విశాఖపట్టణం, జనవరి 7,
ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి తోట కనిపిస్తే కొట్టేయండి లేదా కాల్చేయండి అని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాసాగు చేస్తున్న 8 ఎకరాల గంజాయి తోటల్ని అధికారులు ధ్వంసం చేశారు. అల్లూరి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చుతామని పోలీసులు చెబుతున్నారు. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నట్లు కనిపించినా, గంజాయి అక్రమ రవాణా గురించి తెలిసినా, డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించినా వెంటనే 1972 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. నేరాల నియంత్రణకు డ్రోన్లు, టెక్నాలజీ వినియోగించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పెదబయలు మండలంలోని కంతుర్లకు చేరుకున్న అధికారులు డ్రోన్ల సాయంతో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి సాగు నివారించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ ఐజీ రవికృష్ణ, ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, అటవీశాఖ అధికారులు పాతపాడు గ్రామంలో 8 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి (కానబిస్) తోటను ధ్వంసం చేశారు. జిల్లాలో కొన్ని రోజుల కిందట సైతం డ్రోన్ల ద్వారా పలుచోట్ల గంజాయి సాగు గుర్తించిన అధికారులు తోటల్ని ధ్వంసం చేశారు.ఇది అక్రమ సాగు నియంత్రణ కోసం చేపట్టిన ఆపరేషన్. ఈ ఆపరేషన్లో డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలు, A1 టూల్స్ ను ఉపయోగించి ఈ గంజా సాగులను గుర్తించి, వాటిని నాశనం చేయడంలో సహకరించాయని రవికృష్ణ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 2,000 ఎకరాలను డ్రోన్ సర్వే బృందం పర్యవేక్షించింది. డ్రోన్ల ద్వారా గంజాయి సాగును గుర్తించి, గంజాయి తోటల్ని నాశనం చేయడం తమ లక్ష్యమన్నారు. అనంతరం వ్యక్తిగతంగా పాతపాడు గ్రామ ప్రజలతో సమావేశమై గంజాయి సాగువల్ల కలిగే దుష్ప్రరిణామాలు వివరించారు. వీటి కేసులలో ఇరుక్కుని జైలుకు వెళితే జీవితం నాశనం అవుతుందని వారికి నష్టాలపై అవగాహన కల్పించారు.గిరిజనులు చేసే గంజా సాగు వల్ల గ్రామంతో పాటు సమాజం భవిష్యత్తుకు ఏర్పడే హానిని ప్రస్తావించారు. గిరిజనులు, గ్రామస్తులు ఇక నుంచి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రతిజ్ఞ చేయించారు. వారికి ప్రత్యామ్నాయ పంటలను అందించడానికి పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖలు సాయం చేస్తాయని హామీ ఇచ్చారు. ఈ ఏడాది పాతపాడులో కింగ్ బీన్స్, రాజ్మ, మిల్లెట్ వంటి ప్రత్యామ్నాయ పంటలను అందజేసినట్లు తెలిపారు.అల్లూరి సీతారామరాజు పోలీస్ విభాగం, స్థానిక గ్రామాలతో కలిసి మరింత శాశ్వతమైన, చట్టబద్ధమైన వ్యవసాయ పద్ధతుల వైపు మారేందుకు సహాయం చేస్తామన్నారు. మెరుగైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని వారికి సూచించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఈగల్ ఐజీ రవి కృష్ణ, ఈగల్ ఎస్పీ నాగేశ్ బాబు, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, డీఎస్పీ ప్రమోద్, డీఈవో బ్రహ్మాజీరావు, ఫారెస్ట్ అధికారులు, జల్లా పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.