విజయవాడ, డిసెంబర్ 20,
ఏపీలో ఈ ఏడాది ప్రారంభంలో రాజధానిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. మూడు రాజధానులకు కట్టుబడిన వైసీపీ ఓవైపు విశాఖలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభించి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. అదే సమయంలో విపక్షంలో ఉన్న కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ తాము అమరావతి రాజధానికే మద్దతిస్తున్నట్లు తేల్చిచెప్పేశాయి. ఈ తరుణంలో ఏపీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే తీర్పు రాజధానికి కీలకంగా మారింది. అప్పటికే వైసీపీ మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించి దానిపై కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటోంది. మరోవైపు అమరావతి రాజధానికి ప్రజల మద్దతు సంపాదించేందుకు కూటమి పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మాత్రం అన్ని పార్టీలు రాజధాని చర్చను పక్కనబెట్టేశాయి. ఎన్నికల్లో మూడు రాజధానులకు మద్దతు అని చెప్తే అమరావతిలో ఓట్లు రావని వైసీపీ.. అలాగే అమరావతి రాజధాని అని చెప్తే రాయలసీమ, ఉత్తరాంధ్రలో వ్యతిరేకత తప్పదని కూటమి పార్టీలు భయపడ్డాయి. అయితే ఎన్నికల్లో మాత్రం ప్రజలు తాము ఇచ్చే తీర్పు ఆధారంగా రాజదాని నిర్ణయం అవుతుందని భావించారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎవరూ ఊహించని స్ధాయిలో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో వైసీపీ మూడు ముక్కలాటకు చెక్ పడినట్లయింది. అదే సమయంలో అమరావతికి తిరిగి ప్రాణం వచ్చినట్లయింది. గత ఐదేళ్లుగా వైసీపీ మూడు రాజధానుల పేరుతో ఆడిన ఆటతో అమరావతి తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాన్నినమ్మి ఏకంగా 36 వేల ఎకరాల భూములు స్వచ్చందంగా ఇచ్చిన రైతులు ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి వారికి సకాలంలో ఇస్తామన్న కౌలు రావడం కూడా కష్టమైపోయింది. ప్రతీ ఏటా హైకోర్టుకు వెళ్లి మరీ కౌలు తెచ్చుకునే వారురాష్ట్రంలో అధికార మార్పుకు ప్రజలు ఇచ్చిన ఓటు రాజధానిపైనా స్పష్టత ఇచ్చేసింది. ఐదేళ్ల పాటు ఏపీ రాజధాని అంటే ఏదనే ప్రశ్నకు జవాబు కూడా దొరికింది. ఇక కోర్టుల్లో గతంలో రైతులు దాఖలు చేసిన కేసులు వెనక్కి తీసుకోవడమే మిగిలుంది. అటు కూటమి సర్కార్ కూడా అమరావతిలో వేగంగా అడుగులేస్తోంది. వచ్చే జనవరి నుంచి అమరావతిలో పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. అలా ఒక్క ఏడాదిలో రాజధానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది