న్యూఢిల్లీ, జనవరి 4
దేశంలోని 10 రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, కేరళ, మిజోరం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడు ఉన్నాయి. సీబీఐకి రాష్ట్రాల ఎంట్రీలో ఆ రాష్ట్రాల జనరల్ కన్సంట్ అవసరం లేదని తెలిపింది.అవినీతి కేసులో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు సీటీ రవికుమార్, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం జనవరి 2న కొట్టివేసింది. పోస్టింగ్ స్థలంతో సంబంధం లేకుండా, పై వాస్తవ పరిస్థితులను బట్టి వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/కేంద్ర ప్రభుత్వ అండర్‌టేకింగ్ ఉద్యోగులు అని, అలాగే అవినీతి నిరోధక చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని బెంచ్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో ఈ కేసు వచ్చింది.అయితే రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఈ నిబంధన తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్, కేరళ, మిజోరం, బెంగాల్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలలో అమలులో ఉంది. అయితే ఏపీలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తు చేయడాన్ని ఏపీ హైకోర్టు రద్దు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) విచారణ కోసం రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని తేల్చి చెప్పింది.