ఫోర్స్, అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ గోడౌన్లలో భద్రపరుస్తున్నారు. భద్రపరిచిన ఎర్రచందనాన్ని గ్రేడ్లుగా విభజించారు. ఎగ్రేడ్, బిగ్రేడ్, సి గ్రేడ్ గా ఎర్రచందనాన్ని వేరు చేసి మొదటగా ప్రభుత్వం విక్రయించింది. మొదట్లోనే విదేశాల నుంచి వచ్చిన కొంతమంది ఎర్రచందనాన్ని వేలం ద్వారా కొనుగోలు చేశారు. అయితే ఆ తరువాత మరింత ఎర్రచందనం తిరిగి గోడౌన్లకు చేరిపోయింది.తిరుపతి సమీపంలోని జీవకోన, కపిలతీర్థం, రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఎర్రచందనం గోడౌన్లు ఉన్నాయి. ఈ గోడౌన్ లో ఇప్పటికే ఎర్రచందనం ఎక్కువగా నిల్వ ఉంచారు. పట్టుబడిన ఎర్రచందనం మొత్తం గోడౌన్లలో దర్సనమిస్తున్నాయి. ఇక స్థలం లేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు అటవీశాఖ అధికారులు. అందుకే ఎలాగైనా ఎర్రచందనాన్ని విక్రయించాలని ప్రభుత్వం భావించి ఈ-టెండర్ల ద్వారా విక్రయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది. ప్రత్యేకంగా ప్రభుత్వమే ఒక కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షణ కోసం నియమించింది. ప్రస్తుతం ప్రభుత్వ గోడౌన్లలో 1957.906మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఉన్నట్లు అంచనాకు వచ్చారు. త్వరలోనే వీటిని మొత్తాన్ని విక్రయించాలని నిర్ణయం కూడా తీసేసుకున్నారు. .

Related Posts