విజయవాడ, డిసెంబర్ 24,
మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ది పనులు పూర్తి చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సంకల్పించింది. రాజధాని అభివృద్దికి అయ్యే వ్యయ భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా వేయమని, అమరావతి భూములు అమ్మగా వచ్చే సొమ్మునే రుణాలు తీర్చేందుకు ఉపయోగిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.రాజధాని అమరావతి అభివృద్ది పనులకు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణ రాష్ట్ర రాజధాని అమరావతి జోన్7, 10 లే అవుట్ల రోడ్ల నిర్మాణ పనులను రూ.2,723 కోట్లతో చేపట్టేందుకు సీఆర్డీఏ ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్దికై ఇప్పటి వరకూ రూ.47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపడం జరిగిందన్నారు. మిగిలిన అభివృద్ది పనుల్లో కొన్నింటికి ఈ నెలాఖరు లోపు, మిగిలిన వాటికి వచ్చేనెలలోపు ఆమోదం తెల్పి, జనవరి15 లోగా అన్ని పనులకు టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.‘ ఏ దేశానికైనా, రాష్ట్రానికి కైనా ఒక రాజధాని తప్పని సరిగా ఉంటుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం జరిగింది. అమరావతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది పర్చేందుకు మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమరావతి అభివృద్దికి అయ్యే వ్యయ భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా వేయడం లేదు. పూలింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించిన భూములు అమ్మగా వచ్చే సొమ్ముతోనే అమరావతి అభివృద్దికై తీసుకున్న రుణాలు తీర్చేందుకు చర్యలు చేపడుతాం. ఈ విషయంలో ఎటువంట అపోహలకు తావులేదు. ఎవరు ఎటువంటి విమర్శలు చేసిన ప్రజలు నమ్మవద్దు. రాష్ట్రంలోని 26 జిల్లాల సమాన అభివృద్దికి 2014-19 మద్య కాలంలోనే తమ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకున్నాం.రాష్ట్ర పునర్విభజనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన పలు కేంద్ర సంస్థలను సమానంగా అన్ని జిల్లాలకు కేటాయించడం జరిగింది. విజయనగం జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని, విశాఖపట్నం జిల్లాకు ఐఐఎం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీని, కాకినాడకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్‌ను, తాడేపల్లిగూడెంకు నిట్‌ను, మంగళగిరికి ఎయిమ్స్‌ను, విజయవాడకు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, తిరుపతికి ఐఐటి, ఐజర్ లను, కర్నూలుకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, మ్యాన్యుప్రాక్చరింగ్ సంస్థను, అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీని కేటాయించడం జరిగిందిఇదే విధంగా విశాఖపట్నంలో టీసీఎస్, గూగూల్ వంటి సంస్థలతో పాటు గత ప్రభుత్వం తరమేసిన లూలూ గ్రూప్‌ను మళ్లీ వెనక్కు తీసుకొస్తున్నాం. కర్నూలులో 350 ఎకరాల్లో డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమ జిల్లాల్లో మ్యాన్యుప్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. అవకాశం ఉన్న చోటల్లా పోర్టులను అభివృద్ది పర్చేందుకు చర్యలు చేపడుతాం. పోర్టులు అభివృద్ది అయ్యే ప్రతి చోటా అమరావతి తరహాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా శాటిలైట్ సిటీలను అభివృద్ది పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని నారాయణ మీడియాకు వెల్లడించారు.‘ రాజధాని అమరావతిపై వైసీపీ నేతలకు ఇంకా కక్ష తీరలేదా? అమరావతిపై వైసీపీ నేతలు కక్ష కట్టారు. అందుకే ఐదేళ్లూ రాజధాని ఊసులేకుండానే పాలించారు. ఇంత త్వరగా అమరావతి అభివృద్ది పనులు చేపడతామని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా వైసీపీ నేతలు అసలే నమ్మలేదు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా రైతుల భాగస్వామ్యంతోనే రాజధాని నిర్మాణాలు చేపడుతున్నాం. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి వరద తాకిడి వచ్చినా తట్టుకునే స్థాయి నిర్మాణాలు చేపడుతున్నాం. కృష్ణా కరకట్టలను కట్టుదిట్టంగా నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షాలు, వరదలొచ్చినా తట్టుకుని నిలబడేలా రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నాం.ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి రూపుదిద్దుకోనుంది. ఐకానిక్ బిల్డింగ్స్‌తో హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్స్‌కు, ఎలక్ట్రానిక్ అండర్ గ్రౌండ్స్ నిర్మాణాలకు 47 వేల కోట్లకు పైగా పనులకు ఆమోదం లభించింది. రాజధాని నిర్మాణం, దాని నాణ్యతపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టుల ప్రక్షాళన ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో పర్యాటకంగా పోర్టులను, సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం’ అని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 12 కల్లా 1.18 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభిస్తాం. ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకుని నాన్ పెర్పార్మింగ్ అస్సెట్స్‌గా మిగిలి పోయిన టిడ్కో గృహాలను పూర్తి చేయడానికి రూ.102 కోట్లను చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 2014-19 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంచే 7,01,481 టిడ్కో గృహాలను మంజూరు చేయించి, వాటిలో 5.00 లక్షల గృహాలకు పరిపాలనాపరమైన అనుమతులను కూడా మంజూరు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. వాటిలో 4,54,706 గృహాలను గ్రౌండ్ చేయడం జరిగింది. ఇందులో 2019 నాటి 3,13,832 గృహా నిర్మాణాలను ప్రారంభించాం.ప్రతి యూనిట్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.3.90 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించాం. ఇందులో రూ.1.90 లక్షలు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలా నిర్ణయించడం జరిగింది. అదే విధంగా లబ్దిదారుని వాటాగా చెల్లించాల్సిన సొమ్మును బ్యాంకు రుణంగా ఇప్పించేందుకు చర్యలు చేపట్టాం. కానీ, ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియను అంతా గందరగోళమైంది. టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి నిర్మాణానికి చేపట్టిన 4,54,706 గృహాలలో కేవలం 2,61,640 గృహాలను మాత్రమే గత ప్రభుత్వం చేపట్టి మిగిలిన వాటిని రద్దు చేయడం జరిగింది. ఆ చేపట్టిన గృహాలను కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేదు.ఈ గృహాలలో దాదాపు 77 వేల గృహాలను మా ప్రభుత్వమే పూర్తి చేయడం జరిగింది. లబ్దిదారులకు మంజూరు చేసిన గృహాలపై గత ప్రభుత్వం బ్యాంకు రుణాలను తీసుకొని, ఆ సొమ్మును డైవర్ట్ చేసింది. ఫలితంగా ఆయా గృహాలు నాన్ పెర్పార్మింగ్ అసెట్స్‌గా మిగిలిపోయాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రూ.102 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్మును ప్రభుత్వం చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. వీటిలో దాదాపు 1.18 లక్షల గృహా నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ 12 కల్లా పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతాం’ అని మంత్రి నారాయణ వెల్లడించారు.ఆచార్య నాగార్జున వర్సిటీలో రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 123 మంది పురపాలక కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణాల కోసం ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదన్నారు. ‘ భవన నిర్మాణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. లేఅవుట్, భవనాలకు సంబంధించి మున్సిపాలిటీకి రుసుము చెల్లిస్తే అనుమతులన్నీ ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వరదనీరు, ఘనవ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై 15 రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించాం. పాతపన్ను బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోవాలి. నెల్లూరు, కాకినాడ, రాజమండ్రిలో ఘనవ్యర్థాల నిర్వహణకు అనుమతి వచ్చింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో చెత్త సమస్య పరిష్కారమవుతోంది’ అని మంత్రి తెలిపారు.బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్బంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. బీసీ హాస్టళ్లలో వసతుల కల్పన, బాలికల హాస్టళ్ల తక్షణ మరమ్మతులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరికొంత కసరత్తు తరువాత సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న హామీకి కట్టుబడి ఉన్నామని, దీనికి కూడా చట్టబద్ధత తెస్తామన్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపైనా సమీక్షించిన సీఎం బాలికల హాస్టళ్లు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సామాజిక పింఛన్ల తనిఖీ జరపాలని, అర్హులకే పింఛన్లు అందాలని చంద్రబాబు చెప్పారు.అర్హులకు అందరికీ పింఛన్లు, పథకాలు అందాలన్నది తమ ఉద్దేశమని, ఇదే సమయంలో అనర్హులకు ఫించన్లు ఇవ్వడం సరికాదన్నారు. పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని కొందరు పింఛన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై అర్హులైన వారు ఆందోళన పడాల్సిన పనిలేదని సీఎం భరోసా ఇచ్చారు.