YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కమలంపై గులాబీ సాఫ్ట్ కార్నర్...

కమలంపై గులాబీ సాఫ్ట్ కార్నర్...

హైదరాబాద్ , జనవరి 4, 
బీజేపీతో వైరం పెంచుకోవద్దని బీఆర్ఎస్ భావిస్తున్నదా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అధికారంలో ఉన్నంతకాలం బీజేపీని తూర్పారబట్టిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో సైలెంట్ అయిపోయారు.ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కేసు నమోదు చేసినప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక ఆడపిల్లపై బీజేపీ కేసు పెట్టించింది, బెదిరింపులకు భయపడేది లేదు, చిల్లర రాజకీయాలతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అంటూ కేసీఆర్, కేటీఆర్ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కవిత సైతం బీజేపీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, అదే ఈడీ ఇప్పుడు కేటీఆర్‌పైన ఫార్ములా ఈ – రేస్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ (ఈసీఐఆర్) నమోదు చేసి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసు జారీ చేస్తే ఒక్క మాట కూడా అనలేదు. ఇదే ఇప్పుడు గులాబీ లీడర్లలో చర్చకు దారితీసిందిఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ తరచూ మీడియా సమావేశాల్లో, చిట్‌చాట్‌లలో విమర్శిస్తున్నారు. కానీ, ఈడీ కేసు పెట్టిన విషయంలో, నోటీస్ ఇచ్చిన అంశంలో మాత్రం బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. కేటీఆర్ మాత్రమే కాకుండా హరీశ్‌ రావు, బీఆర్ఎస్ నేతలెవ్వరూ బీజేపీపై ఈ విషయంలో కామెంట్ చేయలేదు. భవిష్యత్తులో మరిన్ని ఈడీ కేసులు వస్తాయేమో, బీజేపీని ఇప్పుడు విమర్శిస్తే ఇబ్బందులుంటాయేమో అన్న భయంలో, ఆ పార్టీకి దగ్గర కావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు విమర్శలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.జనగణనలో కులగణన చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఒత్తిడి పెంచుతున్నా బీఆర్ఎస్ నేతలెవ్వరూ బీజేపీని కనీసంగా కూడా ప్రస్తావించడం లేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తీరును తప్పుపట్టిన బీఆర్ఎస్, ఇప్పుడు ఫార్ములా ఈ – రేస్ విషయంలో భిన్న వైఖరి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్‌ను ఈడీ చర్యల నుంచి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే బీజేపీకి ఆగ్రహం కలిగించకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు గులాబీ లీడర్లలో నెలకొన్నాయి.ఒకే పార్టీలో ఈడీ పట్ల వేర్వేరు సందర్భాల్లో రెండు రకాల పరిణామాలు చోటుచేసుకోవడం పలువురిని ఆచలోనలో పడేసింది. ఎలాగైనా కేటీఆర్‌ను ఈడీ కేసు నుంచి సేవ్ చేసుకోడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదనే మాటలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు, విలీనం చర్చలు జరుగుతూ ఉన్నాయని ఊహాగానాలు బలంగానే వినిపించాయి. సంధి దశలో బీజేపీపై ఎలాంటి కామెంట్లు చేసినా అది ఇబ్బందికి కారణమవుతుందేమోననే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఫార్ములా ఈ – రేస్ విషయంలో ఈడీని, బీజేపీని విమర్శించడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.

Related Posts