న్యూడిల్లీ జనవరి 7
టిబెట్-నేపాల్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో దాదాపు 53 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 38 మంది గాయపడినట్లు తెలిపారు.మంగళవారం ఉదయం చైనాలోని టిబెట్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో చాలా మంది శిథిలాల క్రింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి.. శిథిలాల క్రింద చిక్కుకుపోయిన వారిని రక్షించి.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.మంగళవారం ఉదయం 6.35 గంటల సమయంలో టిబెట్ రాజధాని లాసా నుండి 380 కిలోమీటర్లు దూరంలో 10 కిలోమీటర్ల (6 మైళ్లు) లోతులో భూకంపం కేంద్రం ఏర్పడిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. చైనాలో దీని తీవ్రత 6.8గా నమోదైందని పేర్కొంది.ఇక, బీహార్ రాజధాని పాట్నా సహా బీహార్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం భూకంపం ప్రభావం పడింది. ఉదయం 6.38 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాట్నాతో పాటు సహార్సా, సీతామర్హి, మధుబని, అర్రాతో సహా పలు జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి.