YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వారసుడి కోసం బొత్స ప్రయత్నాలు...

వారసుడి కోసం బొత్స ప్రయత్నాలు...

విజయనగరం, డిసెంబర్ 26, 
బొత్స సత్యనారాయణ .. ప్రస్తుత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 1999 నుండి 2024.. అంటే రెండున్నర దశాబ్దాల నుండి ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నేత . రాజకీయంగా కాంగ్రెస్‌లో పుట్టి ప్రస్తుతం వైసీపీలో కూడా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్‌కు దక్కని హోదాను దక్కించుకున్నారంటే బొత్స రాజకీయ చాతుర్యం అర్థం అవుతుంది. 1999లో బొబ్బిలి ఎంపీగా కాంగ్రెస్‌లో తన ప్రస్థానం మొదలుపట్టిన బొత్స విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పెద్ద దిక్కుగా మారడమే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు.అంతే కాదు భార్య బొత్స ఝాన్సీ నుండి తమ్ముళ్ళు , మేనల్లుడు అందరినీ రాజకీయాల్లోకి తీసుకువచ్చి నచ్చిన పదవులను కట్టబెట్టేలా అటు రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు తనదైన స్టైల్లో ఒప్పించారు . లిక్కర్ కింగ్ , వోక్స్ వేగన్ , భూ మాఫియా , ఉద్యోగాల అమ్మకం అంటూ ఎన్ని అవినీతి ఆరోపణలొచ్చినా వాటితో తనకేం సంబంధం లేదన్నట్లు తనదైన స్టైల్లో రాజకీయం చేస్తుంటారాయన . ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒకానొక దశలో టీడీపీ నేత అశోక్ గజపతిరాజును మించి రాజకీయం చేశారనడంలో ఎలాంటి సందేహం లేధు . కాపు నాయకుడిగా కాంగ్రెస్ హయాంలో తనదైన మార్క్ వేసుకున్నారు.వైసీపీలో జాయిన్ అయిన తరువాత మాత్రం సత్తిబాబు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది . వైఎస్ దగ్గర ఉన్న పవర్ జగన్ వద్ద సంపాదించలేక పోయారంటారు రాజకీయ విశ్లేషకులు . సత్తిబాబు లాంటి సీనియర్‌ను పక్కనబెట్టి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను అప్పజెప్పడం 2024 లో వైసీపీకి పెద్ద మైనస్‌గా మారిందంటారు . ఆఖరికి సత్తిబాబు సతీమణి ఝాన్సీని విశాఖ ఎంపీ స్థానంలో బలవంతంగా బరిలోకి దింపిన వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.ఆ తరువాత విశాఖ నుండి బొత్సను ఎమ్మెల్సీ చేయడం, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడం లాంటివి చకచకా జరిగిపోయాయి. అయితే ఇపుడు ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారట సత్తిబాబు . అసలే రాజకీయాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ఘనపాటిగా పేరున్న సత్తిబాబు ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తో రెండు జిల్లాలో బరిలోకి దిగాలని చూస్తున్నారట . దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ అపుడే స్టార్ట్ చేశారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.నిజానికి గత ఎన్నికల్లో ఆయన పక్కకి తప్పుకొని తనయుడు సందీప్‌ని చీపురుపల్లి నుండి బరిలోకి దించాలని యత్నించారు . వాని జగన్ ససేమిరా అనడంతో మరోసారి బొత్స బరిలో దిగారు . విశాఖ ఎంపీగా ఆయన భార్య ఝాన్సీ , విజయనగరం జిల్లాలో సోదరులు బద్దుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్యలతో పాటు తాను కూడా ఘోర పరాజయం చవిచూశారు . అయితే ఈసారి ఎలా అయినా కొడుకు సందీప్‌తో రంగ ప్రవేశం చేయించి తాను విశాఖ నుండి రాజకీయాలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారట. ఆ రెండు జిల్లాలు తన కనుసన్నల్లో ఉండేట్లుగా ప్లాన్ చేస్తున్నారట . అందుకే సొంత జిల్లా విజయనగరానికి చుట్టం చూపుకి వచ్చిపోతూ ఫోకస్ అంతా వైజాగ్‌పై పెడుతున్నారంట.కిమిడి ఫ్యామిలీకి పోటీగా ఇప్పటినుండే చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా కొడుకు సందీప్‌కి అప్పగించే యోచనలో ఉన్నారట . గతంలో మేనల్లుడు చిన్న శ్రీను ఈ నియోజకవర్గానికి బొత్సకి బదులుగా గార్డియన్‌గా ఉండేవారు . విజయనగరం జడ్పీ చైర్మన్ అయిన చిన్నశ్రీను ఇప్పుడు సొంత లెక్కలతో బొత్సకు దూరం జరిగారు. ఆ క్రమంలో చీపురుపల్లి బాధ్యతలు సందీప్ కి అప్పగించేసి ఇప్పటి నుండే 2029 ఎన్నికలకు సిద్దమయ్యేలా ప్రిపేర్ చేస్తున్నారట . సందీప్‌కి చెందిన ధీరా ఫౌండేషన్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమలు చేస్తున్నప్పటికీ , ఆయన మాత్రం ప్రస్తుతానికి సమయం కేటాయించడం లేదు.ఇక నుండి అలా కాకుండా నియోజకవర్గంపై ఫోకస్ చేయాలని తనయుడుకి సూచిస్తున్నారట బొత్స. ముఖ్యంగా విశాఖ ఆర్ధిక రాజధానిగా దినదినాభివృద్ధి చెందడం, తన వ్యాపారాలన్నీ ఎక్కువగా ఇక్కడే ఉండడం , అక్కడ వైసీపీకి సరైన నాయకుడు కూడా లేకపోవడాన్ని అదనుగా చేసుకుంటున్న బొత్స విశాఖలో జెండా పాతడానికి గ్రౌండ్‌వర్క్ చేసుకుంటున్నారంట . గత ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి , విజయసాయిరెడ్డిల పెత్తనంతో ఉత్తరాంధ్రలో వైసీపీ చతికిల పడింది. అది కూడా బొత్సకి కలిసివచ్చే మరో అంశంగా కనిపిస్తుంది . ఇదే అదనుగా విశాఖలో పాతుకుపోవడానికి బొత్సకి సరైన అవకాశం దొరికిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి . చూడాలి మరి బొత్స ప్లాన్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో?

Related Posts