విజయవాడ, డిసెంబర్ 20,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు 2019లో అధికారాన్ని తెచ్చిపెట్టిన ఐ ప్యాక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఐ ప్యాక్ సంస్థ బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ దే అయినప్పటికీ ఆయన 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. దీంతో ఐప్యాక్ సంస్థలో పనిచేసిన వారు దానిని నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికలకు కూడా వైఎస్ జగన్ మరోసారి గెలిచేందుకు ఐప్యాక్ సంస్థను కొనసాగించారు. ఐప్యాక్ సంస్థకు రుషిరాజ్ నేతృత్వం వహించారు. ఐదేళ్ల పాటు ఐప్యాక్ సంస్థ వైసీపీకి సేవలందించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ, సోషల్ మీడియాలో ప్రచారం వరకూ అంతా తానే అయి ఐప్యాక్ సంస్థ జగన్ కు అనుకూలంగా పనిచేసింది ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఐప్యాక్ సంస్థకు వెళ్లి వారితో ముచ్చటించి వచ్చారు. ఐప్యాక్ సంస్థలో పనిచేసిన వారికి అభినందనలు తెలిపారు. దేశం నివ్వెరపోయాలా ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇటు ఐప్యాక్ సంస్థ కూడా రెండోసారి గెలుపు వైసీపీదేనంటూ జగన్ కు నివేదికలను అందించడంతో ఆ సంస్థపై జగన్ పూర్తిగా నమ్మకం ఉంచారు. తన గెలుపునకు సంక్షేమ పథకాలు సగం కారణమైతే, మిగిలిన సగం ఐప్యాక్ పూర్తి చేస్తుందనిగట్టగా నమ్మారు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. నిజంగానే దేశం నివ్వెరపోయేలా మైండ్ బ్లాంక్ అయ్యేలా వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అప్పటి నుంచి ఐ ప్యాక్ యాక్టివిటీ పెద్దగా లేదు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టే పోస్టులపై చర్యలకు సిద్ధమవుతుంది. అనేక మంది పై కేసులు నమోదయ్యాయి. కొందరు జైళ్లకు వెళ్లి వచ్చారు. మరికొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో ఐప్యాక్ టీంలోనూ కొంత బెరుకు ఏర్పడినట్లుంది. తాము ఇక్కడ ఉంటే కేసులను ఎదుర్కొనాల్సి వస్తుందని భావించి బెజవాడ నుంచి బిచాణా లేపేసింది. ఇప్పుడు విజయవాడలో ఐ ప్యాక్ సంస్థ లేనట్లేనని అంటున్నారు. వైసీపీలో కూడా పెద్దగా యాక్టివిటీ లేకపోవడం, ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్లు గడువు ఉండటంతో ఐప్యాక్ సంస్థ షటర్స్ క్లోజ్ చేసిందని చెబుతున్నారు. విజయవాడ నుంచి పక్కకు వెళ్లి పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉండాలన్నా అక్కడ కూడా తమకు అనుకూలమైన ప్రభుత్వం లేకపోవడంతో ఐ ప్యాక్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేకుండా పోయింది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఐప్యాక్ పనిచేసింది. ఐప్యాక్ బెజవాడ నుంచి బోర్డు తిప్పేసి ఇప్పుడుకోల్ కత్తా, బీహార్, ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. బీహార్ లో తమ సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కు అండగా ఉండేందుకు ఒక టీం వెళ్లిందంటున్నారు. అలాగే కోల్ కత్తాకు మరొక టీం వెళ్లిందని చెబుతున్నారు. ఇక ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పనిచేయడానికి ఐ ప్యాక్ టీం అక్కడకు వెళ్లిందన్నది సమాచారం. మొత్తం మీద జగన్ ను వదిలి ఐప్యాక్ టీం పూర్తి గా దూరంగా వెళ్లిపోయిందనే చెప్పాలి.