YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

మారిపోతున్న రహదారులు

మారిపోతున్న రహదారులు

విజయవాడ, డిసెంబర్ 26, 
ఆంధ్రప్రదేశ్ లో రహదారులు అన్నీ అద్వాన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం రహదారులను పట్టించుకోలేదు. దీంతో రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సంక్రాంతి పండగ నాడు అక్కడకు వెళ్లిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఏపీ రహదారులపై ప్రయాణించడం కష్టమేనని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పటి మంత్రి కేటీఆర్ కూడా ఏపీ రహదారులపై సెటైర్లు వేశారు. తనకు ఆంధ్రకు వెళ్లివచ్చిన మిత్రుడొకరు చెప్పారని, ఏపీ రహదారులపై ప్రయాణించడం నరకమేనని అన్నారన్నారు. తెలంగాణలో రహదారులను చూసి గర్వంగా ఉందని కూడా కేటీఆర్ అన్నారు.. అప్పట్లో ఏపీలో రహదారుల పరిస్థితిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరిగింది. జనసేన అయితే ఏకంగా రహదారులపై గుంతలను పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఎవరేమనుకున్నా, రహదారులు బాగాలేకపోయినా సరే వాటికి నిధులు కేటాయించలేదు. అయితే గత ప్రభుత్వం అంటే 2014 లో ఏర్పాటయిన నాటి చంద్రబాబు సర్కార్ రహదారులను నిర్మించినా, అవి మూణ్ణాళ్లకే మరమ్మతులకు గురయ్యాయని కూడా వైసీపీ సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడానికి అద్వాన్నమైన రహదారులు కూడా ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. గుంతలతో కూడిన రహదారులపై ప్రయాణం భయానకంగా మారడంతో వాహనాలు కూడా మరమ్మతులకు తరచూ గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందుకోసం మరమ్మతులకు దాదాపు 850 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదలచేసింది. ప్రాధాన్యతా క్రమంలో రహదారుల మరమ్మతులను చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు సంక్రాంతి నాటికి రోడ్లు అద్దాల్లా మెరవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే ఎమ్మెల్యేలకు కూడా తమ నియోజకవర్గం పరిధిలో అద్వాన్నంగా రహదారులను బాగుచేయించుకునే బాధ్యతలను అప్పగించారు. సంక్రాంతికి ఏపీకి వచ్చేవారు ఎవరూ ఏపీ రహదారుల గురించి విమర్శించ కూడదని చంద్రబాబు ఎమ్మెల్యేలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయి... ఇప్పటికే అనేక రహదారులు మెరుగు పడ్డాయి. ముఖ్యమైన రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. అదే సమయంలో గిరిజన ప్రాంతాల్లో పల్లె పండగ కార్యక్రమం కింద రహదారుల నిర్మాణం చేపట్టడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. తర్వాత క్రమంగా కొన్ని ముఖ్యమైన రహదారులను పబ్లిక్, ప్రయివేట్, పార్ట్ నర్ షిప్ కింద ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ రహదారులపై ప్రయాణించే తప్పనిసరిగా టోల్ ఫీజు చెల్లించాల్సి రావడంతో ఇంకా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. అయితే నిధుల లేమి కారణంగా ఏపీలో రహదారులను పీపీపీ పద్ధతిలోనే అభివృద్ధి చేయాలన్న నిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. మొత్తం మీద సంక్రాంతికి వెళ్లేవారికి రహదారులు హ్యాపీ వెల్ కమ్ చెప్పడం గ్యారంటీ.
అయ్యా, రోడ్లు వేయండి.. గతుకుల రోడ్డుపై ‘డ్రోన్‌’ సందేశం
గ్రామాలలో రోడ్లు అధ్వాన్నంగా ఉంటే, నిరసనలు తెలియజేయడం పరిపాటి. సాధారణంగా రహదారిలో నిల్వ నీటిలో నాట్లు నాటడం, నీటిలో నిలబడడం ఒంటి కార్యక్రమాలతో నిరసనలు తెలియజేస్తుంటారు. కానీ ఇక్కడ వినూత్న రీతిలో రహదారి గుంతల మయంగా ఉందంటూ నిరసన తెలిపారు. అది కూడా ఎలాగో కాదు.. ఏకంగా డ్రోన్ కెమెరాతోనే నిరసన తెలిపారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.విజయనగరం జిల్లా వంగర మండలం కొండవలస గ్రామం నుండి భాగెమ్మపేట వరకు సుమారు 10 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు వెళ్లే రహదారి నిరంతరం గుంతలమయం కావడం విశేషం. 2010 నుండి ఇప్పటివరకు కూడా రహదారి గుంతల మాయం కావడంతో వాహనాదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రాత్రివేళ ఈ రహదారిలో ప్రయాణించాలంటే ఎన్నో ఇబ్బందులు తప్పవు.ఈ రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు పలుమార్లు ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా ఉన్నాయట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధ్వాన్నంగా ఉన్న రహదారులను మరమ్మత్తులు చేస్తున్న నేపథ్యంలో, తమ గ్రామ రహదారి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అక్కడ యువకులు భావించారు. అయితే వినూత్నంగా నిరసన తెలిపితే ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరిస్తుందన్న ధోరణితో యువకులు వినూత్నంగా తమ నిరసన తెలిపి, రహదారిని అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు.డ్రోన్ కెమెరాను ఉపయోగించి, నూతన రహదారి నిర్మించాలని కోరుతూ ఆ రహదారిలో ప్లకార్డును వారు ప్రదర్శించారు. గుంతల రోడ్డుతో తాము ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు రహదారి నిర్మించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద డ్రోన్ కెమెరాతో నిరసన తెలిపిన యువకుల వినూత్న నిరసనకు ప్రభుత్వం నుండి ఏ మేరకు స్పందన వస్తుందో వేచి చూడాలి

Related Posts