YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కేబినెట్ విస్తరణ.. ?

ఏపీలో కేబినెట్ విస్తరణ.. ?

విజయవాడ, డిసెంబర్ 28, 
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. జనవరి ఎనిమిదో తేదీన ఈ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ నుంచి కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించడమే కాకుండా జనసేన నేత నాగబాబును కేబినెట్ లోకి చేర్చుకోవడం కూడా ఆరోజే జరుగుతుందని చెబుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి గ్యారంటీ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్పష్టం చేశారు. ఐదు నెలల తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి నాగబాబుకు ఇవ్వడం కూడా దాదాపుగా ఖాయమైంది. అయితే నాగబాబు కేబినెట్ లో చేరిక వార్త చంద్రబాబు చెప్పి పక్షం రోజులు దాటుతున్నా ఇంకా ఆయన కేబినెట్ లో చేరలేదు.నాగబాబుతో పాటు మరికొందరిని మంత్రివర్గంలోకి చేర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం కేబినెట్ లో 25 మంది ఉన్నప్పటికీ నలుగురైదుగురు ప్రస్తుత మంత్రి వర్గ సభ్యుల విషయంలో చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించకుంటూ వారికి మార్కులను కూడా చంద్రబాబు కేటాయిస్తున్నారు. అట్టడుగున ఉన్న నలుగురిని మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలిసింది. మంచి మార్కులు పొందిన వారిలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, అనిత, నారాయణ, గొట్టిపాటి రవికుమార్ వంటి వారు ఉన్నారు. అయితే మిగిలిన వారిలో మరీ వీక్ గా నలుగురు ఉన్నట్లు చెబుతున్నారు.2024లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు ఈసారి సీనియర్ నేతలను పక్కన పెట్టారు. తొలిసారి గెలిచినా వారికి మంత్రి పదవులను కట్టబెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తన మంత్రి వర్గంలో తొలి సారి గెలిచిన వారికి మంత్రిపదవులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే సీనియర్లు కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ కక్కలేక, మింగలేక కొందరు నేతలు తమ అసంతృప్తిని అలాగే అణిచిపెట్టుకుని ఉన్నారు. సామాజికవర్గం పరంగా కూడా లెక్కలు వేసి మరీ చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే కొందరు చంద్రబాబు అంచనాలకు అందుకోలేని విధంగా మంత్రులు పనితీరు ఉంది. అంతేకాకుండా వారి వల్ల పార్టీలో లేనిపోని తలనొప్పులు వస్తుండటం కూడా ఏరివేతకు కారణం అని చెబుతున్నారు.జిల్లాల్లో నేతలను సమన్వయం చేసుకోలేకపోవడంతో పాటు తమకు కేటాయించిన శాఖలపై పట్టు సంపాదించకపోవడంతో పాటు అధికార యంత్రాంగం పై కూడా గ్రిప్ లేకపోవడం కూడా చంద్రబాబు మంత్రులను తీసివేయడానికి కారణమని చెబుతున్నారు. కీలకమైన శాఖలను నమ్మి అప్పగించినా వారి పనితీరు సరిగా లేకపోవడంతో విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తుందని కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఏడాది కూడా గడవకముందే పనితీరును ఎలా బేరీజు వేస్తారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి. అయితే మంత్రులను తొలగించకపోతే మిగిలిన వారిలో భయం ఉండదని, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కూడా కొందరు స్పందించకపోవడంపై కూడా చంద్రబాబు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts