ఏలూరు, డిసెంబర్ 26,
సంక్రాంతి అంటేనే కోడిపందేలు… కోడి పందేలు అంటే సంక్రాంతి.. అలా వుంటుంది క్రేజ్.. ఏపీలో.. మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సంక్రాంతి హడావిడిగురించి ఎంత చెప్పినా తక్కువే.. పండగ మూడు రోజులు కోడిపందేల జోష్ ఇక్కడి ప్రజలను ఊపేస్తుంది..కోడిపందేల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. గోదావరి జిల్లాలకే ప్రత్యేకత తెచ్చిన కోడి పందేలకు కోళ్లు సిద్ధమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఇప్పటికే రైలు, బస్సు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకున్నారు. ఇక పందెం రాయుళ్లు హడావిడి కూడా పండుగ ముందు నుంచే మొదలైంది మరో రెండువారాలు దాటితే….కోడిపుంజులను కొనేందుకు ఎగబడతారు పందెం రాయుళ్లు. కండబట్టి పందేనికి సిద్ధంగా ఉన్న ఒక్కో కోడి పుంజు ధర 50 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు పలుకుతోంది.నాటు కోడి పుంజు మాంసం కిలోవెయ్యి నుంచి పదిహేను వందల రూపాలయవరకు ఉంటుంది. అదే పందెం కోడి పోషణ కోసమే 25వేల రూపాయలు వరకు ఖర్చుచేస్తారు. గోదావరి జిల్లాలో పందెం కోళ్ల పెంపకం ఒక కుటీర పరిశ్రమలా సాగుతుంది. పామాయిల్ తోటల్లో షెడ్లు నిర్మించి పందెం కోళ్లను పెంచుతారు. ఒక్కో తోటలో నాలుగు వందల పుంజుల వరకు ఉంటాయి. పందేల్లో గెలిచిన పుంజులను ప్రత్యేకంగా చూస్తారు. వాటిని కోడి పెట్టలతో కలిసేలా చేస్తారు. కోడి గుడ్లు పెట్టడంనుంచి వాటిని పొదిగి పిల్లలయ్యేలా చేస్తారు. పిల్ల దశ నుంచే ఒక్కో పుంజుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఆరు నెలలు మొదలు ఏడాది వరకు వాటిని గుంపులోనే ఉంచుతారు. వాటిలో పోరాడే నైజం వచ్చే వరకు స్వేచ్ఛ గా వదిలేస్తారు. తర్వాత వాటిని గాబుల్లోకి మారుస్తారు. ఇలా వీటిని మరో 5 నెలల పాటు ఉంచి బలవర్ధకమైన ఆహారం, పోషణ అందించి వాటితో వ్యాయామం చేయించి కండను పెంచుతారు.తిండి కలిగితే కండ కలదు.. కండ ఉన్నదే పందేనికి సిద్ధం…. ఈ పందెం కోళ్ల కండలను పెంచడానిక వాటికి పెట్టే మేతను చూస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే.. బాదంపప్పు, పిస్తా, అంజీర్, తేనె, మటన్ కైమా, విటమిన్ టాబ్లెట్స్, ఇంజెక్షన్లు ఇలా ఈ మెనూ చాంతాడంత ఉంటుంది. కోడి పుంజులు అనారోగ్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు పరీక్షించి నాణ్యమైన మెడిసిన్స్ అందిస్తారు. పందేల్లో పాల్గొనే కోడి పుంజుల ఈకల రంగును బట్టి దాని జాతిని నిర్ణయిస్తారు. కాకి, సేతు, పర్ల, కొక్కిరాయి. డేగ, నెమలి, కౌజు, పూల, నల్లబోర ఇలా కోడిపుంజుల్లో చాలా రకాలున్నాయికోడిపుంజుల పెంపకంలో మొదటి ప్రక్రియ నీటిలో ఈత కొట్టించడం ఒకటైతే.. తర్వాత సాక చాలా కీలకమైంది… సాక అంటే కొన్ని ఆయుర్వేద వనమూలకలతో తయారైన ఆయిల్, ఆకులను వేడి నీటిలో మరిగించి ఆ నీటితో కోడికి మసాజ్ చేస్తారు .. దీనివల్ల కోడిపుంజు చాలా రిలాక్స్‌డ్‌గా ఫీల్ కావడమేకాక బలిష్ఠంగా తయారవుతుందంటున్నారు నిర్వాహకులు. పండగకు నాలుగు నెలల ముందునుంచే పందెం కోళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు వీటి పెంపకం దారులు.. పండగ నాటికి కోడిని అన్నిరకాలుగా తీర్చిదిద్దుతారు.ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతికి 200 నుంచి 500 వరకు పందెం బరులు సిద్ధమవుతాయి.. ఉమ్మడి గోదావరి జిల్లాలో రాజమండ్రి కాకినాడ రాజానగరం, కాట్రేనుకోన అమలాపురం రాజోలు, రావులపాలెం కొత్తపేట , అంబాజీపేట, మలికిపురం, పలు ప్రాంతాల్లో కోడిపందాల బెట్టింగ్ లక్షల్లో కొనసాగుతుంది.. ఈ పందేలను తిలకించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరవుతుంటారు…వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా పందెం రాయుళ్లు చేస్తారు.. బరిని బట్టి రూ.1 లక్ష నుంచి 25 లక్షల వరకు ఒక్కో కోడి పందెం జరుగుతుంది.ఏ పుంజుపై పందెం కాయాలన్న విషయం నిర్ణయించుకోవడానికి కోడి కండను చూడటమేకాక, కోడి జ్యోతిష్యంపై కూడా ఆధారపడుతున్నారు పందెం రాయుళ్లు. మనుషులకు ఒక శాస్త్రం ఉన్నట్లే కోళ్లకు కూడా కుక్కుట శాస్త్రం అందుబాటులో ఉంది. చాలామంది పందెం రాయుళ్లు కుక్కుట శాస్త్రాన్ని అనుసరించే పందేలు కాస్తారు. ఏ జాములో ఏ రంగు పుంజుపై పందెం వేస్తే గెలుస్తుందో కుక్కుట శాస్త్రంలో ఉందనీ చెప్తున్నారు పెంపకం దారులు. తమ జాతక బలానికి, కోడి జాతక బలం తోడైతే ఇక విజయం తమదేనని నమ్ముతున్నారు పందెం రాయుళ్లు.పందేల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో చూడాలి మరి.