వరంగల్, జనవరి 4,
నిషేధిత మాంజా దారం విక్రయిస్తున్న వ్యాపారులపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. చైనా మాంజాను విక్రయిస్తుండటం వల్ల పక్షులకే కాకుండా మనుషులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా నిబంధనలకు విరుద్ధంగా మాంజా అమ్ముతున్న వ్యాపారులపై పోలీసులు నిఘా పెట్టారు.వరంగల్ సెంట్రల్ జోన్ కాజీపేట పీఎస్ పరిధిలో శుక్రవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాజీపేట విష్ణుపురి కాలనీలో గాలి పటాలు, చైనా మాంజా బిజినెస్ చేస్తున్న శనిగరపు అరవింద్, ఎండీ ఇస్సాక్, మంద శ్రీనాథ్, ఎండీ సాల్మన్ అనే నలుగురు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తంగా రూ.2.30 లక్షల విలువైన 115 బండిళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న మాంజా దారం బండిళ్లను కాజీపేట పోలీసులకు అప్పగించారు.సంక్రాంతి పండుగ సమయంలో సరదాగా ఎగురవేసే గాలి పటాలు.. జనాల ప్రాణాలు తీస్తున్నాయి. సాధారణ దారాలకు బదులు మార్కెట్‌లో చైనా మాంజా లభిస్తుండటంతో చాలామంది దానినే ఉపయోగిస్తున్నారు. నైలాన్, సింథటిక్ దారానికి ప్లాస్టిక్ పొడి పూసి మాంజాను తయారు చేస్తున్నారు. గాలి పటాలను ఎగురవేసే సమయంలో ఇతరుల పతంగుల దారాలను తెంపడం ఈ మాంజా దారంతో ఈజీ అవుతుంది. దీంతో చాలామంది ఈ చైనా మాంజానే వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు.కానీ దాని వల్ల జరుగుతున్న ప్రమాదాల గురించి మాత్రం ఆలోచించడం లేదు. పతంగి తెగిన తరువాత గాలిలో వేలాడుతున్న మాంజా రోడ్లపై వెళ్లే ప్రజలకు చుట్టుకుని గాయాల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో మాంజా అమ్మకాన్ని రాష్ట్రంలో నిషేధించారు. దిగుమతి చాలా వరకు ఆగిపోగా.. మాంజాకు ఉన్న డిమాండ్‌తో కొంతమంది ఇక్కడే తయారు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌లో మాంజా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.మాంజా దారంతో పక్షులతో పాటు ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. పతంగుల పండుగ స్టార్ట్ కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వివిధ ఘటనలు మాంజా ఎంత డేంజర్ అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొద్దిరోజుల కిందట జనగామ జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు వీక్షిత్.. తల్లిదండ్రులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా గొంతు భాగంలో మాంజా తగిలి తీవ్ర గాయమైంది. ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొంది ప్రాణాలు దక్కించుకున్నాడు.ఆ తరువాత బచ్చన్నపేటకు చెందిన సనత్‌కుమార్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి బండిపై వెళ్తుండగా.. మాంజా తగిలి సనత్ కుమార్ గొంతుకు తీవ్ర గాయమైంది. బైక్ అదుపు తప్పి కింద పడటంతో మిగతా ఇద్దరు స్నేహితులు గాయపడ్డారు. జనగామ పట్టణంలోని సిద్దిపేట రోడ్డులో కూడా ఇటీవల మాంజా తగిలి నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.రెండు రోజుల కిందట చంద్రుగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఏరువ కృష్ణారావు.. తన ద్విచక్ర వాహనంపై కొత్తగూడెం వైపు వెళ్తున్నారు. మాంజా గొంతుకు చుట్టుకుని వాయునాళం 75 శాతం వరకు తెలిగిపోయింది. మరో చేతితో మాంజా దారాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఆ చేతి వేళ్లకు కూడా గాయాలై తీవ్ర రక్త స్రావమైంది. రెండు రోజుల కిందట షాద్‌నగర్‌కు చెందిన రంగనాథ్, తన భార్యతో కలిసి ముచ్చింతల్ వైపు నుంచి వస్తున్నారు. మాంజా కారణంగా రంగనాథ్ గొంతు కొంతమేర కోసుకుపోయింది. దాన్ని తొలగించే క్రమంలో రంగనాథ్ భార్య చేతులకు కూడా గాయాలు అయ్యాయి.రంగారెడ్డి జిల్లాలో గురువారం బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలకు మాంజా దారం చుట్టు కోవడంతో.. వాళ్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇలా మాంజాతో తరచూ ప్రమాదాలు జరుగుతుండగా.. దానిని అరికట్టే విషయంలో అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.