YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు

నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు

హైదరాబాద్, డిసెంబర్ 23, 
సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్  తనయుడు దేవాన్ష్  చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వేగంగా పావులు కదపడంలో అరుదైన రికార్డు సృష్టించారు. 'వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్' వరల్డ్ రికార్డు కైవసం చేసుకొని.. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో దేవాన్ష్ 'చెక్‌మేట్ మారథాన్' పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ రికార్డ్‌లో క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్స్ క్రమాన్ని పరిష్కరించారు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5,334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్ ఈ రికార్డును సాధించగలిగారు. ఇదిలా ఉండగా ఇటీవల దేవాన్ష్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 నిమిషాల్లో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు, మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగి ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్‌పోజర్, మార్గదర్శకత్వంతో మన పిల్లలు ఉన్నతస్థానానికి చేరుతారనడానికి దేవాన్ష్ నిదర్శనమని పలువురు నిపుణులు కొనియాడారు. కుమారుడు ఈ ఘనత సాధించడం పట్ల మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. దేవాన్ష్.. లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. 'దేవాన్ష్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. గత కొన్ని వారాలుగా ఈ ఈవెంట్ కోసం ప్రతి రోజూ 5 నుంచి 6 గంటలు శిక్షణ పొందాడు. దేవాన్ష్‌కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు' అని లోకేశ్ తెలిపారు. దేవాన్ష్‌పై కోచ్ కె.రాజశేఖర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే డైనమిక్ విద్యార్థి అని.. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ను ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతని సొంతమన్నారు. దేవాన్ష్ చెస్ ప్రయాణంలో ఇదో మైలురాయి అని కొనియాడారు.

Related Posts