విజయవాడ, డిసెంబర్ 23,
వైసీపీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వ్యవహారాల నుంచి కొంత పక్కకు తప్పుకున్నట్లే కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి విపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒకింత బ్యాక్ బెంచ్ కే పరిమితమయినట్లే కనపడుతుంది. అంతకు ముందు ఐదేళ్లపాటు అంశం ఏదైనా మీడియాకు చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చే వారు. సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనే వారు. జగన్ ఆదేశాలను అమలు చేసేందుకే తాను ఉన్నట్లు సజ్జల వ్యవహరించేవారు. అన్ని శాఖలు ఆయన గుప్పిట్లోనే ఉండేవి. మంత్రులు అనేక మంది ఉన్నప్పటికీ సకల శాఖ మంత్రిగా ఆయన చెలామణి అయ్యేవారు. హోంశాఖ నుంచి అన్ని శాఖలలో ఆయన చెప్పినట్లు జరగాల్సిందే. పోలీసుల బదిలీ నుంచి ఇతర ఉన్నతాధికారుల ట్రాన్స్ ఫర్ వరకూ ఆయన ఆదేశాలకు అనుగుణంగా చేయాల్సిందేవైసీపీ ఓటమి పాలు కాగానే… అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిపై నాటి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన అధినేతలు నేరుగా విమర్శలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే అప్పుడు చెబుతామని వార్నింగ్ లు కూడా ఇచ్చారు. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల సైలెంట్ అయ్యారు. జగన్ కూడా ఆయనకు పెద్దగా ప్రయారిటీ ఇస్తున్నట్లు కనిపించడం లేదు. సమావేశాలకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆయన అరుదుగా వస్తున్నారు. అదే సమయంలో ముఖ్య నేతల సమావేశాలకు కూడా సజ్జల కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సజ్జల కావాలనే దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కేసులకు భయపడి ఫోకస్ కాకూడదన్న భావనతోనే దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. నిజానికి ఆయనకు జగన్ వద్ద ప్రయారిటీ ఏమీ తగ్గలేదని, కానీ కేసుల విషయంలో కొంత తగ్గుతున్నారని అంటున్నారు. అందుకే సజ్జల కనిపించడం లేదంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి అలా తాను ఉన్నానంటూ కనిపించి వెళుతున్నారు. మీడియా ముందుకు వచ్చినా పెద్దగా మాట్లాడటం లేదు. ఇప్పుడు వైసీపీలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలకంగా మారారు. అన్ని సమావేశాల్లో ఆయనే కనిపిస్తున్నారు. జగన్ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా రాజకీయంగా అండగా ఉండేది విజయసాయిరెడ్డి. అందుకే జగన్ మరోసారి విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించారు. పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో విజయసాయిరెడ్డి భాగస్వామ్యులవుతున్నారు. మీడియా ముందుకు కూడా ఆయనే వస్తున్నారు. అధికార పార్టీపై విమర్శలు చేయాలన్నా విజయసాయిరెడ్డికే బాధ్యతలను జగన్ అప్పగించినట్లు చూసే వారికి ఎవరికైనా తెలుస్తుంది. దీంతో పాటు శాసనమండలిలో నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు కూడా జగన్ ప్రయారిటీ ఇస్తున్నట్లే కనపడుతుంది. అంబటిరాంబాాబు, పేర్ని నాని వంటి వారే తరచూ కనిపిస్తున్నారు. తప్పించి సజ్జల మాత్రం మీడియాముందుకు రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం జగన్ ఆదేశాలేనని అంటున్నారు. ఆయన వెనక ఉండి పార్టీ నిర్ణయాల్లో భాగస్వామి అయితే అవ్వవచ్చు కానినేరుగా మాత్రం కనిపించకుండా సజ్జల రామకృష్ణారెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ పై కేసులు నమోదయ్యాయి. సజ్జలపై కేసులు నమోదయినా ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించి కొంత వెసులుబాటును తెప్పించుకున్నారు. తాను తన కుటుంబం అధికార పార్టీ నేతలకు టార్గెట్ కాకూడదన్న కారణంతోనే సజ్జల సైలెంట్ గా ఉంటున్నారనది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసినా, కాకినాడ పోర్టు వ్యవహారమైనా, ఇంకొకటైనా దానిని ఖండించేందుకు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు రావడం లేదన్నదిపార్టీ నేతలే చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒంటిచేత్తో పార్టీని, నేతలను ఒక ఆటాడించిన సజ్జల ఇప్పుడు మాత్రం నేతలు చెప్పినట్లు తలాడించాల్సి రావడం విధిలిఖితమే. అదే రాజకీయాలంటే. అందుకే అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేనప్పుడు కానీఒకే విధంగా వ్యవహరిస్తే ఇప్పుడు ఈరకమైన సమస్యలు వచ్చేవి కావన్నది అందరూ చెప్పే వాస్తవం. మరి సజ్జల కావాలనిసైడ్ అయిపోయారా? సైడ్ చేశారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.