YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్

 ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్

విశాఖపట్టణం, డిసెంబర్ 26, 
కేంద్ర ప్ర‌భుత్వం విశాఖ‌ప‌ట్నం స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్‌-ఆర్ఐఎన్ఎల్‌)ను ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెల‌ప‌డంతో చ‌ర్య‌ల‌కు పూనుకుంటుంది. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌లోని ఒక్కో భాగం ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు సిద్ధ‌ప‌డింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని వంద శాతం పెట్టుబడుల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి కేంద్ర ప్రక‌ట‌న వెలువ‌డిన త‌రువాత ఒక్కొక్క చ‌ర్య‌లు చేప‌ట్టింది.ఇప్ప‌టికే దాదాపు 2,000 మంది ఉద్యోగుల‌ను ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని నాగర్‌న‌ర్ స్టీల్‌ప్లాంట్‌కు పంప‌డానికి సిద్ధ‌ప‌డింది. అలాగే 4,200 మంది స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ వ‌ర్క‌ర్స్‌ను తొలగించేందుకు వారికి ఎంట్రీ, ఎగ్జిట్ పాస్‌ల‌ను ఇవ్వ‌కుండా కుట్ర‌లు చేసింది. కార్మికులు పోరాటంతో యాజ‌మాన్యం వెన‌క్కి త‌గ్గింది. అలాగే బ్లాస్ ఫర్నేస్‌ను నిలిపివేసింది. ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను నిలిపివేసింది. మ‌ళ్లీ కార్మికుల ఆందోళ‌న‌తో వెన‌క్కి త‌గ్గింది. ఇలాంటి కుట్ర‌ల‌తో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉత్ప‌త్తిపై ప్ర‌భావం చూపే విధంగా యాజ‌మాన్యం, కేంద్ర ప్ర‌భుత్వం చర్య‌ల‌కు పూనుకున్నాయి.తాజాగా స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఒక యూనిట్‌ను ప్రైవేటీక‌ర‌ణ‌కు రంగం సిద్ధం చేసింది. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఫైర్ స్టేష‌న్ న‌డిపే బాధ్య‌త‌ను ప్రైవేట్ సంస్థ‌ల‌కు అప్ప‌గించేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబందించి వైజాగ్ స్టీల్ యాజ‌మాన్యం ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్ర‌స్ట్ (ఈవోఐ)కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఆర్ఎంహెచ్‌పీ, సింట‌ర్ ప్లాంట్‌, కోక్ ఓవెన్స్‌, స్టీల్‌మెల్ట్ షాప్‌, బ్లాస్ట్‌ఫ‌ర్నేస్, రోలింగ్ మిల్స్‌, ఎయిర్ సెప‌రేష‌న్ ప్లాంట్‌, సీఆర్ఎంపీ, థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌, ఎల్‌పీజీ స్టోరేజ్ ట్యాంక్‌లు, వాట‌ర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌, గ్యాస్ హోల్డ‌ర్లు, ఎన‌ర్జీ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌, స్టీల్‌ప్లాంట్‌లోని ఎల‌క్ట్రిక‌ల్ డిస్ట్రిబ్యూష‌న్ నెట్‌వ‌ర్క్ త‌దిత‌ర కీల‌క‌మైన విభాగాల్లో ఫైర్ స్టేష‌న్ సేవ‌లు అందిస్తుంది.అదే విధంగా అడ్మినిస్ట్రేష‌న్ భ‌వ‌నం, హాస్పిటాలిటీ స‌ర్వీసెస్‌, హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌, ఎల్ అండ్ డీసీ, టౌన్‌షిప్‌, పాఠ‌శాల‌లు, బ్యాంకులు, పోస్టాఫీస్‌, ప‌బ్లిక్ బిల్డింగ్‌లలో జ‌రిగే అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇప్పుడు ఆయా కీల‌క విభాగాల్లో అగ్నిమాప‌క సేవ‌లు అందించ‌డానికి, ఆయా ప్రాంతాల్లో అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌కు ఆస‌క్తి ఉన్న‌వారు సంప్ర‌దించాలని నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఈ ఫైర్ స్టేష‌న్‌ను వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని సీఐఎస్ఎఫ్ నిర్వ‌హిస్తోంది. 40 ఏళ్ల‌గా సేవ‌లందిస్తున్న సీఐఎస్ఎఫ్‌ను తొల‌గించి, ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ‌ను ఏర్పాటు చేయ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య అని స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియ‌న్ (సీఐటీయూ) గౌర‌వాధ్య‌క్షులు జె.అయోధ్య‌రామ్ విమ‌ర్శించారు. యాజ‌మ‌న్యం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ దారుణ‌మైన‌ద‌ని పేర్కొన్నారు.వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ కానివ్వ‌మ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాగ్ధానం చేశారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క‌టి ప్రైవేట్ ప‌రం అవుతుంటే క‌నీసం స్పందించ‌టం లేదు. మ‌రోవైపు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. కానీ ఆయ‌న కూడా మౌనం దాల్చ‌డంపై స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీ భ‌ర‌త్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై స్పందించ‌టం లేదు. అలాగే ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు కోరిన కె.రామ్మోహ‌న్ నాయుడు, కేంద్ర మంత్రి అయిన త‌రువాత, స్టీల్‌ప్లాంట్ గురించి క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదని కార్మికులు విమ‌ర్శిస్తున్నారు.

Related Posts