YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పేర్ని నాని కేసులో కదలిక

పేర్ని నాని కేసులో కదలిక

విజయవాడ, డిసెంబర్ 21, 
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ నుంచి రేషన్‌ బియ్యం మాయం ఘటనలో.. పోలీసు, పౌరసరఫరాలశాఖల్లో కొంత కదలిక వచ్చింది. గోదాము నిర్వాహకులైన మాజీమంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన వ్యక్తులు విదేశాలకు పారిపోకుండా.. పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేశారు. అసలు వాస్తవంగా గోడౌన్‌లో మాయమైన బియ్యమెంతో తేల్చే ప్రక్రియను పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రారంభించారు. కేసులో నిందితులు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా ఆ పిటిషన్‌ విచారణకు వచ్చి 19వ తేదీకి వాయిదా పడింది. వైసీపీకు చెందిన మాజీమంత్రి కుటుంబ సభ్యులపై కేసు విషయంలో ఇంత జరుగుతున్నా.. కూటమి నేతల మౌనం విస్తుగొలిపేలా ఉంది. ఈ విషయంలో కొందరు మంత్రులు, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులకు నిజంగా సత్కారం చేయాల్సిందేననే విమర్శలు అధికార పార్టీల కార్యకర్తల్లో కొనసాగుతున్నాయి.మాయమైన బియ్యానికి సంబంధించి జరిమానాతో కలిపి డబ్బు కట్టమని అధికారులు నోటీసు ఇవ్వడంతో.. పేర్ని నాని కుటుంబసభ్యులు తొలి విడతగా ఈ నెల 13న రూ.కోటి మొత్తానికి మూడు డీడీలు సమర్పించారు. సోమవారం మరో రూ.70 లక్షలకు డీడీలు ఇచ్చారు. మొత్తంగా రెండు విడతల్లో రూ.1.70 కోట్ల డీడీలు అధికారులకు అందించారు. అంటే జరిమానాతో కలిపి సొమ్ము చెల్లించామని చెప్పి కేసు నుంచి తేలిగ్గా బయటపడే అవకాశాన్ని అధికారులే కల్పించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్‌ తెచ్చుకుని బయటపడేందుకు శక్తిమేర సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారుల ఉదాసీన వైఖరే దీనంతటికీ కారణమంటున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కుటుంబానికి సంబంధించిన గోడౌన్ వ్యవహారం కావడం, కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఆయనకే అనుకూలమనే సంకేతాలు ఉండడంతో.. జిల్లాస్థాయి అధికారులు తమకెందుకొచ్చిన గొడవని ఎవరికి వారే కేసు తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ,జనసేన నేతలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడే పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన గోడౌన్‌లో 3,708 బస్తాల రేషన్‌ బియ్యం మాయమైనా.. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆ ఛాయలకే పోలేదు. పర్యటనలకు వెళ్తే చాలు, సూపర్‌బజార్లు, రైస్‌ మిల్లులు, పోర్టుల్లో గోదాములను తనిఖీలకు ఉపక్రమించే ఆయన.. ఈ గోడౌన్ జోలికి వెళ్లకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ప్రెస్‌మీట్లు పెట్టి వైసీపీ నేతలపై విమర్శలు చేసే హోంమంత్రి అనిత.. పేదల బియ్యాన్ని మాయం చేసినందుకు అదే వైసీపీకి చెందిన పేర్ని నాని కుటుంబ సభ్యులపై కేసు నమోదైనా, ఇప్పటికీ అరెస్టు చేయకపోయినా .. నోరు మెదపక పోవడానికి కారణమేంటని కూటమి కార్యకర్తలు ప్రశ్నలు సంధిస్తున్నారు.తమ గోదాములో బియ్యం మాయమయ్యాయని పేర్ని నాని కుటుంబ సభ్యులు లేఖ ఇచ్చి 20 రోజులు అవుతున్నా.. వాస్తవంగా మాయమైన బియ్యం పరిమాణం ఎంతనేది ఇప్పటికి స్పష్టమైన లెక్కలు లేవు. తాజాగా సోమవారం అధికారులు గోదాము వద్దకు చేరుకోగా.. సంస్థ సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో న్యాయవాది సమక్షంలో పంచనామా చేసి.. తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లారు. బియ్యం నిల్వల వివరాలు సేకరిస్తున్నారు. అక్కడున్న వేబ్రిడ్జి పనిచేయడం లేదంటూ.. బియ్యాన్ని మరోచోట తూకం పెట్టించి తరలించే ప్రక్రియ ప్రారంభించారు.మాయమైన బియ్యం లెక్కలు.. అంచనాకంటే ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. తూకంలో తేడా కారణంగా తొలుత 3,200 బస్తాల బియ్యం తగ్గాయని తొలుత పేర్ని కుటుంబ సభ్యులు అధికారులకు లేఖ రాశారు. అధికారులు అక్కడకు వెళ్లి ఖాతా పుస్తకాలు పరిశీలించగా.. 3,708 బస్తాలు తగ్గాయని ప్రాథమికంగా అంచనా వేశారు. బియ్యాన్ని తరలించే సందర్భంగా పరిశీలించగా.. ఇప్పటికే చెప్పిన పరిమాణం కంటే మరింత భారీగా మాయమైనట్లు బయటపడుతోంది. అసలు గోదాము నుంచి రేషన్‌ బియ్యం ఎప్పుడు మాయమయ్యాయనే వివరాలు ఇప్పటికీ తేల్చలేదు.చౌక బియ్యం మాయమైన వ్యవహారంలో ఈ నెల 10న గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్‌ మానస్‌ తేజపై పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. దీనిపై 13న జయసుధ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున ప్రత్యేక పీపీని నియమించాల్సి ఉందని న్యాయవాదులు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఏపీపీనే ఇప్పటికీ కొనసాగించడం గమనార్హం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు జయసుధ విదేశాలకు వెళ్లకుండా లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేసినట్లు ఎస్పీ గంగాధరరావు పేర్కొన్నారు.బియ్యం మాయమైన ఘటనలో కేసు నమోదైన నాటి నుంచి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. జిల్లా వైసీపీ అధ్యక్షునిగా ఉన్న నాని, నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన తనయుడు కిట్టు పార్టీ కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన పోరుబాట కార్యక్రమంలోనూ కనిపించలేదు. మాయమైన బియ్యానికి జరిమానాగా రూ. 1.70 కోట్లు చెల్లించిన నేపథ్యంలో.. తాజాగా నాని సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. పెనాల్టీ కొట్టేయడంతో ఇక కేసు నుంచి బయట పడవచ్చన్న ధీమాతోనే ఆయన బయటకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Related Posts