YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టాలీవుడ్ వర్సెస్ సర్కార్

టాలీవుడ్ వర్సెస్ సర్కార్

హైదరాబాద్, డిసెంబర్ 20, 
సినీ ఇండస్ట్రీ, పాలిటిక్స్‌ బంధం బలమైనది అంటారు. ఇప్పటి వరకు అలాగే ఉండేది.. రెండు రంగాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది.. రాష్ట్రమేదైనా, ప్రభుత్వమేదైనా గ్లామర్ వరల్డ్‌కు ఇచ్చే ప్రయారిటీ వేరు.. ఐతే తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ డైరెక్షన్‌లో సాగుతోంది. ఇండస్ట్రీకి- పాలిటిక్స్‌కి చిన్న గ్యాప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.సినిమా వాళ్లకు ప్రయారిటీ ఇచ్చే సాంప్రదాయానికి రేవంత్ సర్కార్ ప్యాకప్ చెప్పేసినట్లుగా మారింది పరిస్థితి. ప్రజాపాలనలో చట్టం ముందు అందరూ సమానమేనని చెబుతోంది. వట్టి డైలాగులే కాదు.. చేసి చూపించింది కూడా. కాంగ్రెస్ సర్కార్ అధికార పీఠం ఎక్కగానే.. నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చేసి టాలీవుడ్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక మొన్న అల్లు అర్జున్ అరెస్ట్‌తో చట్టానికి ఎవరైనా ఒక్కటేనని మరింత బలంగా చెప్పింది..గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్లకి ప్రజల్లో క్రేజ్‌ మామాలుగా ఉండదు. స్పెషల్ స్టేటస్, డబ్బులు, ఫారెన్ టూర్లు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ రాయల్‌ లైఫ్ ఉంటుంది. సామాన్య జనమే కాదూ పొలిటికల్ లీడర్లు కూడా హీరోలకు అభిమానులే. ఇలా చాలాకాలంగా సినీ రంగంలోని పెద్దలను ప్రత్యేక క్యాటగిరీగా చూస్తున్నారు. రాజకీయ పరిచయాలు, ప్రభుత్వ పెద్దలతో చనువు ఇలా అన్ని రంగాల్లో స్పెషల్ క్యాటగిరీగా చెలామణి అవుతున్నారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సినీ ప్రముఖులతో సన్నిహితంగా ఉండడం పరిపాటిగా వస్తోంది. కొందరు సినీ నటులు ఎన్నికల వేళ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయా పార్టీలకు ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
టాలీవుడ్ హీరోల అభిమానుల ఓట్ల కోసం గత ప్రభుత్వాలు.. వారేం చేసినా.. చూసీ చూడనట్లు వ్యవహరించేవి. నిజానికి కళాకారులను ప్రోత్సహించాలి. కానీ కేవలం సినీ ఇండస్ట్రీ వాళ్లే కళాకారులన్నట్లుగా, మిగితా వారిని పట్టించుకోవాల్సిన పని లేదన్నట్లుగా వ్యవహరించే వారు. కొందరు సినీ స్టార్లు అయితే ప్రభుత్వాలను కూడా లెక్క చేసే వారు కాదు. దీంతో సినిమా వాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అభిప్రాయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. కానీతెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ లెక్కలు తారుమారయ్యాయి. సినిమా స్టార్స్ అంటే ప్రత్యేకం కాదని స్పష్టం చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. తప్పు జరిగితే ఎవరైనా డోంట్ కేర్ అంటూ దూసుకెళ్తోంది. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా అల్లు అర్జున్ అరెస్టుపై నిర్ణయం తీసుకోగలిగింది. అల్లు అర్జున్ అరెస్ట్‌పై వారం రోజుల ఆలస్యం జరిగినప్పుడే బిగ్‌బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్‌కి ఓ న్యాయం.. అల్లు అర్జున్‌కు మరో న్యాయమా? అనే చర్చ మొదలైంది. కానీ చివరికి చట్టం ముందు అందరూ సమానమని తేల్చేసింది కాంగ్రెస్ సర్కార్.ఒక్క అల్లు అర్జున్ విషయంలోనే కాదు.. ఏడాది కాలంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న చాలామంది విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ రూల్స్‌కి విరుద్ధంగా నిర్మించారని నేలమట్టం చేసేశారు. ఈ మధ్య రచ్చగా మారిన మంచు ఫ్యామిలీ ఎపిసోడ్‌లోనూ పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించారు. మంచు ఫ్యామిలీ గొడవను పక్కన పెడితే జర్నలిస్టుపై దాడి విషయంలో మోహన్‌బాబుపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఏ క్షణంలోనైనా మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశముందని కూడా చెబుతున్నారు పోలీసులు. ఆ మధ్య జానీ మాస్టర్ అరెస్ట్‌ పైనా ఆగమేఘాలపై ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గేదేలే అన్నట్టే వ్యవహరించారు.రేవంత్ దూకుడు ముందు సినీ స్టార్ల ఆటలు సాగడం లేదు. ఎక్కడ ఏ చిన్న పొరపాటుతో పట్టుబడినా సామాన్యుల మాదిరిగానే ట్రీట్ చేస్తున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీకి బలంగా వెళ్లిపోయింది. అందుకే.. మిగిలిన వారంతా ఎందుకు వచ్చిన గొడవ అని సర్దుకుంటున్నారట. మద్యం తాగి వాహనం నడపాలన్నా జంకుతున్నారట. ముఖ్యంగా చాలా మంది సినిమా వాళ్లకి డ్రగ్స్‌ విషయంలో లింకులు ఉన్నాయి. కొందరు వాటికి అలవాటు పడితే.. మరికొందరు సైడ్ బిజినెస్‌గా మార్చుకున్నారని అందరూ బహిరంగంగా చెప్పుకునే సీక్రెట్.. ఇప్పుడు సర్కార్ దెబ్బకి అందరూ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయినట్లు ఇండస్ట్రీ టాక్. ఐతే ఇదంతా ఎందుకు? ఇండస్ట్రీని రేవంత్ సర్కార్ టార్గెట్ చేయడానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు మాత్రం కరెక్ట్ ఆన్సర్ లేదు.. కాకపోతే సినీ ఇండస్ట్రీ కానీ, సెలబ్రిటీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టించుకోవడం లేదనే టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.. అందుకే ఇలాంటి ఝలక్‌లు ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నాయని కూడా గాసిప్ చక్కర్లు కొడుతోంది.. మరి ఏది నిజం.. ముందుముందు అంతా సర్ధుకుంటుందా? చూడాలి..

Related Posts