విజయవాడ, డిసెంబర్ 20,
రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపేందుకు శాయశక్తులా శ్రమిస్తున్న నేత. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. తాను పరుగులు పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే తప్పు చేసిన నాయకుల పట్ల కూడా సీఎం సీరియస్‌గా ఉంటున్నారు. స్వంత పార్టీ నేతలను కూడా క్రమశిక్షణలో ఉండాలని.. ఎలాంటి తప్పు చేయకూడదని గట్టిగానే చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని నేతలకు నిర్దేశిస్తున్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. తన మన అనే తేడా లేకుండా సొంత పార్టీ నేతలకు కూడా వార్నింగ్‌లు ఇస్తున్నారు సీఎం. నేతల తీరుతో పార్టీకి ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా సీఎం అలర్ట్‌గా ఉంటూ.. పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు స్వీట్ వార్నింగ్స్ ఇస్తూనే.. హద్దులు దాటుతున్న వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ హెచ్చరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.బినెట్ భేటీలో మంత్రుల శాఖల్లో ఫైళ్లు పెండింగ్ లో ఉండటంపై సీఎం చంద్రబాబు స్పందించారు. మంత్రులు టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోవడాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారు. మంత్రి దగ్గరికి ఏదైనా ఫైలు వచ్చి ఎంత సేపు పెండింగ్‌లో ఉంటోందో తనకు తెలుసని చంద్రబాబు తెలిపారు. మంత్రుల పనితీరును తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎం వారికి తెలిపారు. జిల్లాలకు వెళ్లని ఇన్ ఛార్జ్ మంత్రుల తీరుపైనా చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల్ని మంత్రులు లోతుగా పరిశీలించకపోవడంపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో కొంతమంది మంత్రులు అస్సలు వాటిపై అధ్యయనం చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపైనా తన మంత్రుల పనితీరుపై తన పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. మరోవైపు ఇప్పటికే ఆరునెలల పాలనలో పలు కేబినెట్ సమావేశాల్లో మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించాలని చంద్రబాబు సూచిస్తూనే ఉన్నారు. అయినా కొందరు మంత్రుల వైఖరిలో మార్పు రావడం లేదని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.మంత్రుల పనితీరుపైగా పరిశీలన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఆరుగురు మంత్రుల పనితీరు ఏ మాత్రం బాగోలేదని వ్యాఖ్యానించారు. వారి పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోలేదని ఆగ్రహించారంట. ఇకపైన కూడా మార్పు రాదని నాకు బాగా తెలుసు అని చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకారంటున్నారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, ఇక చెప్పడం, వార్నింగ్‌లు ఇవ్వడం ఏమీ ఉండదు పదవి నుంచి తొలగించడమే అంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఆరుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించడం పక్కా అని దాదాపు తేలిపోయింది. ఈ కీలక పరిణామం వచ్చే ఏడాది, అందులోనూ సంక్రాంతి తర్వాత ఉండే అవకాశాలే మెండుగానే కనిపిస్తున్నాయి.రాయలసీమ నుంచి ఇద్దరు, ఉత్తరాంధ్ర నుంచి ఒకరు, కోస్తా నుంచి ముగ్గురి విషయంలో మొత్తం ఆరుగురు మంత్రులపై గుర్రుగా చంద్రబాబు ఉన్నారు. వీరికి ఇచ్చిన శాఖల పరంగా న్యాయం చేయలేకపోవడం, కనీసం శాఖలపై పట్టు పెంచుకోవడానికి కూడా సాహసం చేయకపోవడం, ఇక లేనిపోని విషయాల్లో ఆ మంత్రులు, వారి కుటుంబ సభ్యులు తలదూర్చి వార్తల్లో నిలవడం ఇలా ఒకట్రెండు కాదు లెక్కలేనన్ని ఆరోపణలు వారిపై ఉన్నాయి. సంక్రాంతి తర్వాత వారందర్నీ పక్కనెట్టినా, లేదంటే ఇంకో ఆర్నెళ్లు సమయం ఇచ్చినా ఇవ్వొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.