విజయవాడ, అనంతపురం, డిసెంబర్ 21,
ఏపీ రాజకీయాలు ట్విస్ట్‌లతో ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కూటమి ప్రభుత్వం జగన్‌ను టార్గెట్ చేస్తూ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇటు పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ లక్ష్యంగా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఇంకోవైపు ముఖ్యనేతలంతా వైసీపీని వీడుతున్నారు. మొత్తానికి వైసీపీకి గడ్డు రోజులు నడుస్తున్నాయి అనుకునేలా ఉంది పొలిటికల్ సిచ్యువేషన్.. ఇలాంటి టైమ్‌లో వైఎస్ జగన్ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టబోతున్నారని సమాచారం. పార్టీని బలోపేతం చేసేందుకు, క్యాడర్‌లో జోష్ నింపేందుకు సరికొత్త వ్యూహంతో వస్తున్నారంట ఆయన.ఓ వైపు జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేస్తూనే.. మరోవైపు పొలిటికల్ గేమ్‌కు తెరతీశారు జగన్. పీసీసీ చీఫ్ సీటు నుంచి షర్మిలను తప్పించేందుకు జగన్ స్కెచ్ వేసినట్లు పొలిటికల్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది. బెంగళూరులో ఉంటూనే ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారట. కూటమి నేతలతో పాటు షర్మిల ప్రతీ సందర్భలోనూ జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో కూటమి నేతలతో పాటు షర్మిలకు కూడా చెక్ పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు.ఇప్పటికే షర్మిల నాయకత్వంపై కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. పార్టీ బలోపేతాన్ని గాలికి వదిలేసి.. కుటుంబ ఆస్తుల లొల్లినే పట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు బహింరంగానే చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై కాకుండా జగన్‌పై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫిర్యాదులు హైకమాండ్‌కు వెళ్లాయి. ఈ లొసుగును పట్టుకొని పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు స్కెచ్ వేశారనే గాసిప్ లోకల్‌గా షికారు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యులతో మంత్రాంగం ప్రారంభించారు.మరోవైపు ఖాళీ అవుతున్న వైసీపీకి బలం పెంచేలా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన తండ్రి వైఎస్సార్‌తో పని చేసి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న నేతలతో జగన్ టచ్‌లోకి వెళ్తున్నారట. అందులో భాగంగానే కర్నూలులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్‌ను జగన్ కలిశారట. ఆయనతో పాటు 8 మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరంతా కూటమిలోకి వెళ్లడం ఇష్టం లేక, షర్మిల నాయకత్వంలో పని చేయలేక అసంతృప్తిగా ఉన్నారట. ఇదే సమయంలో వాళ్లను జగన్ వైసీపీలోకి ఆహ్వానించడంతో ఆ నేతలు కాదనలేకపోయారని సమాచారం. మరి ఈ పరిణామాలు, జగన్ వ్యూహాలు షర్మిల రాజకీయానికి చెక్ పెడ్తాయా? వైసీపీకి కలిసొస్తుందా? అనేది ఇంట్రెస్టింగ్ చర్చగా మారింది.