హైదరాబాద్, జనవరి 7,
ప్రముఖ నిర్మాత దిల్‍రాజు భారీ బడ్జెట్ వెచ్చించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే, తెలంగాణలో పరిస్థితి వేరుగా ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. సినిమాల బెనెఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పేసింది. అయితే, తనకు ఇంకా ఆశ ఉందని దిల్‍రాజు తాజాగా అన్నారు. దీనిపై టాలీవుడ్ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. వివరాలివే.. తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కదా అని మీడియా సమావేశంలో దిల్‍రాజుకు ప్రశ్న ఎదురైంది. అయితే, సినిమా రంగానికి ఏం కావాలంటే అది ఇస్తానని స్పీచ్‍లో రేవంత్ రెడ్డి అన్నారని దిల్‍రాజు గుర్తు చేశారు. అన్ని ఇస్తామన్నారని, ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారని తెలిపారు. “అన్నీ ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. నేను ఆ ఆశతో ఉన్నా. మళ్లీ అసెంబ్లీ స్పీచ్ చూడండి. అన్నీ ఇస్తాను అంటున్నారు. అడగలేదంటే.. ఆకలైనా అమ్మ కూడా అన్నం పెట్టదుగా” అని చెప్పారు. ఏపీలో టికెట్ ధరలు పెంచారని.. మీరు కూడా పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతానని, తుది నిర్ణయం ఆయనదే అని అన్నారు. ఇక సినిమాలకు టికెట్ ధరలు పెంచేదే లేదని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల స్పష్టంగా చెప్పేసింది. ఇదేం ముఖ్యమైన విషయం కాదని, పెద్ద అంశాలపై చర్చించామని సీఎంను కలిసి సమయంలో దిల్‍రాజు చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‍మెంట్ కార్పొరేషన్ చైర్మన్‍గా ఉన్న ఆయన అలా అనడంతో.. ఇక టికెట్ ధరల పెంపు ఉండదేమో అని దాదాపు టాలీవుడ్ వర్గాలు ఫిక్స్ అయ్యాయి. అయితే, తాను మళ్లీ సీఎంను అడుగుతానని, గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ ధరల పెంపు ఉంటుందనే ఆశ ఉందని దిల్‍రాజు తాజాగా చెప్పారు.టికెట్ ధరల పెంపుపై దిల్‍రాజు నమ్మకంగా ఉండడంపై టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవేళ గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచితే.. ఇతర సినిమాకు కూడా అవకాశం ఉంటుందని ఇతర నిర్మాతలు ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులోనూ టికెట్ రేట్ల పెంపు ఉంటుందని అనుకుంటున్నారు. ఇది తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని దిల్‍రాజు ఎప్పుడు కలుస్తారో.. టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొని ఉంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.సంక్రాంతికి విడుదల కానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే జీవోలు కూడా జారీ చేసింది. గేమ్ ఛేంజర్ మూవీకి మిడ్‍నైట్ బెనెఫిట్ షోకు కూడా అనుమతి జారీ చేసింది. డాకు మహారాజ్‍కు జనవరి 12 తెల్లవారు జామున బెనెఫిట్ షోకు ఓకే చెప్పింది. తెలంగాణ ప్రభుత్వంతో దిల్‍రాజు నెక్స్ట్ మీటింగ్, ఫైనల్ నిర్ణయం కోసం టాలీవుడ్ అంతా నిరీక్షిస్తోంది.