నల్గోండ, డిసెంబర్ 26,
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఓ బ్రాండ్. స్వపక్షంలో విపక్షంలా సొంత పార్టీ పైనే పోరాటాలు.. అనుకున్నది సాధించే మొండిపట్టు బ్రదర్స్ సొంతం. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి.. సార్వత్రిక ఎన్నికల సమయంలో మళ్లీ సొంతగూటికి వచ్చారు. ఆ టైమ్‌లో క్యాబినెట్‌లో చోటు ఇస్తామని అధిష్టానం నుంచి హామీ వచ్చిందని కోమటిరెడ్డి అనుచరులు ఎప్పటి నుంచో చెబుతున్న మాట. ఇక అప్పటి నుంచి పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఎంతో చురుగ్గా పని చేశారు.మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ చేతికి తెలంగాణ అధికార పగ్గాలు వచ్చేశాయి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా కొలువుదీరారు. ఇటు రాజగోపాల్ రెడ్డికి కూడా బెర్త్ కన్ఫామ్ అవుతుందంటూ రాజగోపాల్ రెడ్డి అనుచరులు, అభిమానులు భావించారు. కానీ రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్‌లో బెర్త్ దక్కలేదు. దీంతో ఆయన స్పీడ్ తగ్గించారని కాంగ్రెస్ పార్టీలో ఇన్నర్ టాక్ మొదలైంది. కొంతకాలంగా ఆయన మౌనంగా ఉండడంతో ఇదే నిజమనే భావనను క్యాడర్ బలంగా నమ్ముతుంది. పార్టీ కార్యక్రమాలకు సైతం రాజగోపాల్ దూరంగా ఉంటున్నారనే టాక్ లోకల్‌గా బిగ్ సౌండ్ చేస్తోంది.ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా.. రాజగోపాల్ రెడ్డి దూరంగానే ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన యాత్ర చేపట్టారు. ఆ యాత్రలో కూడా రాజగోపాల్ రెడ్డి కనిపించలేదు. రేవంత్ వచ్చిన టైమ్‌లో రాజగోపాల్ రెడ్డి విదేశాల్లో ఉన్నారని.. అందుకే రాలేదని ఆయన అనుచరులు సమాధానమిచ్చారు.మొన్న జరిగిన ప్రజా పాలన విజయోత్సవాలకు కూడా రాజగోపాల్ రెడ్డి రాం రాం చెప్పేశారు. ఆ బహిరంగసభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా.. అటు వైపు రాజగోపాల్ రెడ్డి కన్నెత్తి కూడా చూడలేదట. తమ స్వగ్రామం నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో రాజగోపాల్ రెడ్డి కాసేపు కనిపించారు తప్ప.. మళ్లీ సీఎం పర్యటనలో ఎక్కడా దర్శనమివ్వలేదని లోకల్ టాక్.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి పదవిపై రాజగోపాల్‌కి హామీ ఇచ్చారనే గాసిప్ లోకల్ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతను రాజగోపాల్ రెడ్డికి అప్పగించి.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని జోరుగా ప్రచారం జరిగింది. తీరా తీసుకున్న టాస్క్‌ని రాజగోపాల్ సక్సెస్ చేసినా కూడా సీఎం హామీ కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన అలిగారని తెలుస్తోంది.నిజానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అర్హతలు ఉన్నా.. ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నా ఎందుకు కార్యరూపం దాల్చడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి వల్లే రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ బెర్త్ లేటవుతోందని లోకల్ టాక్. ఆ మంత్రి వల్లే మంత్రివర్గ విస్తరణ కూడా లేట్ అవుతుందని పార్టీ ఇన్‌సైడ్ వాయిస్. అయితే మంత్రిపదవి వచ్చేవరకు పార్టీకి దూరంగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారట. హామీ నిలబెట్టుకోకుంటే పార్టీపై పోరాటానికి కూడా వెనుకాడేది లేదని రాజగోపాల్ తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం.ఇదిలా ఉంటే రాజగోపాల్‌రెడ్డి మంత్రి పీఠానికి కొన్ని సమీకరణాలు కూడా అడ్డొస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. సామాజికవర్గం కోటా మించిపోతుందట. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కష్టమేనని గాంధీభవన్ వర్గాల కథనం.అయితే, మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి బెట్టు దిగడం లేదు. ఇటు అధిష్టానం కూడా మంత్రివర్గ విస్తరణపై ఎటూ తేల్చడం లేదు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగి.. అందులో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కకపోతే ఎలాంటి ఉత్పాతాలు ఎదురౌతాయోనని ఉత్కంఠ రేగుతోంది.