న్యూఢిల్లీ, డిసెంబర్ 21,
కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ పరపతి పెరిగింది.ఈ ఇద్దరి మిత్రులతో దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయం చేయాలని భావిస్తున్నారు బిజెపి ఆగ్రనేతలు. అందుకు తగ్గట్టుగా ప్లాన్ రూపొందించారు.దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తుందా? చంద్రబాబు, పవన్ సేవలను వినియోగించుకోవాలని చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా జమిలి ఫీవర్ నడుస్తోంది. ఏకకాలంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నది వ్యూహం. అయితే ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ పరంగా సీట్లు పెంచుకోవాలని చూస్తోంది. దక్షిణాదిలో ఎన్డీఏ బలోపేతం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అనుసంధానంగా మరిన్ని సబ్ కమిటీలు పనిచేయనున్నాయి. వీటికి సమన్వయకర్తగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నియమించారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైతం కీలక బాధ్యతలు కట్టబెట్టారు.ఇందులో చంద్రబాబు వ్యూహాలు అమలు చేసే బాధ్యత తీసుకోగా.. పవన్ కళ్యాణ్ పై ప్రచార బాధ్యతలు పెట్టనున్నారు.ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి బలంగా ఉంది. అయితే మూడుసార్లు అధికారంలో ఉన్న నేపథ్యంలో వ్యతిరేకత సర్వసాధారణం. ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చిన వ్యతిరేకతను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలన్నది బిజెపి పెద్దల ప్లాన్. అందుకే దక్షిణాదిలో ఎన్డీఏ సీట్లు ఎలా పెంచుకోవాలనే అంశంపై ఇప్పటినుంచి కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు, ప్రజల మూడ్, అమలు చేయాల్సిన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో పాటుగా రాజకీయ వ్యూహాలను సూచించనుంది. ఈ కమిటీ సమన్వయకర్తగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బాధ్యతలు అప్పగించారు. కాగా ఈ కమిటీలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడులను నియమించారు.అయితే ఆ ముగ్గురు కేంద్ర మంత్రులతో ఏర్పడిన కమిటీకి.. అనుసంధానంగా సబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు సభ్యులుగా ఉండనున్నారు. వీరు స్థానికంగా ఉన్న అంశాలను కమిటీకి వివరించి.. బలోపేతానికి కావాల్సిన సూచనలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. రానున్న మూడేళ్ల కాలంలో ఎన్డీఏ ను దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే ఈ కమిటీల లక్ష్యం. అయితే బిజెపి పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కీలక బాధ్యతలు పెట్టారు. ఈ కమిటీ నిత్యం చంద్రబాబుకు టచ్ లో ఉంటుంది. చంద్రబాబు వ్యూహాల మేరకు ఈ కమిటీ పని చేస్తుంది. అదేవిధంగా తన ఇమేజ్ తో ఎన్డీఏ కోసం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ మిషన్ సక్సెస్ ఫుల్ గా అమలు చేసేందుకు బిజెపి పెద్దలు పెద్ద ప్లాన్ తోనే ఉన్నారు. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.