కాకినాడ, డిసెంబర్ 21,
కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి ఆపొద్దని.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ లేఖ రాసింది. అందులో భాగంగానే "సీజ్ ది షిప్"తో ప్రాచుర్యం పొందిన స్టెల్లా షిప్‌ను పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతయ్యే బియ్యం, నూకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించొద్దని.. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్) ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒకవేళ బియ్యం ఎగుమతులను అడ్డుకుంటే, అది కేంద్ర ప్రభుత్వానికి, విదేశీ ప్రభుత్వాలకు మధ్య జరిగిన ఒప్పందాలను ఉల్లంఘించడం అవుతుందని స్పష్టం చేసింది.ఆఫ్రికా దేశాల్లో ఆకలి నివారణ, అక్కడి ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ఇండియా-ఆఫ్రికా మధ్య కుదిరిన గవర్నమెంట్ టూ గవర్నమెంట్ (జీటూజీ) ఒప్పందంలో భాగంగానే ఎగుమతి చేస్తున్నామని, తనిఖీల పేరుతో ఆటంకం పరచవద్దని సూచించింది. జీటూజీ ఒప్పందంలో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు బియ్యం, నూక ఎగుమతి అవుతోంది. ఇందులో రేషన్ బియ్యం ఉందనే అనుమానంతో ఎగుమతిని అడ్డుకుంటున్నారు. అది సరికాదని ఎన్‌సీఈఎల్ తన లేఖలో వివరించింది.ఎగుమతులకు ఆటంకం కలిగిస్తే అది ఇండియాతో కుదిరిన జీటూజీ ఒప్పందం ఉల్లంఘన అవుతోందని, అంతర్జాతీయంగా సమస్యలు వచ్చిపడతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బియ్యం ఎగుమతులను అడ్డుకోవడం పట్ల కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరచూ ఎన్‌సీఈఎల్‌కు మెయిల్స్, ఫోన్లు చేస్తూ.. ఎగుమతులను నిలిపివేయడంపై ప్రశ్నిస్తోందని ఎన్‌సీఈఎల్ లేఖలో వివరించింది.రాష్ట్రంలోని రైతులు వద్ద నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి, వాటిని రైస్ మిల్లులకు పంపిస్తుందని, అందులో ఆడించిన రైస్‌ను ఫుడ్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది. అయితే ఎఫ్‌సిఐకి పంపే బియ్యంలో కొంత వరకు తిరస్కరణకు గురవుతోంది. ఆ బియ్యాన్ని మిల్లులు నూకగా ఆడించి వాటిని బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తారు. ఆ బియ్యం నూకలనే కేంద్ర ప్రభుత్వం తరపున ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని లేఖలో పేర్కొంది.నూకల్లో రేషన్ బియ్యం ఆనవాళ్లు 0.01 శాతం నుంచి 0.1 శాతం వరకు ఉంటాయని, అది సహజమేనని ఎన్‌సీఈఎల్ పేర్కొంది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నాయన్న కారణంతో.. పోర్టు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టు ద్వారా కేంద్రం తరపున తాము ఎగుమతి చేస్తోన్న నూక బియ్యంలో.. రేషన్ బియ్యం ఆనవాళ్ల పేరుతో నమూనాలు సేకరించి బియ్యాన్ని సీజ్ చేస్తున్నారని ఎన్‌సీఈఎల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో స్టెల్లా షిప్‌ను కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల్లో ఆ షిప్ కాకినాడ యంకరేజ్ పోర్టు నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ పోర్టులో బియ్యం షిప్‌లో లోడ్ చేసేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించదింది. బియ్యం ఎగుమతి చేసేందుకు అన్ని అనుమతులు ఉండటంతో.. ఈ నిర్ణయం తీసుకుంది.ఈఏడాది సెప్టెంబర్‌లో బియ్యం ఎగుమతులపై నిషేధాన్నికేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. బియ్యం ఎగుమతులను అనుమతించింది. తక్షణమే అమల్లోకి వచ్చేలా టన్నుకు కనీస ఎగుమతి ధర.. లేదా ఎంఈపీగా 490 డాలర్లని విధించింది. ఎంఈపీ అనేది ఒక ఉత్పత్తిని విదేశీ కొనుగోలుదారులకు విక్రయించడానికి ఉద్దేశించిన నిర్ణీత కనీస ధర. అంటే, ఈ ధర కన్నా తక్కువ ధరకు ఎగుమతి చేయడానికి వీలు లేదు. అతి తక్కువ ధరలకే భారీగా ఎగుమతులు చేయడాన్ని నిరోధించడానికి ఎంఈపీలను నిర్ణయిస్తారు.