YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్ణాటకలో అలా... విశాఖలో ఇలా

కర్ణాటకలో అలా... విశాఖలో ఇలా

విశాఖపట్టణం, డిసెంబర్ 28,
ప్ర‌జ‌ల పోరాటానికి, వారి సెంటిమెంట్‌కు భిన్నంగా కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో న‌ష్టాల్లో ఉన్న క‌ర్ణాట‌క‌లోని స్టీల్‌ప్లాంట్‌కు రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. వైజాగ్ స్టీల్‌ప్లాట్ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వ వివ‌క్ష ప‌ట్ల‌ అధికార టీడీపీ, జ‌న‌సేన‌ క‌నీసం స్పందించ‌టం లేదు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల వైఖ‌రిపై కార్మిక సంఘాలు మండిప‌డుతున్నాయి.కర్ణాటకలోని భద్రావతిలో ఉన్న చారిత్రాత్మకమైన సర్ ఎం. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు.. కేంద్ర‌ ప్రభుత్వం రూ.15,000 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్రణాళికలను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ధ్రువీకరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక, ఉపాధి వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయ‌న వ్యాఖ్యానించారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం ఎటువంటి పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. పైగా ప్లాంట్‌ను మ‌రింత న‌ష్టాల్లో కూరుకుపోయే విధంగా చేసేందుకు ఒక్కో విభాగంగాన్ని ప్రైవేటీక‌రిస్తున్నారు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రైవేటీక‌ర‌ణ కానివ్వ‌బోమ‌ని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సీఎం చంద్ర‌బాబు ఆఫ్ ది రికార్డు పేరుతో మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతున్న సంద‌ర్భంలో.. న‌ష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తామ‌ని అంటున్నారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే ఏకంగా మాట్లాడ‌టమే మానేశారు. ప‌క్క రాష్ట్రంలో న‌ష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ప్ప‌డు, రాష్ట్రంలోని స్టీల్‌ప్లాంట్‌కు ఎటువంటి ఆర్థిక సాయం చేయ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం మొండిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కానీ రాష్ట్రంలోని అధికార టీడీపీ, జ‌న‌సేన మాత్రం క‌నీసం మాట్లాడం లేదు. కేంద్రంలో మంత్రి ప‌దువులు తీసుకున్న టీడీపీ ఎందుకంత అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తోందో తెలియ‌డం లేదు. వైజాగ్ ఎంపీ భ‌ర‌త్ కానీ, గ‌తంలో స్టీల్‌ప్లాంట్ గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కానీ క‌నీసం స్పందించ‌టం లేదు.ఇప్పుడు మ‌రోకొత్త స్టీల్‌ప్లాట్‌ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్ర‌భుత్వ రంగ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడేందుకు సిద్ధ‌ప‌డిన చంద్ర‌బాబు, ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఖ‌నిజం ఇవ్వాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని కోరుతున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు స‌మీపంలో అన‌కాప‌ల్లిలో న‌క్క‌ప‌ల్లిలో ఏర్పాటు కానున్న ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్‌ ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తరఫున మ‌ద్ద‌తు ఇస్తున్నారు. అంటే దీన్ని బూచిగా చూపించి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ఖతం చేయాల‌ని చూస్తున్నారని కార్మిక సంఘాల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.వాస్త‌వానికి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు ద‌గ్గ‌ర స్టీల్‌ప్లాంట్ పెట్ట‌డం శ్రేయ‌స్కారం కాదు. ఎందుకంటే ఇప్ప‌టికే ఒక భారీ స్టీల్‌ప్లాంట్ అక్క‌డ ఉంది. దీనివ‌ల్ల కొత్త‌గా పెట్టే స్టీల్‌ప్లాంట్‌కు లాభం రాదు. ప్ర‌భుత్వ రంగ స్టీల్‌ప్లాంట్‌కు స‌మీపంలో ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్ పెట్టేందుకు ముందుకు రావ‌డం, అందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలోనే వారి ఉద్దేశ్యం స్ప‌ష్టం అవుతోంద‌ని కార్మిక సంఘాల నేత న‌ర్సింగ్ రావు వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ రంగ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేయ‌డంలోని భాగ‌మే ఈ ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్‌కు మ‌ద్దుతు ఇవ్వ‌డ‌మ‌ని పేర్కొన్నారు.వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఖ‌నిజం కేటాయించాల‌ని, ముడి ఖనిజం లేక‌పోవ‌డంతోనే అక్క‌డ ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌టం లేద‌ని విమ‌ర్శించారు. కానీ ఇంకా ఏర్పాటే కాని ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం ముడి ఖ‌నిజం ఇవ్వాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏకంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని కోరుతున్నార‌ని అన్నారు.ఇటీవ‌లి ప్ర‌ధానిని క‌లిసిన సీఎం చంద్ర‌బాబు.. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు అవసరమైన ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చేడాలని ప్రధానిని కోరారు. దీంతో పాటు ఈ సంస్థ ఏర్పాటుకు వివిధ శాఖలకు సంబంధించి అనుమతులు త్వరితగతిన వచ్చేలా చూడాలని విన్నవించారు. సాంకేతిక ఇబ్బందులు తొలగితే ప్రాజెక్టు వేగంగా పట్టాలు ఎక్కుతుందని, దీనికోసం సహకరించాని సీఎం కోరారుకానీ ప్ర‌ధాని మోదీ వద్ద సీఎం చంద్ర‌బాబు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ గురించి క‌నీసం మాట్లాడ లేదు. దీనిపై కార్మిక సంఘాలు మండిప‌డుతున్నాయి. వైజాగ్ లాంటి ప్రాంతాల్లో సీఐటీయూ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు కూడా జ‌రిగాయి. చంద్ర‌బాబు వైఖ‌రి మోసపూరితంగా ఉంద‌ని సీఐటీయూ నేత‌లు విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ముందు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కాపాడేందుకు హామీ ఇచ్చార‌ని, ఇప్పుడు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ గురించి కాకుండా, ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్ గురించి ప్ర‌ధాని వ‌ద్ద డిమాండ్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

Related Posts